ఐదు కాదు… రెండింటిలోనే ఛాన్స్‌..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కనీసం ఐదు పార్ల‌మెంటు స్థానాలైనా గెలుచుకుంటామ‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి ధీమాగా ఉంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు పోటీ చేసిన [more]

Update: 2019-04-23 16:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కనీసం ఐదు పార్ల‌మెంటు స్థానాలైనా గెలుచుకుంటామ‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి ధీమాగా ఉంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు పోటీ చేసిన న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, చేవెళ్ల‌, మ‌ల్కాజ్ గిరి, ఖ‌మ్మం స్థానాల‌ను కచ్చితంగా గెలుచుకుంటామ‌ని కాంగ్రెస్ ఆశ‌గా ఉంది. అయితే, ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ ఐదు స్థానాలు గెల‌వ‌డం అంత సులువు కాద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. చేవేళ్ల‌, మ‌ల్కాజ్ గిరి మిన‌హా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదంటున్నారు. దీంతో గెలుపు అవ‌కాశాలు పూర్తిగా స‌న్న‌గిల్లాయి. ఈ స్థానాల్లో ఖ‌ర్చుకు కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థులు వెనుకాడార‌ట‌. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు మాత్రం ఖ‌ర్చుకు ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదు. దీంతో కాంగ్రెస్ ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు.

న‌ల్గొండ జిల్లాలోనూ క‌ష్ట‌మే

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని భువ‌న‌గిరి నుంచి సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, న‌ల్గొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఇద్ద‌రూ సీనియ‌ర్ నేత‌లు కావ‌డం, జిల్లాలో కాంగ్రెస్ కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉండ‌టంతో ఈ రెండు స్థానాలూ క‌చ్చితంగా గెలుచుకుంటామ‌ని కాంగ్రెస్ ఆశ‌తో ఉంది. అయితే, ఇది అంత సులువు కాద‌ని అంటున్నారు. ఈ ఇద్ద‌రు అభ్య‌ర్థులు కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని, డ‌బ్బు ఖ‌ర్చుకు వెన‌కాడార‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో జిల్లాలోని 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఎంపీ అభ్య‌ర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మించారు. తమ ఎన్నిక అనుకొని ప‌నిచేశారు. కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిలు, ఇటీవ‌ల ఓడిన వారు మాత్రం పార్ల‌మెంటు ఎన్నిక‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో కోమ‌టిరెడ్డి, ఉత్త‌మ్ కు గెలుపు అవ‌కాశాలు చివ‌రి నిమిషంలో పూర్తిగా త‌గ్గిపోయాయి.

ఆ రెండు స్థానాల్లో మాత్ర‌మే…

ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉన్నా, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచినా.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మాత్రం కాంగ్రెస్ విజ‌యం అంత సులువు కాద‌ని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బ‌రిలో ఉన్న రేణుకా చౌద‌రికి మ‌ద్ద‌తుగా నాయ‌కులు పెద్ద‌గా ప‌నిచేయ‌లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కోసం ప‌నిచేయ‌డంతో ఆమెకు క్లిష్ట ప‌రిస్థితే ఎదురైంది. టీఆర్ఎస్ లో గ్రూపు లొల్లి స‌మ‌సిపోవ‌డం, నాయ‌కులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి క‌చ్చితంగా ఖ‌మ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకునేందుకు క‌ష్ట‌ప‌డ‌టంతో ఆ పార్టీ గెలుపు పెద్ద‌గా క‌ష్టం కాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఇక‌, కాంగ్రెస్ కు ఇంకా ఆశ‌లు మిగిలి ఉన్న‌వి చేవెళ్ల, మ‌ల్కాజ్ గిరి నియోజ‌క‌వ‌ర్గాలపైనే. ఇక్క‌డ అభ్య‌ర్థులు విశ్వేశ్వ‌ర్ రెడ్డి ముందునుంచే గ్రౌండ్ వ‌ర్క్ చేసుకోవ‌డం, లోకల్ ఫీలింగ్ రావ‌డం వంటివి ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చాయ‌ని అంటున్నారు. మ‌ల్కాజ్ గిరిలోనూ రేవంత్ రెడ్డికి కొంత విజ‌యావ‌శాలు ఉన్నాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోవ‌డం సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

Tags:    

Similar News