సుజనా పని అంతా అదేనట

సుజనా చౌదరి రాజ్యసభ పదవీకాలం త్వరలో పూర్తికావస్తుంది. ఆయన బీజేపీలో ఉంటారా? తిరిగి టీడీపీలోకి వస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. గత కొంత కాలంగా సుజనా [more]

Update: 2021-06-15 08:00 GMT

సుజనా చౌదరి రాజ్యసభ పదవీకాలం త్వరలో పూర్తికావస్తుంది. ఆయన బీజేపీలో ఉంటారా? తిరిగి టీడీపీలోకి వస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. గత కొంత కాలంగా సుజనా చౌదరి సైలెంట్ గా ఉన్నారు. అనేక విషయాల్లోనూ ఆయన పట్టించుకోవడంలేదు. అమరావతి రాజధాని, రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వంటి విషయాల్లోనూ సుజనా చౌదరి స్పందించలేదు. ఆయన బీజేపీ, టీడీపీల పొత్తుకోసం ఢిల్లీలో లాబీయింగ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

తొలి నుంచి టీడీపీకి….

సుజనా చౌదరి తొలి నుంచి తెలుగుదేశంపార్టీ మద్దతు దారు. ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచే తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచేవారు. పారిశ్రామికవేత్తగా ఉన్న సుజనా చౌదరి రాజకీయాల్లోకి రావడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని చెప్పకతప్పదు. లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ కాకముందు వరకూ సుజనా చౌదరి హవా పార్టీలో నడిచేది. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ టీడీపీ హయాంలోనే జరిగింది.

మొన్నటి వరకూ యాక్టివ్ గానే?

మొన్న ఎన్నికల సమయంలోనూ అభ్యర్థుల ఎంపికలో సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఓటమి తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. వైసీపీ ప్రభుత్వం నుంచి పార్టీని కాపాడుకోవడానికే రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీలోకి పంపినట్లు ప్రచారం ఉంది. అయితే తొలినాళ్లలో సుజనా చౌదరి బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతవరకూ ఆయన యాక్టివ్ గానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఢిల్లీలో లాబీయింగ్…?

సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత మాత్రం సుజనా చౌదరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తును ఏర్పరచడమే. ఇటీవల మహానాడులో బీజేపీకి అనుకూలంగా చేసిన తీర్మానాలను సయితం సుజనా చౌదరి బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. టీడీపీకి అనుకూలంగా ఢిల్లీలో ఆయన లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మొత్తం మీద సుజనా చౌదరి సైలెంట్ గా ఉన్నప్పటికీ ఢిల్లీలో తన పని తాను చేసుకుపోతున్నారంటున్నారు.

Tags:    

Similar News