Teenmar mallanna : మల్లన్న కోసం మంతనాలు

అధికార టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారిని ఏ పార్టీ వదిలిపెట్టడం లేదు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ లు రెండూ కేసీఆర్ వ్యతిరేకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. [more]

Update: 2021-09-29 09:30 GMT

అధికార టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారిని ఏ పార్టీ వదిలిపెట్టడం లేదు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ లు రెండూ కేసీఆర్ వ్యతిరేకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు పోటా పోటీ పడుతున్నాయి. తీన్మార్ మల్లన్నను అక్రమ కేసుల పెట్టి అధికార పార్టీ జైలుకు పంపించిందన్న ఆరోపణలు ఇరు పార్టీలూ చేస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరతారన్నది తేలాల్సి ఉంది.

కేసీఆర్ టార్గెట్ గా…

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. కేసీఆర్ ఆయన ప్రభుత్వం టార్గెట్ గా సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్లు వైరల్ అవుతాయి. ఆయన విశ్లేషణల కోసం ఎదురు చూసే వారుంటారు. కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకుని తీన్మార్ మల్లన్న ఒక మీడియా సంస్థను నడుపుతున్నారన్న విమర్శలున్నాయి. తనకు ఏపార్టీతో సంబంధం లేదంటారు. సామాజిక అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రజలను చైతన్య వంతుల్ని చేయడమే తన లక్ష్యమని తీన్మార్ మల్లన్న చెబుతారు.

కొద్ది తేడాతో…

ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న కొద్ది తేడాతో అధికార పార్టీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. అయినా ఆయన ప్రజల మధ్యనే ఉండటానికి త్వరలో రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గ్రామానికి చెందిన తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్. తొలుత కాంగ్రెస్ లోనేఉండేవారు. 2015 లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బీజేపీలో చేరాలని….

తర్వాత కాంగ్రెస్ కు దూరమయ్యారు. ప్రజలను కేసీఆర్ కు వ్యతిరేకంగా చైతన్య వంతుల్ని చేయడంలో ముందుండే తీన్నార్ మల్లన్నను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఒక మాజీ ఎంపీ ఇటీవల ఆయనను కలిసి బీజేపీలో చేరాలని విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో మంచి పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. తీన్మార్ మల్లన్న జైలుకెళ్లడంతో ఆయనపై సానుభూతి మరింత ఎక్కువయిందని బీజేపీ భావిస్తుంది. మరి ఆయన ఏ పార్టీలో చేరతారన్నది చూడాలి.

Tags:    

Similar News