ఈటలను అష్టదిగ్బంధనం చేసే దిశగా?

ఈటల రాజేందర్ ను ఒంటరి చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. ఈటల రాజేందర్ ఎవరు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ లో బలమైన నేత. బీసీ ముద్ర ఆయనపై [more]

Update: 2021-05-21 11:00 GMT

ఈటల రాజేందర్ ను ఒంటరి చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. ఈటల రాజేందర్ ఎవరు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ లో బలమైన నేత. బీసీ ముద్ర ఆయనపై ఉంది. స్వామిగౌడ్ వంటి నేతలు బయటకు వెళ్లినా కన్పించని అసంతృప్తి ఈటల రాజేందర్ విషయంలో స్పష్టంగా కన్పిస్తుంది. ఇప్పటికే అనేక మంది పార్టీల నేతలతో పాటు ఉద్యమ సంఘాల నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో ఈటల రాజేందర్ బలోపేతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది.

మనస్తత్వం తెలుసు కాబట్టి…?

ఈటల రాజేందర్ మనస్తత్వం కేసీఆర్ కు తెలియంది కాదు. ఆత్మగౌరవం అని నినదించే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పరిస్థితి ఏందన్న దానిపై ఇప్పుడు కేసీఆర్ పలువురు సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది. ఈటల రాజేందర్ ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం ఇప్పుడు టీఆర్ఎస్ అన్వేషిస్తుంది. బయట వ్యక్తులు కాకుండా ఈటల రాజేందర్ కు పోటీగా లోకల్ లీడర్ నే బరిలోకి దించాలన్నది కేసీఆర్ యోచిస్తున్నారు.

ఉప ఎన్నిక వస్తే…?

ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక రావడం గ్యారంటీ. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు మంచిపట్టుంది. దీంతో అక్కడ ముఖ్యమైన నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే అక్కడ పట్టు పెంచుకునేందుకు ఒక నేతను ఎంపిక చేయాలని కరీంనగర్ జిల్లా నేతలకు కేసీఆర్ సూచించినట్లు చెబుతున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావులాంటి నేతలు తాము పోటీ చేస్తామని చెబుతున్నా యువకుడిని బరిలోకి దింపాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది.

సన్నిహితులపై బదిలీ వేటు….

ఇప్పటికే ఈటల రాజేందర్ కు సన్నిహితంగా ఉండే అధికారులను బదిలీలు చేశారు. పోలీసులు, రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖల అధికారులు ఆ నియోజకవర్గం నుంచి బదిలీ అయ్యారు. ఈటల రాజేందర్ కు అక్కడ పట్టు దొరకకుండా ఉండేలా చేసేందుకు ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీ నుంచి వెళ్లకుండా చూడాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సరైన నేత కోసం కేసీఆర్ వెతుకుతున్నారు. దొరికితే వెంటనే నియోజకవర్గంలో ఆయనకు పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News