ఆ ఉప్పుతిన్నందుకు ఏదో ఒకటి చేయాలిగా?

ఆ ఇంటి ఉప్పుతిన్నందుకు విశ్వాసం ఉండాలి.  చూపించాలి కూడా.  రుణం తీర్చుకోవాలి. లేకుంటే మనిషి అన్న పదానికే విలువ ఉండదు. రాజకీయాల్లో ఈ విశ్వాసం లేదనే చెప్పాలి. [more]

Update: 2021-07-18 06:30 GMT

ఆ ఇంటి ఉప్పుతిన్నందుకు విశ్వాసం ఉండాలి. చూపించాలి కూడా. రుణం తీర్చుకోవాలి. లేకుంటే మనిషి అన్న పదానికే విలువ ఉండదు. రాజకీయాల్లో ఈ విశ్వాసం లేదనే చెప్పాలి. తరచూ పార్టీలు మారడం అలవాటుగా మారింది. పార్టీ మారిన తర్వాత తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీనే విమర్శించే నేతలు కోకొల్లలు. కానీ పార్టీ మారినా తనకు పదవులను కట్టబెట్టిన పార్టీని విస్మరించని నేతలు అరుదుగా ఉంటారు. అందులో రాజ్యసభ ఛైర్మన్ సుజనా చౌదరి ఒకరు.

బలవంతపు చేరికే…..

సుజనా చౌదరి రాజ్యసభకు తెలుగుదేశం పార్టీలో ఉండగానే ఎన్నికయ్యారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా పేరు. పార్టీని కష్టకాలంలో ఆర్థికంగా కూడా ఆదుకున్నాడంటారు. సుజనా చౌదరి గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీని వీడారు. ఇది బీజేపీలో బలవంతపు చేరికే. తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనా చౌదరి బీజేపీలో చేరారన్నది వాస్తవం. ఇందుకు చంద్రబాబు అంగీకారం కూడా ఉందనడం కాదనలేం.

బలహీనంగా ఉండటంతో….

కానీ ఇప్పుడు సుజనా చౌదరికి చంద్రబాబు బిగ్ టాస్క్ ను అప్పగించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉంది. క్యాడర్ లోనూ, నేతల్లోనూ మనోధైర్యం దుర్భిణీ వేసినా కన్పించడం లేదు. పార్టీని గట్టెక్కించాలంటే బీజేపీ సహకారం అవసరం. తమకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఉందని తెలిస్తే నేతలు ధైర్యంగా జెండా పట్టుకుని ముందుకు వస్తారు. అందుకే సుజనా చౌదరికి ఈ బాధ్యతను అప్పగించారు.

వరస భేటీలతో….

ఇటీవల సుజనా చౌదరి ఢిల్లీలో పలు బీజేపీ నేతలతో వరస సమావేశాలు జరుపుతున్నారు. బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి శివప్రకాశ్ తో సమావేశమయ్కారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికే ఈ సమావేశం అని బయటకు చెబుతున్నా, సుజనా చౌదరి మాత్రం బీజేపీకి టీడీపీని చేరువ చేసే ప్రయత్నాల్లో భాగమేనని చెప్పకతప్పదు. బీజేపీ పెద్దలను టీడీపీతో పొత్తుకు ఒప్పించేందుకు సుజనా చౌదరి హస్తినలో శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వరస భేటీలు జరుపుతున్నారు.

Tags:    

Similar News