ఈయన ఒకే ఒక్క కోరిక తీరుతుందా..!

నేత‌ల‌న్నాక‌.. స‌వాల‌క్ష కోరిక‌లుంటాయి.. ప‌ద‌వి.. మంచి ప‌ద‌వి.. చాలా మంచి ప‌ద‌వి.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అంతే ఉండ‌దు. అయితే.. ఇందులో కొంద‌రి నేత‌ల కోరిక‌లు [more]

;

Update: 2019-07-08 00:30 GMT
గుత్తా సుఖేందర్ రెడ్డి
  • whatsapp icon

నేత‌ల‌న్నాక‌.. స‌వాల‌క్ష కోరిక‌లుంటాయి.. ప‌ద‌వి.. మంచి ప‌ద‌వి.. చాలా మంచి ప‌ద‌వి.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అంతే ఉండ‌దు. అయితే.. ఇందులో కొంద‌రి నేత‌ల కోరిక‌లు తీరుతాయి. కానీ.. మ‌రికొంద‌రి క‌ల‌ల క‌ల‌లుగా మిగిలిపోతాయి. ఇప్పుడు ఇదే జాబితాలో ఓ సీనియ‌ర్ నేత చేరిపోయారా.. ? అంటే ఔన‌నే అంటున్నాయి. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు. ఇంత‌కీ.. పాపం..! ఆ సీనియ‌ర్ నేత ఎవ‌రని ఆలోచిస్తున్నారు. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా విష‌యానికి వ‌చ్చేద్దాం. ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో కొంద‌రి నేత‌ల పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. అందులో ఒక‌రు గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి. సీనియ‌ర్ నాయ‌కుడు. టీడీపీ, కాంగ్రెస్‌, ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతున్నారు.

అధికార పార్టీలో చేరినా….

చంద్రబాబు టిక్కెట్ ఇవ్వక‌పోవ‌డంతో 2009లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి జంప్ చేసి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ల్లగొండ నుంచి వ‌రుస‌గా ఎంపీగా గెలిచారు. అయితే..న‌ల్లగొండ ఎంపీగా ప‌లుమార్లు ప‌నిచేసిన గుత్తాకు ఒక కోరిక‌.. ఒకేఒక్క కోరిక ఉంద‌ట‌. 2014లో కాంగ్రెస్ నుంచి న‌ల్లగొండ ఎంపీగా గెలిచిన త‌ర్వాత ఆయ‌న అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. అంత‌కుముందు టీడీపీ నుంచి కూడా ఆయ‌న ఎంపీగా గెలిచారు. ఇక ఆయ‌న అనుభ‌వానికి త‌గిన‌ట్టే టీఆర్ఎస్‌లోనూ గుర్తింపునిచ్చారు పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌. రైతు స‌మ‌న్వయ స‌మితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌ద‌వి క‌ట్టబెట్టారు.

మంత్రి కావాలని….

ఈ ప‌ద‌వి అప్పట్లో ఆయ‌న‌కు కొంత సంతృప్తిని ఇచ్చిన‌ట్టే అనిపించింద‌ట‌. కానీ.. రానురాను.. ఆయ‌న తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన‌ట్లు అనుచ‌రులు తీవ్ర బాధ‌ప‌డుతున్నార‌ట‌. త‌మ నేత‌కు స‌రైన ప‌ద‌వి రావ‌డం లేద‌ని, పార్టీలోనూ త‌గిన గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని ఒక‌టే చ‌ర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ.. అనుచ‌రుల వ‌ద్ద బాధ‌ప‌డుతున్నట్లు స‌మాచారం. అయితే.. ఇంత‌కీ గుత్తా కోరిక‌.. అదేనండీ.. ఒకేఒక్క కోరిక ఏమిటంటే.. రాజకీయ జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావ‌డ‌మేన‌ట‌. మ‌రి ఈ కోరిక నేర‌వేరాలంటే.. ఎమ్మెల్యేగానైనా గెలవాలి లేదా ఎమ్మెల్సీ అయినా కావాలి.

కేసీఆర్ హామీతోనే….

టీఆర్ఎస్‌లో ప్రస్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు. ఇక ఎమ్మెల్సీ కూడా అయ్యే అవ‌కాశం ద‌రిదాపుల్లోనూ క‌నిపించ‌డం లేదు. ఆ జిల్లాలో ఖాళీ అయిన హుజూర్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేసేందుకు గుత్తా సుముఖంగా లేరు. గ‌తేడాది చివ‌ర్లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోదాడ నుంచి పోటీ చేయ‌మ‌ని చెప్పినా అప్పట్లో ఆ సీటుపై న‌మ్మకం లేని గుత్తా పోటీ చేయ‌లేదు. కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తాన‌ని గుత్తాకు హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారం జ‌రిగింది.

ఇప్పటికే నిండిపోవడంతో….

అయితే ఇప్పటికే కేసీఆర్ కేబినెట్లో ఐదుగురు రెడ్డి వ‌ర్గం నేత‌లు మంత్రులుగా ఉన్నారు. ఈ క్రమంలో గుత్తా గోడును ప‌ట్టించుకునే ప‌రిస్థితులు లేవు. ఎలాగూ మంత్రి అవుతున్నాను క‌దా ? అని న‌మ్మకంతో ఈ ఎన్నిక‌ల్లో గుత్తా ఎంపీగా కూడా పోటీ చేయ‌లేదు. దీంతో ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప‌రిస్థితి రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారింది. ఈ ప‌రిస్థితుల్లో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి కోరిక ఎలా నెర‌వేరుతుంద‌ని అనుచ‌రులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఒక‌వేళ‌.. అనూహ్యంగా ప‌రిణామాలు క‌లిసివ‌చ్చి.. సీఎం కేసీఆర్ క‌రుణించి.. ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తే.. గుత్తా కోరిక తీరే అవ‌కాశాలు మాత్రం క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News