అన్నింటికీ ఫుల్ స్టాప్
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ’ అంటుంది భారతీయ ఇతిహాసం రామాయణం. పుట్టిన భూమిపై ఉండే మక్కువకు ఇంతకుమించిన తార్కాణముండదు. అది సెంటిమెంటు కావచ్చు. ఎడతెగని ప్రేమ [more]
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ’ అంటుంది భారతీయ ఇతిహాసం రామాయణం. పుట్టిన భూమిపై ఉండే మక్కువకు ఇంతకుమించిన తార్కాణముండదు. అది సెంటిమెంటు కావచ్చు. ఎడతెగని ప్రేమ [more]
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ’ అంటుంది భారతీయ ఇతిహాసం రామాయణం. పుట్టిన భూమిపై ఉండే మక్కువకు ఇంతకుమించిన తార్కాణముండదు. అది సెంటిమెంటు కావచ్చు. ఎడతెగని ప్రేమ కావచ్చు. సొంత ఊరుతో పెనవేసుకునే అనుబంధం అనిర్వచనీయం. అయోధ్య వివాద మూలం అక్కడే మొదలైంది. నిజానికి దేశంలోని ఊరువాడల్లో లక్షల సంఖ్యల్లోనే రామాలయాలున్నాయి. అయినా కొన్ని శతాబ్దాలపాటు అయోధ్యలోని వివాదాస్పద స్థలం తమదేనంటూ చట్టపరంగా పోరాటం చేయడంలో ఈ భావోద్వేగమే ముడిపడి ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకునే భారతదేశంలో అన్నిమతాల అవలంబీకులు, విశ్వాసులు శతాబ్దాలుగా కలిసే జీవిస్తున్నారు. ఓట్ల రాజకీయం విజృంభించినపుడు మాత్రమే ఉద్రిక్తత పెరగడం, మలుపులు తిరగడం సాగుతూ వస్తోంది. దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం సూచిస్తూ వెలువడిందే సుప్రీంకోర్టు తీర్పు.
ఒక ముగింపు…
రాముడి కథ భారతగడ్డపై ఒక విశ్వాసాల చరిత్ర. ఇంటింటా నమ్మే ఇతిహాసం. అయోధ్యను పరమపవిత్ర స్థలంగా, క్షేత్రంగా కోట్లాది ప్రజలు భక్తి ప్రపత్తులతో పూజిస్తుంటారు. పదహారో శతాబ్దం నుంచి ఇక్కడ చరిత్ర మలుపు తిరిగింది. పాలకులు మారడంతోనే ఇతర మతాల ప్రభావమూ పెరిగింది. అయినప్పటికీ అయోధ్య మత సహనానికి నిదర్శనంగానే నిలిచింది. బ్రిటిష్ కాలం వరకూ పెద్దగా వివాదాలు లేవనే చెప్పాలి. 1885లోనే తొలిసారిగా న్యాయస్థానం మెట్టెక్కింది అయోధ్య రామజన్మభూమి అంశం. అప్పట్నుంచి మరో వందేళ్లపాటు న్యాయస్థానాల స్థాయిలోనే ఒక వ్యాజ్యంగా ఉంటూ వచ్చింది. రాజకీయ వివాదంగా దేశవ్యాప్త చర్చకు దారి తీయలేదు. 1986లో ఫైజాబాద్ జిల్లా కోర్టు బాబ్రీమసీదు తెరిచి హిందువులు పూజలు చేసుకునేలా అనుమతించాలని ఆదేశాలిచ్చిన తర్వాత నుంచి దేశ రాజకీయాలనే శాసించే అంశంగా అయోధ్య రూపాంతరం చెందింది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం తన రాజ్యాంగ ధర్మాసనం ద్వారా ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో రాజకీయాలకు ఆస్కారం లేకుండా ఒక ముగింపు పలికినట్లే చెప్పాలి.
సందిగ్ధత నుంచి స్పష్టత…
134 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో ఏదో ఒక దశలో కొనసాగుతూ వస్తున్న వివాదాన్ని 2010లో అలహాబాద్ హైకోర్టుతీర్పు మరింత సందిగ్ధంగా మార్చింది. రామజన్మభూమి స్థలాన్ని క్లెయిం చేస్తున్న మూడుప్రధాన పిటిషనర్లకు సమానంగా పంపిణీ చేసేస్తూ మధ్యేమార్గంగా హైకోర్టు తీర్పు చెప్పేసింది. దీనిని భాగస్వాములెవరూ అంగీకరించే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో హైకోర్టు తీర్పు నిష్ప్రయోజనకరంగా మిగిలిపోయింది. సుప్రీం కోర్టు ఈ తీర్పును రద్దు చేసి గడచిన ఎనిమిదేళ్లుగా విచారిస్తూ వచ్చింది. విశ్వాసాలు లేదా మధ్యేమార్గంలో అందరినీ సంత్రుప్తి పరచాలనే మొహమాటాలకు తావు లేకుండా విస్పష్టంగా రామజన్మభూమి విషయంలో తీర్పు చెప్పడం సాహసోపేతమేనని చెప్పాలి. తనకు లభించిన సాక్ష్యాధారాలనే ప్రామాణికంగా తీసుకుంటూ సహజన్యాయసూత్రాల ఆధారంగా పరిష్కరించింది. ఇక్కడ మరో కొత్త వివాదానికి తావు లేకుండా క్లియర్ చేయడం పరిగణించదగిన అంశం. ముఖ్యంగా గతంలో అనేక వివాదాల్లో మెజార్టీ తీర్పు, మైనారిటీ తీర్పుల పేరిట ధర్మాసనంలోని న్యాయమూర్తులే విభేదించుకున్న ఘట్టాలు అనేకం. కానీ అయోధ్య విషయంలో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇవ్వడం గమనార్హం.
రాజకీయాలకు చెల్లు చీటి….
రాజుల కాలం నుంచి మతాన్ని తమ సొంత ప్రయోజనాలకు వినియోగించుకోవడం ఆనవాయితీగానే వస్తోంది. దేశంలోని రాజకీయ పార్టీలు కూడా తమతమ ప్రయోజనాలకు అనుగుణంగా అయోధ్య వివాదానికి భాష్యం చెబుతూ వస్తుండేవి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెసులు అయోధ్య అంశాన్ని రాజకీయంగా పతాకస్థాయికి తీసుకెళ్లాయనే చెప్పాలి. అయోధ్యలో 1986లో వివాదాస్పదస్థలంలో పూజలకు అనుమతించిన సమయంలో దేశప్రధానిగా రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రామమందిర నిర్మాణం తమ పార్టీ ప్రధాన సిద్దాంతాల్లో ఒకటిగా చేసుకుని బీజేపీ దేశంలోని మెజార్టీ ఓటర్ల మనోభావాలను గెలుచుకుంది. మత విశ్వాసాలతో ముడిపడిన ఈ అంశం చుట్టూ చాలా రాజకీయాలే నడిచాయి. ములాయం నేతృత్వంలోని సమాజ్ వాదీ, లాలూ ప్రసాద్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సైతం ఈ వివాదంలో తమ వంతు పాత్ర పోషించాయి. తాజా తీర్పుతో ఒక స్పష్టత రావడంతో ఇకపై దేశంలోని రాజకీయపార్టీల చేతిలోంచి ఒక అంశం చేజారిపోయినట్లే చెప్పాలి. అది భారత మతసహనానికి, సంయమనానికి , భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలనే విజ్ణులు ఆశిస్తున్నారు. భారతీయ సంస్కృతి నిర్దేశించినట్లు సర్వే భవన్తు సుఖిన: అన్నట్టుగా అందరూ సుఖశాంతులతో విలసిల్లేందుకు ఈ తీర్పు దోహదపడాలి. రామో విగ్రహ వాన్ ధర్మ: అని కాలాలకు అతీతంగా పేరు తెచ్చుకున్న ధర్మ మూర్తి జన్మస్థలంపైనే ధర్మసందేహాలు తలెత్తకుండా ఈ తీర్పు స్వస్తి వాక్యం కావాలి.
– ఎడిటోరియల్ డెస్క్