బాబు కట్టప్పను మించినోడు
ఎపి లో జండా ఎగురవేసేందుకు బిజెపి తహతహలాడిపోతోంది. దానికోసం సానుకూల అంశాలన్నీ పరిశీలించి పరిశోధిస్తుంది. కమలం పార్టీ ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ ఈ ఆపరేషన్ కి [more]
ఎపి లో జండా ఎగురవేసేందుకు బిజెపి తహతహలాడిపోతోంది. దానికోసం సానుకూల అంశాలన్నీ పరిశీలించి పరిశోధిస్తుంది. కమలం పార్టీ ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ ఈ ఆపరేషన్ కి [more]
ఎపి లో జండా ఎగురవేసేందుకు బిజెపి తహతహలాడిపోతోంది. దానికోసం సానుకూల అంశాలన్నీ పరిశీలించి పరిశోధిస్తుంది. కమలం పార్టీ ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ ఈ ఆపరేషన్ కి ప్రత్యేకంగా నియమించారు అమిత్ షా. త్రిపురలో మూడు దశాబ్దాల కమ్యూనిస్ట్ ల కోటను బద్దలు కొట్టిన వ్యూహం సునీల్ దేవధర్ ది. పక్కా ఆర్ఎస్ఎస్ వాది అయిన సునీల్ దేవధర్ కి కమలం అధిష్టానంలో మంచి పేరుంది. ఆయన తెలుగు పోస్ట్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా అనేక అంశాలపై పార్టీ వ్యూహాలను, తమ విధానాలను స్పష్టం చేశారు.
తెలుగు పోస్ట్ : అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లపై బిజెపి లైన్ ఏమిటి ?
సునీల్ దేవధర్ : అమరావతి మార్పు అన్నది సరైనది కాదు. ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీది అయినా ప్రభుత్వ విధానాలు ఒకలాగే ఉండాలని మా నిర్ణయం. అయితే అధికార వికేంద్రీకరణ బిజెపి విధానం. రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర సమతుల అభివృద్ధి కోసం బిజెపి స్థిరచిత్తంతో ఆలోచన చేస్తుంది. ప్రధాన కార్యాలయాలు రీజియన్ ల వారీగా అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలన్నదే ఆ అభిమతం. అందుకోసం వైఎస్ జగన్ ఆలోచన చేయాలని కోరుతున్నాం. మోడీ ప్రారంభించిన అమరావతి ని వేరే చోటకు మార్చేందుకు మా పార్టీ వ్యతిరేకం. పోలవరం ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి. దానికి సంపూర్ణ సహకారం కేంద్రం అందిస్తుంది. అమరావతి, పోలవరంలో అక్రమాలు జరిగాయి అని వైసిపి నే కాదు మేమూ ఆరోపించాం. ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం నిరూపించి చర్యలు తీసుకోవాలన్నది మా డిమాండ్.
తెలుగు పోస్ట్ : ఏపీ లో బలోపేతానికి మీ వ్యూహం ఏమిటి ?
సునీల్ దేవధర్ : భారతీయ జనతాపార్టీ కి పక్కా వ్యూహం వుంది. ప్రజల్లో ముందు పనిచేయాలి. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలి. ఎపి లో కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలే మొదటి నుంచి వేళ్లూనుకుపోయాయి. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఈ రాజకీయాలను సమూలంగా మార్చడానికి కృషి చేస్తాం. టిడిపి కానీ, వైసిపి కానీ కుల రాజకీయ వ్యవస్థలతో నిండిపోయాయి. ఇది మార్చాలి. యువత ఆలోచించాలి. బిజెపి కుల రహిత సమాజాన్ని కోరుకుంటుంది. ఎపి లో వున్న రెండు పార్టీలు అవినీతి పార్టీలే. భారతీయ జనతాపార్టీ మాత్రమే ఇక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయం.
తెలుగు పోస్ట్ : మీరు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారెందుకు ?
సునీల్ దేవధర్ : లేదు మాది మతతత్వ రాజకీయం కానేకాదు. హిందుత్వ రాజకీయాలే బిజెపి చేసేది. ఇది సుప్రీం కోర్టు కూడా అంగీకరించింది. హిందుత్వ అన్నది ఒక విధానం. సర్వే జనాః సుఖినోభవంతు అన్నదే హిందుత్వ ఎజెండా. మతమార్పిడులు వంటివాటికి మేము వ్యతిరేకం.
తెలుగు పోస్ట్ : 2019 లో ఎపి లో ప్రజలు తిరస్కరించడానికి కారణం ?
సునీల్ దేవధర్ : దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు ప్రచారం. ఆంధ్రప్రదేశ్ కి నరేంద్ర మోడీ చేయాలిసినంత చేసినా తన రాజకీయ ప్రయోజనాలకోసం చంద్రబాబు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు బాహుబలి లో కట్టప్ప వంటివాడు వెన్నుపోటు దారుడు, మోసగాడు. అతనివల్లే బిజెపి కి ఈ దుస్థితి ఏర్పడింది. 2014 లో మేము కలిసి పోటీ చేశాం. అప్పుడు ప్రజలు మోడీ ని చూసే బాబు కి ఓట్లు వేశారు. 2019 లో విడిగా పోటీ చేసాం. మోడీ తో విడిపోయిన చంద్రబాబు ను ప్రజలు ఓడించారు. కానీ ఈ క్రమంలో మా పార్టీ సానుభూతిపరులు కూడా వైసిపి కే ఓట్లు వేశారు. నాలుగు లక్షల సభ్యత్వం వున్న మాకు రెండు లక్షల ఓట్లు మాత్రమే అందుకే పడ్డాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయంలో నేను కానీ మా పార్టీ ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టినా ఏమి చేయలేక పోయాం. మేము మొన్నటి వరకు ఎపి లో బలహీనంగానే వున్నాం అన్నది వాస్తవమే. అది టిడిపి వల్లే జరిగింది.
తెలుగు పోస్ట్ : మళ్ళీ చంద్రబాబు కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది ?
సునీల్ దేవధర్ : ఇక ఆ పార్టీకి పూర్తిగా ద్వారాలు మూసుకుపోయాయని అమిత్ షా స్పష్టం చేసేసారు. తన పార్టీ నుంచి వలసలు ఆపుకునేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామా. భవిష్యత్తులో ఎపి లో టిడిపి తో కానీ, జనసేన తో కానీ కలిసి వెళ్లే ఛాన్స్ లేనేలేదు. ఎపి లో వైసిపి కి ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే అన్నది 2024 లో చూస్తారు.
తెలుగు పోస్ట్ : ఏవిధంగా ప్రత్యామ్నాయం కాగలరు ?
సునీల్ దేవధర్ : మా పార్టీ సభ్యత్వం వచ్చే ఎన్నికల నాటికి 25 లక్షలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. టిడిపి, జనసేన, చివరికి వైసిపి నుంచి కూడా మా పార్టీలో చేరేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. కాశ్మీర్ అంశం కావొచ్చు బిజెపి పాలన కావొచ్చు అంతా మోడీ జీ పాలన కావాలని దేశం మొత్తం భావిస్తుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మా లక్ష్యం. అందుకోసం మేము గట్టిగా పనిచేస్తున్నాం. టిడిపి, వైసిపి రెండు అవినీతి, బంధుప్రీతి కుల పార్టీలే మా పార్టీ మీద ఆ ముద్ర లేదు. తెలుగు ప్రజలు తప్పకుండా బిజెపి వైపు చూసేలాగే మా అడుగులు ఉంటాయి.
రాజమండ్రి నుంచి ప్రత్యేక ప్రతినిధి