ఇద్దరి పాలననీ చూశారు.. మరి మూడో వ్యక్తి ?

రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు సరికొత్త చర్చ సాగుతోంది. టీడీపీని దశాబ్దాలుగా చూసేశారు. జగన్ పాలననూ ఇపుడు చూస్తున్నారు. ఈ రెండు పాలనలనూ బేరీజు వేస్తున్న వారు మూడవ [more]

Update: 2020-12-31 15:30 GMT

రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు సరికొత్త చర్చ సాగుతోంది. టీడీపీని దశాబ్దాలుగా చూసేశారు. జగన్ పాలననూ ఇపుడు చూస్తున్నారు. ఈ రెండు పాలనలనూ బేరీజు వేస్తున్న వారు మూడవ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దానికి తగిన సామాజిక రాజకీయ ప్రాతిపదిక అయితే ఉందని కూడా చెబుతున్నారు. పై రెండు పార్టీలూ తమ సొంత కులాన్ని మాత్రమే పట్టించు కుంటున్నాయని లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఎనభై శాతం పైగా ఇతర కులాలకు చోటు ఇవ్వాల్సిన అవసరం రాజకీయాల్లో ఉందని, అందుకోసం కొత్త రాజకీయ వేదిక అవసరం అని అంటున్నారు.

ఉండవల్లి మాట….

ఏపీలో టీడీపీ ఏలుబడి అంతా కమ్మలదే పెత్తనంగా సాగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ పోస్టింగుల నుంచి ఆధిపత్యం రెడ్లది అవుతోందని తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే మిగిలిన కులాల సంగతేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అందువల్ల కొత్త రాజకీయం అవసరమని కూడా చెబుతున్నారు. దీని కోసం ఇపుడున్న పార్టీలేవీ కూడా సరిపోవని కూడా ఉండవల్లి అంటున్నారు. బీజేపీ వంటి పార్టీల అజెండా వేరు అని, అవి లౌకికవాదాన్ని దెబ్బతీసేవని చెబుతున్నారు. మరి ఈ విధంగా ఆలోచిస్తే కొత్త పార్టీ కొత్త నాయకుడు వచ్చేంత సీన్ ఏపీలో ఉందా అన్నదే ప్రధానంగా చర్చగా ఉంది.

ఉత్సవ విగ్రహాలేనా…?

ఏపీలో వైసీపీ గొప్పగా చెప్పుకుంటోంది. తాము బీసీలకు, ఇతర వెనకబ‌డిన వర్గాలకు మంత్రి పదవులతో సహా అన్నింటా కచ్చితమైన భాగస్వామ్యం ఇచ్చామని. గతంలో టీడీపీ కూడా బీసీలకు, ఇతర బడుగు వర్గాలకు పదవులు కట్టబెట్టింది. కానీ అది పేరుకు మాత్రమే పైపైనే అని బడుగు కులాలకు చెందిన నాయకులు, మేధావులూ అంటున్నారు. అసలైన అధికారం దక్కనంత కాలం పేర్లు చూసి మోసపోకూడని కూడా హెచ్చరిస్తున్నారు. ఏపీలో బీసీ మంత్రులు, ఇతర బలహీన వర్గాల మంత్రులు ఉన్నా ఎంతమందికి స్వేచ్చగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికి కష్టమేనా…?

అయితే ఎవరెన్ని చెప్పుకున్న ఏపీ రాజకీయాల్లో బలంగా ఉన్న కమ్మ రెడ్డి సామాజిక వర్గాలను ఢీ కొట్టి కొత్త పార్టీతో ముందుకు వచ్చే నాయకుడు సమీప భవిష్యత్తులో లేడనే చెప్పాలి. వైసీపీ మీద విసుగెత్తితే టీడీపీని ఎన్నుకుంటారు, టీడీపీ మీద తిక్క రేగితే వైసీపీకి జై కొడతారు. దానికి కారణం ఈ రెండు పార్టీలు ఆర్ధికంగా కూడా గట్టిగా ఉన్నాయి. తమ బలంతో గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పార్టీలను రాజకీయాలను పూర్తిగా విస్తరించుకున్నాయి. అలాగే చాలాకాలంగా రాజకీయాలను చూసిన అనుభవం కూడా ఉంది. కొత్తగా ఒక నాయకుడు ఏపీ రాజకీయాల్లోకి దూసుకు వచ్చి ఎమర్జ్ కావాలంటే అది చాలా కష్టమైన క్లిష్టమైన విషయంగా కూడా చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన సామాజికవ‌ర్గాలతో అనుసంధానం అయిన ఇతర ముఖ్య సామాజిక కులాలు కూడా చాలానే ఉన్నాయి. ముందు వారిని విశ్వాసంలోకి తీసుకుని కధ నడిపితేనే విజయం సాధిస్తారు. అయితే అపుడు కూడా ఏదో ఒక సామాజికవర్గం కేంద్రంగా చేసుకుని రాజకీయం చేస్తే ఆ కధ కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల ఇది కలగానే ఇప్పటికి మిగిలిపోతుందేమో. మేధావులు, విశ్లేషకుల మధ్య చర్చగా ఉండిపోతుందేమో.

Tags:    

Similar News