పెద్దారెడ్డి పంచె బిగించారే…??

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి జేసీ కుటుంబం కంచుకోట తాడిపత్రి బద్దలైంది. 35 ఏళ్ల జేసీ కుటుంబం ఆధిపత్యానికి గండి పడింది. వారసుడిని తెరపైకి [more]

Update: 2019-05-26 13:30 GMT

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి జేసీ కుటుంబం కంచుకోట తాడిపత్రి బద్దలైంది. 35 ఏళ్ల జేసీ కుటుంబం ఆధిపత్యానికి గండి పడింది. వారసుడిని తెరపైకి తీసుకువచ్చిన జేసీ సోదరులకు ఈ ఎన్నికల్లో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉన్న నియోజకవర్గం ఈసారి మరో ‘పెద్దా’దిక్కును చూసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి ప్రజలు గెలిపించుకున్నారు. 7,508 ఓట్ల మెజారిటీతో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిపై విజయం సాధించారు. ఊహించని పరాజయంతో జేసీ కుటుంబం షాక్ తిన్నది.

దీటైన ప్రత్యర్థిగా వచ్చిన పెద్దారెడ్డి

తాడిపత్రి నియోజకవర్గం జేసీ కుటుంబానికి ఎంతటి పట్టున్న ప్రాంతమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ 35 ఏళ్లుగా జేసీ కుటుంబం రాజ్యం నడుస్తోంది. అర్థ, అంగ బలం దండిగా ఉండటం, దూకుడుగా వెళ్లే నేతలు కావడంతో జేసీ కుటుంబానికి ఇక్కడ ఇంతకాలం తిరుగులేకుండా ఉండేది. 1983 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ఓడిన జేసీ దివాకర్ రెడ్డి తర్వాత వరుసగా ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. గత ఎన్నికల్లో ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి 22 వేల ఓట్ల భారీ మెజారిటీతో రామిరెడ్డిపై విజయం సాధించారు. తర్వాత వారు తరచూ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. జగన్ కుటుంబసభ్యులపై కూడా విమర్శలు చేసేవారు. దీంతో జేసీ కుటుంబానికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం జేసీ సోదరులకు ధీటైన అభ్యర్థిగా శింగనమల నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకువచ్చి తాడిపత్రి బాధ్యతలు అప్పగించారు జగన్.

జగన్ గాలికి కూలిన జేసీ కోట

ఫ్యాక్షనిస్టుగా ముద్రపడిన ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి నియోజకవర్గంలోనే తిష్టవేశారు. జేసీ సోదరుల బలానికి ఎదురెళ్లారు. వారికి సవాల్ విసిరేలా నిలబడ్డారు. దీంతో జేసీ సోదరులకై ధీటైన ప్రత్యర్థి దొరికాడని భావించిన పలువురు జేసీ వ్యతిరేకులు పెద్దారెడ్డి వైపు వెళ్లారు. దీంతో ఆయన బలం పెరిగింది. బోగాతి నారాయణరెడ్డి వంటి జేసీ ముఖ్య అనుచరులు సైతం వైసీపీలోకి వెళ్లారు. టీడీపీలో ముందునుంచీ ఉంటున్న నేతలు సైతం జేసీ పోకడలు నచ్చక వైసీపీలో చేరారు. దీంతో జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి గట్టి పోటీ ఇస్తారనే అంచనాలు ఉన్నా ఆయన గెలుస్తారని మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేదు. వారసుడిని మొదటిసారి నిలబట్టడంతో గెలిపించేందుకు జేసీ సోదరులు శక్తియుక్తులన్నీ ఒడ్డారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి అనారోగ్యంతో ఎక్కువగా ప్రచారం చేయలేకపోయారు. అయినా, రాయలసీమ వ్యాప్తంగా బలంగా వీచిన జగన్ గాలి తాడిపత్రిలోనూ ప్రభావం చూపడంతో పెద్దారెడ్డి జేసీ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టి జేసీ వారసుడిని ఓడించారు. మొత్తంగా జగన్ నమ్మకాన్ని పెద్దారెడ్డి నిలబెట్టుకున్నారు.

Tags:    

Similar News