మాజీ మంత్రులే టార్గెట్… ఎవరు… ఎప్పుడో?

తెలుగుదేశం పార్టీ నేతలు వరసగా అరెస్ట్ లు అవుతున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్రలు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వీరి తర్వాత ఎవరన్న [more]

Update: 2020-07-22 11:00 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు వరసగా అరెస్ట్ లు అవుతున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్రలు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వీరి తర్వాత ఎవరన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కొన్ని పేర్లు అనధికారికంగా విన్పిస్తుండటంతో వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికీ అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందుకే తమపై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ఇటీవల టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసి వచ్చారు.

కుంభకోణం జరిగిందంటూ….

తాజాగా ఇద్దరి పేర్లు అమరావతిలో బలంగా విన్పిస్తున్నాయి. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అఖిలప్రియలు నెక్ట్స్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గంటా శ్రీనివాసరావు సైకిళ్ల కొనుగోళ్లపై మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థ నుంచే కొనుగోలు చేశారని, ఇందులో ఐదు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు విన్పించాయి. దీనిపై విచారణ జరిగే అవకాశముందంటున్నారు.

కుట్రకేసులో…..

ఇక మాజీ మంత్రి అఖిలప్రియ విషయానికి వస్తే ఒక హత్యకుట్ర కేసులో ఏ4 నిందితురాలిగా అఖిలప్రియను చేర్చారు. తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య కుట్రకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం ప్రకారం అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఏ3, అఖిలప్రియ ఏ4గా కేసు నమోదు చేశారు. త్వరలో భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసిన తర్వాత అఖిలప్రియను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ముందస్తు బెయిల్ కోసం…..

ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం వీరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వరసగా కేసులు నమోదవుతుండటంతో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు సయితం మౌనంగా ఉండిపోతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కూడా రాజధాని అమరావతి భూ వివాదంలో కేసులు నమోదయి ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ లు జరుగుతాయోనన్న టెన్షన్ తో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. రోజుకో ప్రచారంతో టీడీపీ నేతలు వణికి పోతున్నారు.

Tags:    

Similar News