ఆంధ్రప్రదేశ్ కు అదో రకం వైరస్

రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదాల్లో చిక్కుకుంది. స్థానిక ఎన్నికల వాయిదాపై వైసీపీ ప్రభుత్వం వర్సస్ ఎన్నికల సంఘం అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న [more]

Update: 2020-03-15 16:30 GMT

రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదాల్లో చిక్కుకుంది. స్థానిక ఎన్నికల వాయిదాపై వైసీపీ ప్రభుత్వం వర్సస్ ఎన్నికల సంఘం అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలోని మంచి చెడ్డల సంగతి పక్కనపెడితే రాష్ట్రంలోని రాజకీయాలకు కమిషన్ ప్రతిష్ఠను బలి పశువును చేసేందుకు రెండు పక్షాలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఇవ్వకుండా, ఉన్నతాధికారులతో చర్చించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై తాడోపేడో తేల్చుకోవాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. ఇందుకు సంబంధించి అన్నిరకాల తరుణోపాయాలను అన్వేషిస్తోంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా, ప్రతికూలంగా రెండు వైపులా సాంకేతిక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎవరి కోణంలో వారు విశ్లేషిస్తున్నారు. నిన్నామొన్నటివరకూ ఎన్నికల సంఘం మూగబోయింది. ప్రేక్షకపాత్ర వహిస్తోందంటూ ధ్వజమెత్తింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఈరోజున అదే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సమంజసమంటూ భుజాన మోస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను వెనకేసుకు వచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా విరుచుకుపడుతోంది.

కరోనా పాలిటిక్స్…

కరోనా వ్యాధి రాష్ట్రంలో చూపించే ప్రభావం తక్కువే. కానీ రాజకీయాలకు మాత్రం కరోనా సోకిందని చెప్పక తప్పదు. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రతి విషయాన్ని విషతుల్యం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారులు పనిచేయాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితి ఏర్పడింది. గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారులు సైతం ఇరువైపుల నుంచి వస్తున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు. అధికారంలో ఉన్నాం. చెప్పినట్లు చేయాల్సిందేనంటూ అధికారపార్టీ హుంకరిస్తోంది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం. మీ సంగతి చూస్తామంటూ ప్రతిపక్షం బెదిరిస్తోంది. ఈ ధోరణి గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరింది. దిగువస్థాయి అధికారులనే కాకుండా అఖిలభారత సర్వీసు అధికారులను సైతం హెచ్చరించే స్థాయికి రాజకీయాలు చేరిపోయాయి. దేశంలో కరోనా రెండో దశకు చేరింది. అంటే విదేశాల నుంచి వచ్చేవారి నుంచే కాకుండా స్థానికంగా ఉన్నవారి నుంచి కూడా ఇతరులకు వ్యాపించే దశకు చేరింది. దీనినే ప్రధానంశం చేసుకుంటూ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్నారు. అందువల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు పెరుగుతాయనే అనుమానంతో ముందు జాగ్రత్తగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.

రాజ్యాంగ బద్ధత…

ఎన్నికలు వాయిదా వేసిన సందర్భంలో కమిషనర్ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. స్థానిక అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదంటూ కమిషనర్ తన అసంతృప్తిని వెల్లడించారు. అదే సమయంలో ఇద్దరు జిల్లా కలెక్టర్లను, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ కు అధికారుల బదిలీ అధికారం లేదంటూ నిలదీస్తున్నారు. ఇదే అంశంపై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు. కమిషనర్ తీసుకున్న నిర్ణయంలోని విషయాలను ప్రశ్నించవచ్చు. అయితే అధికారం లేదని చెప్పలేం. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత యంత్రాంగం మొత్తం కమిషన్ పరిధిలో పని చేస్తుంది. అన్నిపార్టీలకు సమాన అవకాశం ఉండేలా నిష్పాక్షికంగా యంత్రాంగాన్ని పని చేయించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. ఇందుకు విరుద్దంగా సాగుతున్నట్లు ఎన్నికల కమిషన్ కు తగిన ఆధారం లభిస్తే అధికారులను బదిలీ చేసే అధికారం ఉంటుంది. అదే విధంగా 25 లక్షల మంది కి ఉగాది సందర్బంగా ఇళ్ల పట్టాల పంపిణీకి పెట్టుకున్న ముహూర్తాన్ని సైతం కమిషన్ నిలిపి వేసింది. దీనిని కూడా ప్రభుత్వం సవాల్ చేస్తోంది. లబ్ధిదారులు ఓటర్ల కోటాలోకే వస్తారు కాబట్టి ఈవిషయంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టలేం. మరో ముహూర్తానికి ప్రభుత్వం పంపిణీ చేయవచ్చు. కమిషనర్ ను మార్చాలన్న డిమాండ్ సైతం కొన్ని వర్గాల నుంచి వినవస్తోంది. అయితే అదంత సులభ సాధ్యం కాదు.

ఇద్దరూ దోషులే…

ఎన్నికల కమిషన్ ను సాకుగా చేసుకుంటూ రచ్చ చేస్తున్న టీడీపీ, వైసీపీ అధినేతలు ఇద్దరూ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన నిందితులే. మార్చి 31 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోతే దాదాపు ఆరువేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోతాయి. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సొమ్ములు అవి. ఇప్పుడు ఆదరాబాదరాగా 15 రోజుల్లోపుగానే ఎన్నికలు ముగించాలనుకోవడానికి ప్రధాన కారణం కూడా నిధులే. స్థానిక ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ఎన్నికలు పెట్టడం లేదు. డబ్బులు పోతాయనే బాధతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు పెడుతున్నారు. నిజానికి 2018 లోనే పంచాయతీలకు గడువు ముగిసినా చంద్రబాబు పట్టించుకోలేదు. గడచిన తొమ్మిదినెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకూ తొందరపడలేదు. తన పథకాల అమలుకే ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు రాకపోతే ఈ రెండు పార్టీలనే నిందించాల్సి ఉంటుంది. సకాలంలో ఎన్నికలు జరపడంలో ఎన్నికల కమిషన్ కంటే ప్రభుత్వాలదే బాధ్యత. రిజర్వేషన్లు మొదలు ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం సెలవిచ్చిన తర్వాతనే ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగుతుంది. తాజా పరిస్థితుల్లో రాష్ట్రం నష్టపోకుండా కేంద్రంతో మాట్టాడుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎలాగూ కరోనా వైరస్ పై కేంద్రం అప్రమత్తం కావాలంటూ సూచనలు చేస్తోంది. అందులో భాగంగానే అనివార్యంగా ఎన్నికలు వాయిదా వేశామని కేంద్రాన్ని ఒప్పించాలి. నిధుల విడుదలను నిలిపివేయకుండా చూసుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈసారికి మా డబ్బులు మాకిచ్చేయండి అని అధికార, ప్రతిపక్షాలు కేంద్రానికి విన్నవించుకోవడం ఉత్తమం. రెండు పక్షాలు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తే కేంద్రం నుంచి చిల్లి గవ్వ రాదు. అసాధారణ పరిస్థితుల్లో తమ పరపతిని వినియోగించుకోవడం పై దృష్టి సారిస్తే మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News