అవి అమలయితే మంచి మార్కులేనట

అడిగిన వారికి అడగని వారికి సైతం ఎన్నికల ముందు పాదయాత్రలో వైసిపి అధినేత వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. మ్యానిఫేస్టో కూడా ఒక పవిత్ర గ్రంధం [more]

Update: 2019-07-22 06:30 GMT

అడిగిన వారికి అడగని వారికి సైతం ఎన్నికల ముందు పాదయాత్రలో వైసిపి అధినేత వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. మ్యానిఫేస్టో కూడా ఒక పవిత్ర గ్రంధం గా భావించి అందులో చెప్పినవన్నీ చేయడమే తమ పని అని ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రకటించారు.. మొత్తానికి వైఎస్ జగన్ ఆశించిన విధంగానే బంపర్ మెజారిటీ తో అధికారాన్ని చేపట్టింది. ఇక్కడి వరకు బాగానే వున్నా నిధుల లేమితో వున్న రాష్ట్రం లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలంటే సర్కార్ కి తలనొప్పులు అన్ని ఇన్ని కావు. దాంతో దీనికి విరుగుడు కనిపెట్టేందుకు వైఎస్ జగన్ పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసి ఆగస్టు నుంచి అమల్లో పెడుతున్నట్లు ప్రచారం సాగుతుంది.

లెక్క సరిగ్గా ఉంటే ….

అమ్మ ఒడి తో పాటు పెన్షన్లు, రేషన్ వంటి వాటితో బాటు అనేక సంక్షేమ పథకాలకు నగదును నేరుగా లబ్ది దారుడి ఖాతాలో వేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రక్రియ కు ముందు ప్రక్షాళన అవసరమని భావించే ఆయన గ్రామ వాలంటీర్ల ఘట్టానికి తెరలేపారని అంటున్నారు. నాలుగున్నర లక్షలమందికి ఒకే సారి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరగలేదు. అది కూడా అరకొర నిధులతో లోటు బడ్జెట్ లో వున్న రాష్ట్రం లో జరుగుతుందని కూడా ఏ ఒక్కరు ఊహించలేదు. కానీ వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. అలా చేయడానికి అల్పాదాయ వర్గాలు ఎవరు ? మధ్యతరగతి ఎవరు ? ధనిక వర్గాలు ఏవి అనేది ఓట్ల కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఖచ్చితమైన లెక్కలను వెలికి తీసి ఎవరికి దక్కాలిసిన సంక్షేమం వారికి దక్కేలా చేయకపోవడం. అందువల్ల ప్రభుత్వం ఏ పథకం పేదలకోసం తెచ్చినా అన్ని వర్గాలు తెల్లరేషన్ కార్డు తో లబ్ది పొందుతూ వస్తున్నాయి.

ముందుగా కార్డు ల తొలగింపు …

ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండటం వల్ల అక్రమ లబ్ది దారులను గుర్తించడం అతి తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యం అవుతుంది. దీనికి తోడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆధార్ ను పాన్ కార్డు ను జత చేసే విధానం ఆగస్టు చివరికి పూర్తి కావాలని సంకల్పించింది. ఈ వివరాల తో పక్కా ఆదాయాన్ని పరిగణలోనికి తీసుకుని ప్రజలకు పథకాలను అమలు చేసే వీలు చిక్కుతుంది. కార్లు, భవంతులు వున్న వారు సైతం తెల్ల రేషన్ కార్డు ల ద్వారా ఒనగూరే ప్రయోజనాలు పొందుతున్నారు. రేపు వైఎస్ జగన్ సర్కార్ మొదలు పెట్టబోయే అమ్మ ఒడి పథకానికి సైతం తెల్ల కార్డుల వాళ్లే అత్యధికమంది లబ్ది పొందే అవకాశం వుంది. అందుకే ముందుగా పాలు నుంచి నీరు ను వేరు చేసే ప్రయత్నం చేయక తప్పలేదు ప్రభుత్వానికి.

వ్యతిరేకత వస్తుందనే …

తెల్ల రేషన్ కార్డు లను తొలగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబికే ప్రమాదం వుంది. డబ్బున్న వారు సైతం భరించలేని వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ పథకం రక్షిస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు తెల్లరేషన్ కార్డు పొందాలని అడ్డదారులు సైతం తొక్కారు. ఇది గమనించిన వైఎస్ జగన్ సర్కార్ మొన్నటి తాజా బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల ఆదాయం లోపు వారికి వర్తించేలా మార్పు తెస్తూ ప్రకటించింది. మధ్యతరగతి వర్గాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ కి ఆదాయ పరిమితి పెంచినట్లు తెలుస్తుంది.

ప్రతి కుటుంబం వివరాలు ….

గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబం వాస్తవిక పరిస్థితి ని ప్రభుత్వం డేటా రూపం లో సేకరిస్తుంది. సర్కార్ పథకాలు నేరుగా ఆయా కుటుంబాలకు అందించడం తో బాటు విలువైన సమాచారం సేకరించడం ద్వారా పన్నుల మధింపును చేసే వెసులుబాటు లభిస్తుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటివరకు ప్రభుత్వం తరపున ఎలాంటి సర్వే చేయాలన్నా, సమాచారం కానీ పథకాలు కానీ ప్రచారం చేయాలన్నా స్కూల్ ఉపాధ్యాయులను, వినియోగించేవారు. దీనివల్ల ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్లు లేక బోధన సైతం దెబ్బ తింటుంది. ఇప్పుడు ఆ సమస్యలన్ని దూరం చేసేందుకే ప్రత్యేక వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం చేస్తున్నారు. ఈ గ్రామ సేవకుల తీరు గతంలో జన్మభూమి కమిటీల మాదిరి కాకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసేలా సర్కార్ వారి విధులకు రూపకల్పన చేయడం విశేషం. అయితే కార్యాచరణలో వైఎస్ జగన్ ఆలోచనలన్ని సక్రమంగా అమలైతే మాత్రం వైసిపి సర్కార్ కి మంచి మార్కులే పడతాయి. విఫలం అయితే ఆదిలోనే ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికే ప్రమాదం పొంచి వుంది.

Tags:    

Similar News