ఇప్పట్లో ఇది ముగిసేలా లేదు

తెలంగాణ లో టీఆర్ఎస్ వెర్సెస్ బిజెపి వార్ గట్టిగానే సాగుతుంది. కరోనా నుంచి సింగరేణి బొగ్గు గనుల ప్రవేటీకరణ అంశం వరకు ఉప్పు నిప్పులా ఈ రెండు [more]

Update: 2020-07-02 03:30 GMT

తెలంగాణ లో టీఆర్ఎస్ వెర్సెస్ బిజెపి వార్ గట్టిగానే సాగుతుంది. కరోనా నుంచి సింగరేణి బొగ్గు గనుల ప్రవేటీకరణ అంశం వరకు ఉప్పు నిప్పులా ఈ రెండు పార్టీలు రోడ్డెక్కుతున్నాయి. తెలంగాణ లో పట్టుకోసం కమలం కన్నేసిన నేపథ్యంలో మొగ్గలోనే కాషాయాన్ని తుంచేయాలన్న వ్యూహంతో కారు పార్టీ దూసుకుపోతుంది. దాంతో ఈ రెండు పార్టీల రాజకీయం తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏ ఒక్క అంశం కూడా ఈ రెండు పార్టీలు విడిచిపెట్టేందుకు వెనుకాడటంలేదు.

టెస్ట్ లు మొదలు పలు అంశాలపై …

కారు పార్టీకి బ్రేక్ లు వేయాలి అంటే తాము తప్ప ఎవ్వరు లేరని చాటి చెప్పాలని బిజెపి తహతహలాడుతోంది. అందులో భాగంగా కరోనా టెస్ట్ లు తెలంగాణ సర్కార్ చేయడం లో వెనుకబడి ఉందనే అంశం జనం లో పెట్టాయి కాషాయ దళాలు. అది బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఆ తరువాత లాక్ డౌన్ సమయంలో మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని, మూడు నెలలకు ఒకే బిల్లుతో స్లాబ్ మారిపోయి జనం జేబులకు చిల్లులు పడ్డాయని ఉద్యమం మొదలు పెట్టింది.

కౌంటర్ ఎటాక్ ఇస్తున్న కారు పార్టీ …

దీంతో కీలెరిగి వాతపెట్టింది కారు పార్టీ. దేశంలోని బొగ్గు గనులను ప్రవేటీకరించేందుకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సింగరేణి లో కమలం వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టేసింది. దాంతో తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జోరు తగ్గితే మరో పక్క బిజెపి ఆ ప్లేస్ ను భర్తీ చేసేసింది. వచ్చే ఎన్నికల సమయానికి వీరి సమరం ఏ స్థాయిలో ఉంటుందో అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. వీరిద్దరి లొల్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా స్థాయిలో మొదలైంది. ఇప్పటిలో ఇది ముగిసేలా లేదు. ఏ స్థాయికి వీరి తగవులు సాగుతాయో అంచనా వేయలేని పరిస్థితి ఉంది.

Tags:    

Similar News