ఇక ఈ బ్యాచ్ గతి ఇంతేనా?

బీజేపీ లో చేరి చక్రం తిప్పాలనుకున్నవారికి ఇప్పుడు అస్సలు కుదరడం లేదు. తమ పార్టీ అధికారంలో లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి మారి రాష్ట్రంలో ఆధిపత్యం [more]

Update: 2020-10-27 02:00 GMT

బీజేపీ లో చేరి చక్రం తిప్పాలనుకున్నవారికి ఇప్పుడు అస్సలు కుదరడం లేదు. తమ పార్టీ అధికారంలో లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి మారి రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించాలనుకున్న వారు ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారు. బాబు బ్యాచ్ గా పేరొందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు ఇటీవల కాలంలో బీజేపీలో మౌనం పాటిస్తున్నారు. టీజీ వెంకటేశ్ ను దీని నుంచి మినహాయించవచ్చు. ఎందుకంటే ఆయన టీడీపీకి వీర విధేయుడేమీ కాదు.

కొన్ని నెలలకు ముందు…..

కొన్ని నెలల ముందు వరకూ సుజనా చౌదరి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అమరావతి నుంచి పోలవరం వరకూ సుజనా చౌదరి వదలిపెట్టకుండా విమర్శలు చేస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో అమరావతిపై నిర్ణయం తీసుకుంటుందని కూడా పదే పదే చెబుతూ వచ్చారు. ఇదంతా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత వరకే. చివరకు ఏపీ ప్రభుత్వం తొలగించిన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కూడా సుజనా చౌదరి భేటీ అవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

సోము వచ్చిన తర్వాత….

కానీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత సుజనా చౌదరి డల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే సోము వీర్రాజు టీడీపీని తొలి శత్రువుగా చూస్తున్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేయాలన్నది సోము వీర్రాజు లక్ష్యం. కానీ సుజనా చౌదరికి మాత్రం వైసీపీయే ప్రధాన శత్రువు. దీంతో సోము వీర్రాజు వైఖరి తెలిసి సుజనా చౌదరి గత నెలలుగా మౌనంగా ఉంటున్నారు.

ఏరివేత ప్రారంభించడంతో…..

అంతేకాదు సుజనా చౌదరి సన్నిహితులను కూడా సోము వీర్రాజు వదిలిపెట్టడం లేదు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన లంకా దినకర్ ను సోము వీర్రాజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2019 ఎన్నికల తర్వాత సుజనా చౌదరితోపాటు లంకా దినకర్ కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరారు. వీరి చేరిక ప్రధాన ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే అయినా, పార్టీ మాత్రం ఇప్పటి వరకూ ఉపేక్షిస్తూ వచ్చింది. కానీ సోము వీర్రాజు ఏరివేతల కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఇక ఆ బ్యాచ్ కి బెంగపెట్టుకుందన్న టాక్ విన్పిస్తుంది.

Tags:    

Similar News