కొరడా ఝుళిపించాల్సిందేనా?

వ్యవస్థలు కుమ్మక్కై దేశాన్ని వక్రమార్గం పట్టిస్తున్నాయి. బాధ్యత వహించాల్సిన పాలకులు, అధికారులు భాగస్వాములుగా మారుతున్నారు. ఇందులో రాజకీయ నేతలది మొదటి స్థానం. దర్యాప్తు సంస్థలది రెండో స్థానం. [more]

Update: 2021-08-16 16:30 GMT

వ్యవస్థలు కుమ్మక్కై దేశాన్ని వక్రమార్గం పట్టిస్తున్నాయి. బాధ్యత వహించాల్సిన పాలకులు, అధికారులు భాగస్వాములుగా మారుతున్నారు. ఇందులో రాజకీయ నేతలది మొదటి స్థానం. దర్యాప్తు సంస్థలది రెండో స్థానం. నిన్నామొన్నటివరకూ చూసీ చూడనట్లు వ్యవహరించిన సర్వోన్నత న్యాయస్తానం కొరడా ఝళిపిస్తానంటూ హెచ్చరిస్తోంది. చాలా కాలంగా ప్రభుత్వాలు కోర్టు తీర్పులను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. సాకులు వెదుకుతున్నాయి. కోర్టుల విచారణలను ఆలస్యం చేయడం, అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందచేయకుండా నాన్చడం వంటి చర్యల ద్వారా న్యాయప్రక్రియకు ప్రభుత్వ యంత్రాంగాలే అడ్డుతగులుతున్నాయి. విచారణ సంస్థల వ్యవహార శైలిని, ప్రభుత్వాల తీరును సుప్రీం కోర్టు అభిశంసిస్తూ ఘాటు వ్యాఖ్యలే చేస్తోంది. యంత్రాంగం సహాయ నిరాకరణ నేపథ్యంలో సుప్రీం కోర్టు దేశంలో న్యాయం కోసం ఒంటరి పోరాటమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కేంద్రానికి చుక్కలు…

అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రకరకాలుగా ప్రలోభాలు పెడుతుంటారు. ఇందిరా గాంధీ కాలం నుంచే ఇది అలవాటుగా మారింది. ప్రభుత్వ ఉద్దేశాలను గ్రహించి తదనుగుణంగా న్యాయాన్ని వేగవంతం చేయగలిగిన వారు ఆశ్రితుల జాబితాలో ఉంటుంటారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉన్నత పదవులు దక్కుతుంటాయి. అయితే తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్రానికి చుక్కలు చూపిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా తనకు దఖలైన అధికారాలతో కేంద్రం ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీబీఐ ను చెప్పుచేతల్లో పెట్టుకుంటున్న కేంద్రం దానికి డైరెక్టర్ నియామకం లో తనకు నచ్చిన వారికి పట్టం గట్టాలని ఇటీవల ప్రయత్నం చేసింది. అయితే పదవీ విరమణ కు కనీసం ఆరునెలల వ్యవధి తక్కువ ఉండకూడదు. ఆ నిబంధనలు ఎత్తి చూపించి చీఫ్ జస్టిస్ ప్రభుత్వ ఉద్దేశానికి గండి కొట్టారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణలకు సంబంధించి సకాలంలో సరైన సమాచారం ఇవ్వడం లేదన్న అంశాన్ని తీవ్రంగా తీసుకుంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున న్యాయాధికారి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. రాజకీయ ఆశ్రితులు ఉన్న కేసుల్లో ప్రభుత్వ దర్యాప్తులు నత్తనడకన సాగుతుంటాయి. అందుకు విచారణ సంస్థలు సహకరిస్తుంటాయి. సుప్రీంకోర్టు ఈ విషయంలో సీరియస్ అవుతుండటంతో గాడిన పడటానికి ఆస్కారం ఏర్పడుతోంది.

రాజకీయ అవినీతి లెక్కలు..

పాలిటిక్స్ లో ఉన్న వాళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా చెలాయిస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నచ్చినట్లు కేసులు ఎత్తి వేయించుకుంటుంటారు. దీనికి చెక్ పెడుతూ ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తవేతకు హైకోర్టు అనుమతి అవసరమని సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఇది ఒక రకంగా ప్రభుత్వాల ఇష్టారాజ్యానికి లక్ష్మణ రేఖ గీయడమే. అదే విదంగా ఏడాది లోపు ప్రజాప్రతినిధులపై కేసులను కొలిక్కి తేవాలని హైకోర్టులకు గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. వివిధ రకాల కేసుల్లో పాత్ర ఉన్న వారిని అభ్యర్థులుగా నిలుపుతూ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. గెలుపు అవకాశాలనే పరిగణనలోకి తీసుకుంటూ రాజకీయాలను కలుషితం చేస్తున్నాయి. కనీసం తాము ఎన్నుకుంటున్న ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలను ప్రజల దృష్టిలో పెట్టడం లేదు. ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థుల పూర్తి వివరాలు ప్రచురించాలని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. కానీ వాటిని పార్టీలు పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు. బిహార్ లో ఈరకంగా నిర్లక్ష్యం వహించినందుకు బీజేపీ, కాంగ్రెసు, సీపీఎం సహా ఎనిమిది పార్టీలకు జరిమానా విధించింది సుప్రీం కోర్టు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇదే తీరు పునరావృతమైతే ఆయా పార్టీల ఎన్నికల చిహ్నాలు రద్దు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పార్టీలకు ఇది కఠినమైన హెచ్చరికే.

ఒకే ఒక్క ఆశ…

భారత రాజకీయ వ్యవస్థలో ఏదైనా సాధ్యమనే భావన ఏర్పడింది. దేశంలో నలభై శాతం ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. అందులో కనీసం 15 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. అయినా వారి కేసులకు పురోగతి ఉండటం లేదు. కోర్టుల్లో ఏళ్లతరబడి ఎటూ తేలడం లేదు. న్యాయ విచారణకు దర్యాప్తు సంస్థలు సహకరించడం లేదు. ఆ మేరకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను, యంత్రాంగాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలకు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు అనివార్యం. దాంతో ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు సంస్థల పనిని మందగింప చేస్తున్నారు. నేరగాళ్లు, అక్రమార్కులు అందలం ఎక్కుతున్నారు. ఇటువంటి దుస్థితిలో దేశంలో న్యాయవ్యవస్థ ఒక్కటే ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆ వ్యవస్తలోనూ అనేక రకాల లోపాలున్నాయి. అయినా మిగిలిన రాజకీయ, పాలన యంత్రాంగాలతో పోల్చుకుంటే ఎంతో కొంత రుజువర్తన కారణంగానే ప్రజా విశ్వాసం పొందగలుగుతోంది. న్యాయవ్యవస్థ కూడా ప్రమాణాలు కోల్పోతే దేశంలో అరాచకత్వం ప్రబలిపోతుంది. ప్రజలలో రాజ్యంపై నమ్మకం సడలిపోతుంది. అది దేశానికి ప్రమాదకరం. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా పాలకులను గాడిలో పెట్టేందుకు న్యాయవ్యవస్థ ఒంటరి పోరాటం చేయడం ఎంతైనా ఆహ్వానించదగిన పరిణామమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News