శిష్యుడే కదా అని వదిలేస్తే

తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ నేత. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుపోయే ఆయన ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు [more]

Update: 2019-07-08 12:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ నేత. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుపోయే ఆయన ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఆయన ప్రత్యేకత. తాజా ఎన్నికల్లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి చేపట్టాలని అనుకున్నారు. వాస్తవానికి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే కొన్ని ఈక్వేషన్స్ వల్ల చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయనే కలవపూడి శివ.

బలవంతంగా బరిలోకి దించి….

తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న ఆ నేతను చంద్రబాబు బలవంతంగా ఎంపీ బరిలోకి దించారు. ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయ‌న‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖ‌చ్చితంగా గెలిచేవారు. ఆయన ఎంపీగా ఓడిపోవడంతో ఏ పదవి లేకుండా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంత‌కు ఆ నేత ఎవరో కాదు పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. 2009, 2014 ఎన్నికల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా శివ ఘనవిజయం సాధించారు. 2009లో 17 వేలు, 2014లో 36 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన శివ… క్షత్రియ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు శివకు అవకాశం ఇవ్వలేకపోయారు.

హ్యాట్రిక్ కొట్టాలనుకున్నా….

ఇక తాజా ఎన్నికల్లో ముచ్చటగా మూడో సారి ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని శివ ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే టీడీపీకి నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేకపోవడంతో చివర్లో పార్టీ శివ‌ను ఎంపీగా పోటీ చేయించి ఆయన అనుచరుడైన మంతెన రాంబాబును ఉండి ఎమ్మెల్యేగా బరిలోకి దించింది. విచిత్రం ఏంటంటే అప్పటివరకు నరసాపురం టిడిపి ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉన్న కనుమూరు రఘురామ కృష్ణం రాజు వైసీపీలోకి వెళ్లిపోవడంతో…. కలవపూడి సొసైటీ అధ్యక్షుడుగా ఉన్న మంతెన రాంబాబును శివే స్వయంగా చంద్రబాబు దగ్గరికి తీసుకు వెళ్లి ఎంపీ సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు.

ముక్కోణపు పోటీలో….

అయితే చంద్రబాబు నువ్వు అయితేనే ఎంపీ అభ్యర్థిగా సమర్ధుడివి అని…. నువ్వు చెప్పిన నీ అనుచరుడికి ఉండి ఎమ్మెల్యే సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో తాను ఎంపీగా పోటీ చేసినా తన అనుచరుడికే ఉండి ఎమ్మెల్యే సీటు దక్కడంతో శివ ఎంపీ బరిలో నిలిచి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుతో పాటు జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబును ఢీకొట్టారు. ఈ ముక్కోణపు పోటీలో శివపై వైసీపీ అభ్యర్థి కేవలం 26 వేల ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక ఉండిలో మాత్రం ఆయ‌న‌అనుచరుడు మంతెన రాంబాబు 10 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఉండి నుంచి శివ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖ‌చ్చితంగా ఆయన గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యేవారు. చంద్రబాబు ఒత్తిడితో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసి ఎంపీగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఏ ప‌ద‌వి లేకుండా పోయింది. ఏదేమైనా చంద్రబాబు వేసిన ప్లాన్ తో శివ రాజకీయ జీవితం అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మిగిలింది.

Tags:    

Similar News