పదవి పోతే అంతే…? పట్టించుకుంటారా?

పదవిలో ఉన్నప్పుడు మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. పదవి కోల్పోయిన తర్వాత మాట్లాడితే దానికి ప్రజలతో పాటు పార్టీలు కూడా ఎటువంటి విలువ ఇవ్వవు. రాజకీయాల్లో ఇది [more]

Update: 2020-09-19 11:00 GMT

పదవిలో ఉన్నప్పుడు మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. పదవి కోల్పోయిన తర్వాత మాట్లాడితే దానికి ప్రజలతో పాటు పార్టీలు కూడా ఎటువంటి విలువ ఇవ్వవు. రాజకీయాల్లో ఇది సర్వ సాధారణం. పదవులు కోల్పోయిన వారంతా అధికార పార్టీపై నిందలు సహజంగానే వేస్తుంటారు. వాటిని ఇటు ప్రజలు, అటు పార్టీ పట్టించుకోదు. అందుకే పదవిలో ఉండగానే మాట్లాడితే దానికి విలువ, అర్థం ఉంటుంది. ఇప్పుడు మాజీ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ విషయంలో ఇదే సంగతి స్పష్టమవుతుంది.

టీఎన్జీవో నేతగా….

ఉద్యోగ సంఘ నేతగా స్వామిగౌడ్ వెలుగులోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పోరాటం చేసిన మాట వాస్తవమే. అందుకే స్వామిగౌడ్ కు విలువ ఇచ్చి మండలి ఛైర్మన్ గా చేశారు. తొలి దఫాలోనే స్వామిగౌడ్ కు అత్యున్నత పదవి లభించింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన నేతలైన స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్ లకు సరైన గుర్తింపే టీఆర్ఎస్ లో లభించింది. అయితే స్వామిగౌడ్ పదవీ కాలం ముగిసిపోయినా ఆయనకు కేసీఆర్ పదవిని రెన్యువల్ చేయలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయన్నది గులాబీ పార్టీ వర్గాల టాక్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే స్థానానికి, చేవెళ్ల ఎంపీ స్థానానికి స్వామిగౌడ్ పోటీ పడ్డారు. కానీ టిక్కెట్ దక్కలేదు.

ఇటీవల చేసిన వ్యాఖ్యలతో…

పదవి పోయింతర్వాత స్వామిగౌడ్ కు కులాలు సంగతి గుర్తుకొచ్చింది. అధికారాన్ని చెలాయించడం కొన్ని కులాలకే పరిమితమయిందన్న స్వామిగౌడ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. సున్నితంగానే టీఆర్ఎస్ అధిష్టానాన్ని స్వామిగౌడ్ టార్గెట్ చేసినా బలంగానే తాకింది. స్వామి గౌడ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధిష్టానం లైట్ గా తీసుకుందని చెబుతున్నారు. వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, ఎవరూ కామెంట్స్ చేయవద్దని కూడా అధిష్టానం నేతలను ఆదేశించిందట.

లైట్ గా తీసుకున్న అధిష్టానం…..

పదవులో ఉన్నప్పుడు గుర్తుకు రాని కులాల సంగతి స్వామిగౌడ్ కు పదవి పోయిన తర్వాత గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందని ఆఫ‌ ది రికార్డులో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీఎన్జీవో నేతగా ఉన్న స్వామిగౌడ్ ను మండలి ఛైర్మన్ చేసినా ఇంకా పదవులపై ఆశ చావకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అదే కులానికి చెందిన వారికి మంత్రిపదవులను ఇచ్చిన విషయాన్ని స్వామిగౌడ్ మర్చి పోతున్నారని వారంటున్నారు. మొత్తం మీద పదవి పోయిన తర్వాత స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలకు విలువ లేదన్న విషయం పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News