కుదురుకునేదెలా….?

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా రాష్ట్రంలో కుదురుకోలేని పరిస్థితి. తండ్రి వివిధ కేసుల్లో జైలులో ఉన్నారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించే సత్తా తేజస్వీయాదవ్ కు [more]

Update: 2019-07-08 16:30 GMT

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా రాష్ట్రంలో కుదురుకోలేని పరిస్థితి. తండ్రి వివిధ కేసుల్లో జైలులో ఉన్నారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించే సత్తా తేజస్వీయాదవ్ కు ఉందా? లేదా? ఇదీ బీహార్ లోని రాష్ట్రీయ జనతాదళ్ లో విన్పిస్తున్న ప్రశ్నలు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఘోరంగా దెబ్బతినడంతో తేజస్వీయాదవ్ నాయకత్వంపై ఆర్జేడీలోనే ఆశలు సన్నగిల్లాయి. మరోవైపు లాలూ యాదవ్ కూడా జైలులో ఉండటంతో పార్టీ క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది.

గత ఎన్నికల్లో…..

2015 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. అప్పట్లో మహాకూటమికి జనతాదళ్ యు అధినేత నితీష్ కుమార్ సారథ్యం వహించారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ లు కలసి మహాకూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. మొత్తం 243 స్థానాలున్న బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో 178 స్థానాల్లో మహాకూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే లాలూ యాదవ్ కుటుంబ సభ్యులు అవినీతి కేసుల్లో కూరుకోవడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో…..

లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ కొంత సత్ఫలితాలనే సాధించింది. దీంతో తేజస్వియాదవ్ నాయకత్వంపై నమ్మకం ఏర్పడింది. లాలూ యాదవ్ జైలు నుంచే సలహాలు ఇస్తుండటంతో తేజస్వి యాదవ్ పార్టీపై పట్టు సాధించారు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు లాలూ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు భారతీీయ జనతా పార్టీ కూటమి ముందు నిలవలేకపోయాయి.

రాజీనామా చేయాలంటూ…..

తాజాగా లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ పై కూడా వత్తిడి పెరుగుతుంది. ఈ వత్తిడి చేస్తుంది ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ నేతలే కావడం గమనార్హం. బీహార్ శాసనసభ ప్రతిపక్ష నేత పదవికి తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహాకూటమి పరాజయానికి బాధ్యత వహించాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తేజస్వి యాదవ్ సామర్థ్యం, నాయకత్వంపై అనుమానాలు అయితే బయలుదేరాయి. మరి వీటి నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.

Tags:    

Similar News