తిరుపతిలో లోకల్ రిజల్ట్ వేరు… ఉప ఎన్నిక రిజల్ట్ వేరా ?
ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. కరోనాతో సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతితో [more]
ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. కరోనాతో సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతితో [more]
ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. కరోనాతో సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల చివర్లో లేదా మార్చిలో ఖచ్చితంగా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఆ వెంటనే మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతాయి. అయితే తిరుపతిలో ఈ స్థానిక పోరులో వచ్చిన ఫలితాలే ఉప ఎన్నికల్లో వస్తాయా ? అంటే రాజకీయ వర్గాలే కాకుండా.. మాంచి ఉత్సాహంతో ఉన్న అధికార పార్టీ వాళ్లు సైతం ఖచ్చితంగా అవుననే చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పలు నియోజకవర్గాల్లో గ్రూపుల గోల మామూలుగా లేదు.
ఇక్కడే అత్యధికంగా…..
అయితే స్థానికం విషయానికి వస్తే టీడీపీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో చూపించిన జోరు ఇక్కడ చూపించడం లేదు. ఈ పార్లమెంటు పరిధిలో చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకుండానే చేతులు ఎత్తేస్తున్నారు. మరికొన్ని చోట్ల వైసీపీ వాళ్లు బతిమిలాడో.. బెదిరించో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 106 సర్పంచ్ స్థానాలు తొలివిడతలో ఏకగ్రీవం కావడమే ఇందుకు నిదర్శనం. ఆ మాటకు వస్తే గత సాధారణ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో కలిపి ఉన్న 34 సీట్లకు ఒక్క చంద్రబాబు మాత్రమే గెలిచారు. ఇప్పుడు స్థానిక పోరులోనూ టీడీపీ వాళ్లలో పార్టీకి బలమైన నేతలు ఉన్న గ్రామాల్లో మినహా పోటీ ఇచ్చేవాళ్లే కాదు.. చేసే వాళ్లు లేరు. ఇక స్థానికంగా ఎలాంటి బలమైన కేడర్ లేని జనసేన, బీజేపీ కూటమి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
జగన్ ఇచ్చిన టార్గెట్ ను…..
ఇక చాలా పల్లెల్లో ఏకగ్రీవాలు అయితే వాళ్లకు ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదు.. కొందరు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నా అది సాధ్యం కాదు. ఇక పల్లె రాజకీయాల్లో అధికార పార్టీకి ఎందుకు అనవసరంగా టార్గెట్ అవ్వడం అన్న భావన సహజంగానే ఎవరికి అయినా ఉంటుంది. అది ఇప్పుడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరింత ఎక్కువుగా ఉంది. చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి పోటీలో ఉన్న టీడీపీ వాళ్లను రకరకాల రూట్లలో దారికి తెచ్చేసుకుంటున్నారు. మంత్రులకు జగన్ ఏకగ్రీవాల టార్గెట్లు ఇచ్చారన్న వార్త అక్షరాలా నిజం అనిపించేలా నేరుగా వారే రంగంలోకి దిగి పోటాపోటీగా ఏకగ్రీవాలు చేసేస్తోన్న పరిస్థితి.
ఉప ఎన్నికల్లో అంత జోరు ఉండదా ?
ఈ స్థానిక ఎన్నికల జోరు ఉప ఎన్నికల్లో ఉంటుందా ? అంటే ఖచ్చితంగా వైసీపీకి ఉండదనే తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ లోక్‌సభ సీటును వైసీపీ ఏకంగా 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఈ సారి అంత సీన్ ఉండదనే వైసీపీ వాళ్లే ఒప్పుకుంటున్నారు. పార్లమెంటు నియెజకవర్గ పరిధిలో ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉండగా. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఓ సామాజిక వర్గం దూకుడుతో పార్టీ రెండుగా చీలింది. వీరంతా తమ పదవులకేం ముప్పులేదు.. మేం ఎంత కష్టపడినా మాకు మంత్రి పదవో.. మరొకటో రాదు… మాకు గుర్తింపు లేనప్పుడు మేం మరీ చొక్కాలు చించుకోవాల్సిన అవసరం లేదన్న భావనతోనే ఉన్నారు.
అసంతృప్తితో…..
వెంకటగిరిలో ఆనం రచ్చ మామూలుగా లేదు. ఇవన్నీ ఇలా ఉంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఓట్లేయలేని ఓటర్లు, సింబల్‌తో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో చాలా మంది ఓటు విషయంలో నిర్ణయం మార్చుకుంటారు. దీనికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిసి స్థానికంలో అధికార పార్టీ చూపించే జోరు ఉప పోరులో మాత్రం సేమ్ ప్రతిబింబించదనే అక్కడ పరిస్థితులు చెపుతున్నాయి. ఇక బీజేపీ – జనసేన చాలా చోట్ల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవు.. రేపు ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ సింబల్ పోటీలో ఉన్నా అది కూడా ఎక్కువగా అధికార పార్టీకే మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. నెలరోజుల తేడాలో జరిగే ఈ రెండు ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తాడు ? ఒకే తీర్పు ఏకపక్షంగా ఇస్తాడా ? లేదా అన్నది ఆసక్తికరమే ?