బాబుకు సాయం చేస్తుంది వారేనటగా

ఆర్ఎస్ఎస్ అంటే దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన సంస్థ. దేశం కోసం పాటుపడిన సంస్థ. అదే విధంగా భారతీయతకు పెద్ద పీట వేయడంతో పాటు , హిందూత్వం [more]

Update: 2019-11-06 12:30 GMT

ఆర్ఎస్ఎస్ అంటే దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన సంస్థ. దేశం కోసం పాటుపడిన సంస్థ. అదే విధంగా భారతీయతకు పెద్ద పీట వేయడంతో పాటు , హిందూత్వం అజెండాగా ముందుకు సాగే గొప్ప ఆదర్శ భావాలు ఉన్న సంస్థ. ఆర్ఎస్ఎస్ తో సిధ్ధాంతపరమైన విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు కానీ ఆ సంస్థను చెడ్డగా అనేందుకు ప్రత్యర్ధులు సైతం జంకుతారు. నెహ్రూ నుంచి ఎందరో ఆర్ఎస్ఎస్ సేవలను ప్రశంసించినవారే. ఇక ఆర్ఎస్ఎస్ కి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. అందులో రాజకీయ అంగం బీజేపీ, ఈ సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు డెబ్బయ్యేళ్ల క్రితం జనసంఘ్ గా ఏర్పాటై, ఎనభయి దశకంలో బీజేపీగా రూపాంతరం చెందిన అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ, బీజేపీ నుంచి ఇప్పటికి ఇద్దరు ప్రధానులు దేశానికి వచ్చారు. వాజ్ పేయ్, నరేంద్రమోడీ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ కి సిధ్ధాంతబద్ధులు. ఇక మోడీ అయితే ఆర్ఎస్ఎస్ గీత దాటరు అంటారు.

భగవత్ అభయమేనా…?

ఈ మధ్య ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు హఠాత్తుగా నాగపూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలసివచ్చారని ఆ ప్రచారం. ఇందులో నిజమెంత వుందో కానీ టీడీపీ వర్గాలు మాత్రం అది వ్యక్తిగత పర్యటన అనడంతోనే నిజమన్న భావన కలుగుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ ని చంద్రబాబు కలవడం అతి పెద్ద వార్త. అయితే అది బాబు అనుకూల మీడియాలో కానీ ప్రతికూల మీడియాలో కానీ ఎక్కడా రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. బాబు కదిలితే చుట్టూ మీడియా మొత్తం కదులుతుంది. అటువంటిది మీడియా కన్నుకి చిక్కకుండా బాబు ఇంత పెద్ద భేటీ వేయడం నిజంగా విశేషమే. ఇపుడున్న పరిస్థితుల్లో బాబు ఇలా చేయడం అంటే అది పక్కా రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు. పైగా బాబు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ స్వామీజీ సంధాన కర్తగా వ్యవహరించాడని అంటున్నారు.

బీజేపీతో చెలిమికేనా?

చంద్రబాబుది గొప్ప రాజకీయం. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉండరని అంటారు, బాబుని చూసే అలా సామెత పుట్టిందేమో అనుకోవాల్సిందే. ఆరు నెలల క్రితం బీజేపీని, దాని అధినాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బాబు ఇపుడు అదే బీజేపీతో చెలిమికి ఆరాటపడుతున్నారంటేనే మాస్టర్ మైండ్ బాబు ఏంటన్నది అర్ధం చేసుకోవాలి. ఇక ఆర్ఎస్ఎస్ ఎంత చెబితే అంత అన్నట్లుగా బీజేపీ రాజకీయాలు నడుస్తాయన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఎక్కడ నుంచి నరుక్కురావాలో బాబు తెలుసుకుని మరీ ఈ భేటీ వేశారని అంటున్నారు. దాదాపుగా రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో బాబు తన మనసులో మాట చెప్పేసుకున్నారు. మరి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మోడీకి ఎలా చెబుతుందో, ఏ విధంగా కధను సుఖాంతం చేస్తుందో చూడాలి. మొత్తానికి ఇంతవరకూ మాటల ద్వారా బీజేపీకి సంకేతాలు పంపిన బాబు ఇపుడు చేతలకు దిగిపోయారన్నమాట. మిగతా కధ రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే.

Tags:    

Similar News