ఆళగిరి అడ్రస్ ఎక్కడ…?

కరుణానిధి కుమారుడు, స్టాలిన్ సోదరుడు ఆళగిరి రాజకీయాలకు దూరంగా ఉండిపోయినట్లేనా? కరుణానిధి మరణానంతరం హడావిడి చేసిన ఆళగిరి ఆ తర్వాత మౌనంగా ఎందుకున్నారు? సమయం కోసం వేచి [more]

Update: 2019-07-31 18:29 GMT

కరుణానిధి కుమారుడు, స్టాలిన్ సోదరుడు ఆళగిరి రాజకీయాలకు దూరంగా ఉండిపోయినట్లేనా? కరుణానిధి మరణానంతరం హడావిడి చేసిన ఆళగిరి ఆ తర్వాత మౌనంగా ఎందుకున్నారు? సమయం కోసం వేచి చూస్తున్నారా? లేక సోదరుడితో రాజీ పడాలని భావిస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. తనకు పార్టీలోకి తీసుకోవాలని ఆళగిరి కుటుంబ సభ్యులపై వత్తిడి తెచ్చినా స్టాలిన్ ససేమిరా అన్నారు.

డీఎంకే లో చేరాలని…

తమిళనాడు లోని మధురై ప్రాంతంలో ఆళగిరికి మంచి పట్టుంది. కరుణానిధి జీవించి ఉన్నప్పుడే ఆళగిరి మధురై కేంద్రంగా రాజకీయాలు నెరిపేవారు. ఇప్పటికీ ఆయనకు అక్కడ తనకంటూ ఒక వర్గముంది. కరుణానిధి మరణానంతరం తనకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని స్టాలిన్ పై వత్తిడి తెచ్చారు ఆళగిరి. ఈ మేరకు డీఎంకే కార్యకర్తలతో చెన్నైలో పెద్దయెత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీని నిర్వహించి తన సత్తాను చాటాలని ప్రయత్నించారు.

స్టాలిన్ ససేమిరా అనడంతో….

అయినా స్టాలిన్ మాత్రం సోదరుడు ఆళగిరిని పార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో ఆళగిరి భారతీయ జనతా పార్టీలో చేరతారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఒకానొక దశలో ఆళగిరి కొత్త పార్టీని పెడతానని కూడా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అప్పట్లో తమిళనాడులో ఆళగిరి కొత్త పార్టీకి సంబంధించి పోస్టర్లు కూడా గోడల మీద కన్పించాయి. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నుంచి కూడా బరిలోకి దిగుతానని అప్పట్లో ప్రకటించారు.

ఎటువైపు చూస్తున్నారు…?

కానీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే సత్తా చాటింది. డీఎంకే కూటమి దాదాపు తమిళనాడులో ఒక్క నియోజకవర్గం తప్ప క్లీన్ స్వీప్ చేసేసింది. శాసనసభలో కూడా డీఎంకే బలం పెరిగింది. భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే కూటమిలో ఉండటంతో ఆళగిరి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పడు ఆళగిరి రజనీకాంత్ పెట్టబోయే కొత్త పార్టీవైపు చూస్తున్నారన్న టాక్ వినపడుతుంది. అయితే ఆళగిరి జాడ మాత్రంకన్పించడం లేదు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News