జగన్ ను తగ్గించడానికి….వారికి ఫ్యాన్స్ అయిపోతున్నారే ?

సాధారణంగా రాజకీయ నాయకులకు సొంత వ్యక్తిత్వం, ప్రత్యేకతలు ఉంటాయి. ఆ విషయంలో వారు ఎంతసేపూ తామే గొప్ప అనుకుంటారు. ఎదుటివారిని కనీసం గుర్తించేందుకు కూడా ఇష్టపడరు. అయితే [more]

Update: 2020-04-23 12:30 GMT

సాధారణంగా రాజకీయ నాయకులకు సొంత వ్యక్తిత్వం, ప్రత్యేకతలు ఉంటాయి. ఆ విషయంలో వారు ఎంతసేపూ తామే గొప్ప అనుకుంటారు. ఎదుటివారిని కనీసం గుర్తించేందుకు కూడా ఇష్టపడరు. అయితే నలభయ్యేళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం, దాని ద్వారా ఎదిగిన నాయకులు ఇపుడు తమ గురించి తామే పూర్తిగా మరచిపోయారు. శత్రువుని తక్కువ చేయడానికి పడుతున్న ఆరాటంలో మిగిలిన వారిని పెద్ద చేసి చూపిస్తున్నారు. ఓ విధంగా వారికి వీర ఫ్యాన్స్ అయిపోతున్నారు. చంద్రబాబు అయితే మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ మోడీ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

కేసీయార్ కి జై …..

ఇక జగన్ అంటే ఇష్టం లేదు, ఆయన్ని తిట్టాలి. అది ఎటూ జరుగుతున్నదే, మానసికంగా ఇంకా బాధించాలి. అదెలా అంటే పొరుగున ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగిడితే జగన్ని తగ్గించినట్లవుతుంది, కించపరచినట్లవుతుంది. ఈ స్ట్రాటజీ టీడీపీలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామక్రిష్ణుడు వంటి వారు అచ్చంగా అమలు చేస్తున్నారు. జై కేసీయార్ అంటున్నారు. చంద్రబాబుకి బయటకు కేసీఆర్ ను పొగడడానికి ఇగో అడ్డు వచ్చినట్లుంది. తమ్ముల చేత జై అనిపిస్తున్నారు అంటున్నారు.

ఆయనా అంతేగా..?

ఇక తెలుగుదేశంలో పుట్టు పెరిగి కొత్తగా కాషాయం కప్పుకున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాటలూ, చేతలూ అన్నీ కూడా టీడీపీ లైన్లోనే ఉంటాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన తాజాగా కేసీఆర్ సూపర్ అంటున్నారు. కరోనా పై పోరులో తెలంగాణాలో కేసీయార్ బాగా పనిచేస్తున్నారని కితాబు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ ఇక్కడ వేస్ట్ అంటున్నారు. అంటే కేసీయార్ ని మంచి చేసుకున్నట్లూ ఉంటుంది. జగన్ ని తిట్టినట్లూ ఉంటుంది. ఈ విధంగా సుజనా భజన భలేగా సాగుతోంది. ఆయన కూడా గులాబీ బాస్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయారన్నమాట.

మరి పెద్దాయన పొగిడారుగా….

ఇవన్నీ రాజకీయ కక్షతో జగన్ ను కార్నర్ చేస్తూ విసురుతున్న రాజకీయ బాణాలు అనుకోవాలి. లేకపోతే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ఏపీ సర్కార్ ని ఎందుకు పొగుడుతారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ కిట్లను తీసుకువచ్చిన జగన్ సర్కార్ ముందు చూపుని ఎందుకు ప్రశంసిస్తారు. అదే సమయంలో కేంద్ర పంచాయతీ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ సర్కార్ చర్యలు భేష్ అని ఎందుకు అంటారు. అంటే దేశం మొత్తానికి జగన్ చేసేది అర్ధమవుతోంది, అర్ధం కాని వారు, అర్ధం అయినా రాజకీయం చేయాలనుకునేవారే ఇలా చిల్లర మల్లర విమర్శలకు దిగుతున్నారన్నమాట. అంతే కాదు జగన్ ని తిట్టబోయే ఆత్రంలో తమ స్థాయిలను కూడా మరచిపోయి కొత్తగా అభిమాన సంఘాలు పెట్టేస్తున్నారు. మొత్తానికి మోడీ, కేసీఆర్ కూడా ఇది ఊహించి ఉండరేమో.

Tags:    

Similar News