పెద్దాయన ఎక్కాల్సిన రైలు రెండేళ్ళు లేటయినట్లేనా?

ఆయనకు రాజకీయంగా చెప్పుకోవాలంటే పార్టీలు అవసరం లేదు. ఆయనే ఒక వ్యవస్థగా మారారు. కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించి సినీ నిర్మాతగా మారి ఆనక రాజకీయాల్లో ఢిల్లీ [more]

Update: 2020-03-12 13:30 GMT

ఆయనకు రాజకీయంగా చెప్పుకోవాలంటే పార్టీలు అవసరం లేదు. ఆయనే ఒక వ్యవస్థగా మారారు. కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించి సినీ నిర్మాతగా మారి ఆనక రాజకీయాల్లో ఢిల్లీ దాకా దూసుకుపోయి అన్ని పార్టీల అధినేతలతో మంచి సంబంధాలను కొనసాగించిన టి సుబ్బరామిరెడ్డి అజాతశత్రువుగా చెప్పాలి. ఆయన ఇప్పటికి పాతికేళ్ళుగా పార్లమెంట్ లోనే ఉంటున్నారు. దిగువ సభలో రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా పనిచేసిన టీఎస్సార్ ఎగువ సభకు వరసగా గత పద్దెనిమిదేళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో సారి రాజసభ మెట్లెక్కే ఛాన్స్ ఈసారి ఆయనకు మిస్ అయింది.

లేట్ చేశారా…?

జగన్ తోనూ, ఆయన తండ్రి వైఎస్సార్ తోనూ మంచి సంబంధాలు కలిగిన టి సుబ్బరామిరెడ్డి జగన్ ని కలవడానికి ఎందుకు లేట్ చేశారన్నది ఇపుడు చర్చగా ఉంది. ఓ వైపు జగన్ కి, టీఎస్సార్ కి ఉమ్మడి రాజగురువుగా విశాఖ శారదాపీఠం అధిపతి ఉన్నారు. జగన్ తో సహా వైసీపీలో ఉన్నవారందరితోనూ రెడ్డి గారికి మంచి రిలేషన్లు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే ఆయనకు టికెట్ కచ్చితంగా వచ్చుండేది. అయితే కొంత ముందుగా జగన్ ని కలిస్తేనే అది జరిగేది. కానీ సాయంత్రం అభ్యర్ధులను ప్రకటిస్తారన‌గా మధ్యాహ్నం జగన్ వద్దకు హడావుడిగా వెళ్ళి టి సుబ్బరామిరెడ్డి గారు లేదనిపించుకున్నారు.

అదే కారణమా…?

టి సుబ్బరామిరెడ్డి నిజానికి గత రెండేళ్ళుగా వైసీపీలో చేరుతారని ప్రచారంలో ఉంది. అయినా ఆయన కాంగ్రెస్ కి, ముఖ్యంగా సోనియాకు తాను విధేయుడిని అని పలుమార్లు ప్రకటించుకున్నారు. ఆయన్ని 2014, 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ అభ్యర్ధిగా ఎంపిక చేయాలని కూడా జగన్ భావించారు. దానికి రెడ్డి గారి నుంచి స్పందన లేదు. అయితే మూడు రాజధానుల విషయంలో ఈ మధ్య జగన్ కి జై కొట్టిన రెడ్డి గారు కరెక్ట్ రూట్లోకి వచ్చారని అంతా అనుకున్నారు. ఇక జగన్ ని ఆయన విశాఖ టూర్లోనే ఒకటికి రెండు సార్లు కలిసారు. అంతే తప్ప టి సుబ్బరామిరెడ్డి తన సీటు గురించి పెద్దగా ప్రయత్నం చేయలేదు అదే సమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల నుంచి చాన్స్ కోసం గట్టిగానే రెడ్డి గారు ట్రై చేశారని, పనికాకపోవడంతో చివరి నిముషంలో జగన్ ని ఆశ్రయించారని అంటున్నారు. ఈ పరిణామలన్నీ గమనించిన జగన్ నో చెప్పేశారని అంటున్నారు.

అండగా ఉంటే ….

ఇక విశాఖ జిల్లా రాజకీయాల్లో రెడ్డికి కొంత పలుకుబడి ఉంది. ఆయన పార్టీలో చేరి అండగా ఉంటే 2022 నాటికి రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ రెడీ అన్న మాట వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ తో పూర్తిగా కటీఫ్ చేసుకుని టీఎస్సార్ వైసీపీ కండువా కప్పుకోవాలి. జగన్ కి బధ్ధ శత్రువుగా ఉన్న సోనియా కుటుంబంతో తెగదెంపులు చేసుకోవాలి. మరి టి సుబ్బరామిరెడ్డి ఆ పని చేయగలరా. ఆయన జగన్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని సోనియా సహా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటానంటే ఎవరు ఒప్పుకోరు. ఈ కారణాలతోనే జగన్ నో చెప్పారని అంటున్నారు. ఇప్పటికైనా ఏపీలో రాజకీయ పరిణామాలు పరిగణలోకి తీసుకు టి సుబ్బరామిరెడ్డి రూటు మారిస్తేనే ఫేట్ మారుతుందని అంటున్నారు.

Tags:    

Similar News