ఎంతైనా తాత కదా…??

ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ పార్టీ. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రాంతీయ పార్టీలో వారసుల సంఖ్య ఎక్కువగా ఉంటే మనస్పర్థలు తప్పవు. పార్టీలో లుకలుకలు గ్యారంటీ. పార్టీ [more]

Update: 2019-07-08 17:30 GMT

ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ పార్టీ. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రాంతీయ పార్టీలో వారసుల సంఖ్య ఎక్కువగా ఉంటే మనస్పర్థలు తప్పవు. పార్టీలో లుకలుకలు గ్యారంటీ. పార్టీ పదవుల కోసం ఆరాటపడటంలో కుటుంబ సభ్యులు ముందుంటారు. ఇప్పుడు మాజీ ప్రధాని, జనతాదళ్ అధినేత దేవెగౌడ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. దేవెగౌడ జనతాదళ్ ఎస్ లో పదవులను భర్తీ చేశారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా దళిత నేత హెచ్.కె.కుమారస్వామిని ఎంపిక చేశారు. ఇందులో ఎలాంటి వివాదాలకు తావు లేదు. కానీ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ను ఎంపిక చేయడమే కుటుంబంలో వివాదాలకు కారణమయిందంటున్నారు.

కుటుంబ సభ్యులతో….

దేవెగౌడ తన పార్టీని కుటుంబ సభ్యులతో నింపేస్తారు. ఎవరేమనుకున్నా పార్టీ టిక్కెట్ల దగ్గర నుంచి పదవుల వరకూ తమ కుటుంబ ఆధిపత్యమే కొనసాగాలని ఆయన కోరుకుంటారు. దేవెగౌడ కుమారులైన కుమారస్వామి, రేవణ్ణలను పార్టీలో కీలకంగా ఉంచుతున్నారు. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి, రేవణ్ణకు మంత్రి పదవి ఇచ్చి దేవెగౌడ ఇద్దరినీ సంతృప్తి పర్చారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో దేవెగౌడ కుటుంబమే బరిలోకి దిగింది.

మనవడి ఓటమి….

తుముకూరు నుంచి దేవెగౌడ, హాసన నుంచి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్, మాండ్య నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడలు పోటీ చేశారు. ఇందులో దేవెగౌడ, నిఖిల్ గౌడ లు ఓటమిపాలయ్యారు. హాసన్ నుంచి ప్రజ్వల్ మాత్రమే గెలుపొందారు. తన తాత కోసం హాసన స్థానానికి రాజీనామా చేస్తానని ప్రజ్వల్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించినా దేవెగౌడ అందుకు అంగీకరించలేదు. మాండ్య స్థానం నుంచి నిఖిల్ గౌడ ఓటమి నుంచి పెద్దాయన చాలా రోజులు కోలుకోలేకపోయారు.

కుటుంబంలో కలతలు…..

తాజాగా నిఖిల్ గౌడను జనతాదళ్ ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడంతో దేవెగౌడ కుటుంబంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం కూడా లేకపోలేదు. నిఖిల్ గౌడ నియామకాన్ని మరో మనవడు ప్రజ్వల్ వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కుమారస్వామి నియామకం తెలుసుకాని, నిఖిల్ గౌడ నియామకం తనకు తెలియదని ప్రజ్వల్ అనడం విభేదాలు తలెత్తాయనడానికి ఉదాహరణగా చూపుతున్నారు. ఓటమితో కుంగిపోయి ఉన్న నిఖిల్ గౌడను సంతృప్తి పర్చేందుక దేవెగౌడ ఈ పదవిని కట్టబెట్టారన్న టాక్ కూడా విన్పిస్తుంది.

Tags:    

Similar News