డేంజర్ లో బాలయ్య అల్లుడి పొలిటికల్ కెరీర్ ?

విశాఖ లోక్ సభకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన శ్రీ భరత్ కి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. అందులో అందరికీ బాగా సుపరిచితం అయింది సినీ [more]

Update: 2020-11-07 14:30 GMT

విశాఖ లోక్ సభకు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన శ్రీ భరత్ కి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. అందులో అందరికీ బాగా సుపరిచితం అయింది సినీ లెజెండ్ బాలయ్య అల్లుడు అన్నది. దాంతోనే ఆయన మాస్ కి బాగా చేరువ అయ్యారు. ఇక ప్రఖ్యాత వ్యాపారవేత్త, విద్యావేత్త దివంగత ఎంపీ ఎవీవీఎస్ మూరి మనవడుగా మరో ట్యాగ్ ఉంది. అలాగే తల్లి తరఫున తండ్రి కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మనవడిగానూ శ్రీ భరత్ కి గుర్తింపు ఉంది. లోకేష్ తోడల్లుడి అని టీడీపీలో పెద్ద పీట వేస్తారు. ఇవన్నీ కూడా ఉన్నా శ్రీభరత్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన రాజకీయంగా పెద్దగా సౌండ్ చేయడంలేదు.

గీతం వివాదంలో ….

విశాఖలో ప్రతిష్టాత్మకమైన గీతం విద్యా సంస్థలు అని ఇంతకాలం జబ్బలు చరచుకున్నా కూడా ఇపుడు అసలు గుట్టు బయటపడిపోయింది. కోర్టు స్టేల ద్వారా అక్రమ నిర్మాణాల కూల్చుడుని ఆపుకున్న గీతం జనంలో మాత్రం ఆ చర్చను ఆపలేకపోతోంది. విశాఖలోని ప్రజా సంఘాలు మేధావులు అయితే గీతం మీద చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. గీతం చాలా నిబంధనలను ఉల్లఘించిందని వారు అన్ని వివరాలు చెబుతున్నారు. గీతం అనుమతులు రద్దు చేసి ఆంధ్రా యూనివర్సిటీకి అనుసంధానం చేయమని కూడా కోరుతున్నారు.

పెద్ద దెబ్బేనా…?

తాత మూర్తి మాదిరిగా రాజకీయ చాతుర్యం శ్రీభరత్ కి లేదని చెబుతారు. మూర్తి అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరిపేవారని అందువల్ల ఆయన హయాంలో వివాదాలు ఏవీ లేకుండా గీతం ముందుకు సాగిందని కూడా గుర్తు చేస్తారు. కానీ మనవడి ఏలుబడిలో మాత్రం తొందరలోనే ఇబ్బందులను కోరి తెచ్చుకున్నారని కూడా అంటారు. ఇక రాజకీయంగా కూడా విశాఖలోని టీడీపీ నేతల మద్దతు సంపాదించడంలోనూ శ్రీభరత్ విఫలం అయ్యాడని అంటున్నారు. ఆయన రాజ‌కీయంగా అంటీ ముట్టనట్లుగా ఉండడం వల్లనే ఇలా జరిగిందని చెబుతున్నారు.

రెడ్ టిక్కేనా..?

ఇక చంద్రబాబు సైతం యువకుడు, కొడుకు సమానుడు అయిన శ్రీభరత్ రాజకీయంగా ఎదిగేందుకు ఇపుడు ఎంతవరకు సహకరిస్తారని కూడా చర్చ వస్తోంది. విశాఖ నుంచి ఈసారి ఎంపీ టికెట్ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కే ఇస్తారని కూడా అపుడే ప్రచారం సాగుతోంది. దాంతో మరోసారి పోటీ చేయాలని శ్రీభరత్ కి కోరిక గట్టిగానే ఉన్నా బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం అంత సులువు కాదనే అంటున్నారు. పైగా గీతం మరకలు సాకుగా చూపించి పక్కన పెడతారా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. గీతం పోరులో శ్రీభరత్ విజేతగా నిలిచి నిరూపించుకుంటేనే ఆయనకు పొలిటికల్ గా ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా ఆయన డైనమిక్ గా మారాలని కూడా మూర్తి అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News