జగన్ లేఖపై ఎందుకు అభ్యంతరం?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన కొందరు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుకు చెందిన ఓ సీనియర్ న్యాయమూర్తి వ్వహారశైలిపై ఆ రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ [more]

Update: 2020-10-19 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన కొందరు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుకు చెందిన ఓ సీనియర్ న్యాయమూర్తి వ్వహారశైలిపై ఆ రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఏ. బోబ్దోకి లేఖ రాసింది. దీనిని బహిరంగపరచింది. ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా లేఖ రాయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని, దానిని బెదిరించడమేనని విపక్ష తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. లేఖ రాయడంలో తప్పేమీ లేదని, దానిని బహిరంగపరచడంపైన కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ లేఖ రాష్ర్ట, జాతీయ రాజకీయాల్లో, న్యాయవాద వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. న్యాయవాద వర్గాల నుంచి ప్రభుత్వ చర్యకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరి కొందరు పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారు. మరోపక్క లేఖ తదుపరి చర్యలపై అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.

గతంలోనూ సంజీవయ్య…….

గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని మరి కొందరు పేర్కొంటున్నారు. ఈ వాదన వాస్తవం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. 1961లో సమైక్య రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేత దామోదరం సంజీవయ్య ఇలాంటి లేఖనే రాశారు. నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై నాటి హోం మంత్రి లాల్ బహదుర్ శాస్త్రికి లేఖ రాశారు. అంతేకాకుండా నాటి హైకోర్టు న్యాయమూర్తులు సత్యనారాయణ రాజు, జగన్మోహన్ రెడ్డి తీరుపైనా లేఖలో వివరించారు. అంతగా ప్రతిభావంతులు కాని ఇఎం వెంకటేశం ను న్యాయమూర్తిగా తీసుకోవడం పైనా అబ్యంతరం తెలిపారు. కేంద్రం సత్వరం జోక్యం చేసుకోకపోతే న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో లేఖను రహస్యంగా ఉంచమని, బహిర్గతం చేయవద్దని సంజీవయ్య కోరడం విశేషం.

వైఎస్ హయాంలోనూ……

అనంతర కాలంలో జస్టిస్ చంద్రారెడ్డి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ బీఎస్ఏ స్వామి హైకోర్టులో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటూ నాటి రాష్ర్టపతి అబ్దుల్ కలాం కు లేఖ రాశారు. 2004 జులైలో పదవీ విరమణ చేసిన జస్టిస్ స్వామి 2005 ఏప్రిల్ 25న ఈ లేఖ రాశారు. లేఖ ప్రతులను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృపాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రికి పంపారు. తన లేఖపై ఎలాంటి స్పందనారాలేదని జస్టిస్ స్వామి పేర్కొన్నారు. 2008లో నాటి సమైక్య రాష్ర్ట ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి వ్యవహార శైలిని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ కు నాటి రాష్ర్ట న్యాయశాఖ మంత్రి లేఖ రాశారు. ఈ విషయాన్ని నాటి రాష్ర్ట ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి ఒక సందర్భంలో స్వయంగా వెల్లడించారు. ఈ లేఖపైనా ఎలాంటి స్పందనా లభించలేదు. మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతిలోని ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.

ప్రత్యేక అధికారాలేమీ….?

అందువల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నంత మాత్రాన దాని వ్యవహారశైలిపై ఎవరూ స్పందించ రాదనడం సరికాదు. దాని పట్ల అత్యంత గౌరవ ప్రతిపత్తి చాటుతూనే అందులోని లోపాలను ఎత్తి చూపడంలో అభ్యంతర పెట్టాల్సినది ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు, హక్కులు లేవు. పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రతి వ్యవస్థా కట్టుబడి ఉండాల్సిందే. అయితే అదే సమయంలో న్యాయమూర్తులకు ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించ రాదు. లేఖలను బహిరంగ పరచరాదన్న విషయంపైనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతేతప్ప అసలు లేఖే రాయరాదన్న వాదన సరికాదు. పైన పేర్కొన్న ఉదాహరణలు ఈ విషయాన్ని విస్పష్టం చేస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News