పక్కా స్కెచ్ తో వెళ్లారా?

అన్ని వైపులా ముప్పిరిగొన్న సమస్యలు. తెలంగాణ వ్యాప్తంగా దూకుడు పెంచిన బిజెపి. నిరంతరం సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో వున్న కాంగ్రెస్. అండగా నిలుస్తామని మాట ఇచ్చి వెనక్కి [more]

Update: 2019-10-25 05:00 GMT

అన్ని వైపులా ముప్పిరిగొన్న సమస్యలు. తెలంగాణ వ్యాప్తంగా దూకుడు పెంచిన బిజెపి. నిరంతరం సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో వున్న కాంగ్రెస్. అండగా నిలుస్తామని మాట ఇచ్చి వెనక్కి పోయిన సిపిఐ. నిత్యం తలనొప్పిగా మారిన ఆర్టీసీ సమ్మె. ఇన్ని వున్నా గులాబీ పార్టీ హుజూర్ నగర్ లో 43 వేల మెజారిటీ ఎలా సాధించింది. అది కాంగ్రెస్ కి దశాబ్దాలుగా కంచుకోటగా వున్న నియోజకవర్గంలో గులాబీ జండా ఎలా ఎగురవేయగలిగింది. అంటే దీనికి కెసిఆర్ అండ్ టీం పక్కా స్కెచ్ అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.

నిత్యం అందుబాటులో ఉంటూ ….

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నాటినుంచి రేపే ఎన్నికలు అన్నతీరులో నిత్యం ప్రజల్లోనే ఉండేవారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఆయన చొరవతో పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేసేవారు. దీనికి తోడు అధికారపార్టీ అండ దండా ఆయనకు పూర్తిగా ఉండటంతో ఎదురు లేకుండా పోయింది. అదే విధంగా ఎన్నికలకు ముందు జరిగే పోల్ మేనేజ్మెంట్ లో కారు పార్టీ దూసుకుపోయి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది.

ప్రతి 60 మందికి ….

హుజూర్ నగర్ ఎన్నికను గులాబీ పార్టీ సవాల్ గా తీసుకుంది. ఈ విజయంతో రాష్ట్రంలోని విపక్షాలన్నిటి నోరు మూయించాలని పని మొదలు పెట్టింది. దీనికోసం పక్కా ప్రణాళిక రచించింది. ప్రతి 60 మందికి ఒక వ్యక్తి చొప్పున నియమించి నిరంతరం పర్యవేక్షణ మొదలు పెట్టింది. కులాల వారీగా ప్రాంతాల వారీగా, గ్రూప్ ల వారీగా సమీకరణాలు ఎప్పటికప్పుడు లెక్కిస్తూ ఎవరికి ఏమి అవసరమో తెలుసుకుని ఆ పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసింది. చివరిగా ప్రజల్లోకి గులాబీ పార్టీ ఇచ్చిన నినాదం బాగా దూసుకుపోయింది. కాంగ్రెస్ హుజూర్ నగర్ లో గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కే లాభం. అదే టీఆర్ఎస్ గెలిస్తే నియోజకవర్గానికి లాభం అంటూ సాగించిన నినాదం ప్రజలను అధికారపార్టీని దీవించేలా పనిచేసింది.

Tags:    

Similar News