ఆత్మస్తుతి.. పరనింద.. అంతకు మించి?

భారత్ స్వాతంత్య్ర అమృతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. ఇంకా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుని ముందుకు వెళ్లడానికి ఇదొక మహత్తర సందర్భం. [more]

Update: 2021-08-16 15:30 GMT

భారత్ స్వాతంత్య్ర అమృతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. ఇంకా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుని ముందుకు వెళ్లడానికి ఇదొక మహత్తర సందర్భం. భారత్ స్వేచ్చావాయువులు పీల్చుకున్న తర్వాత మూడు తరాలు గడచిపోయాయి. జాతీయంగానూ, రాష్ట్రాల్లోనూ పాలిస్తున్న నాయకుల్లో ఒకరిద్దరు మినహా అందరూ స్వాత్రంత్ర్యానంతరం పుట్టిన వారే. నరేంద్రమోడీ స్వాతంత్ర్యానంతర తరానికి చెందిన తొలి ప్రధాని. తెలుగు రాష్ట్రాలు రెండింటికీ ముఖ్యమంత్రులు కూడా స్వేచ్ఛ లభించిన తర్వాత పుట్టినవారే. దేశమూ, రాష్ట్రమూ ఇంతవరకూ అభివృద్ధి పథంలో వేసిన అడుగులు గుర్తుకు తెచ్చుకుని, తప్పులపై ఆత్మావలోకనం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ వేడుక. బానిస సంకెళ్లనుంచి విముక్తం చేయడానికి పెద్దలు పడిన కష్టం మరుగున పడిపోతోంది. వారు చేసిన త్యాగాలు కొత్త తరాలకు స్ఫురణకు రావడం లేదు. అందుకే ఇటువంటి అవకాశాలను నాయకులు సద్వినియోగం చేసుకుంటూ జాతిని మేల్కొలపాలి. కానీ రాజకీయ నాయకులు యథాతథంగా తమ ప్రచారానికే అమృతోత్సవ ఘట్టాలను సైతం పరిమితం చేయడం విచారకరం.

ప్రధాని నుంచి..

తాము చేసిన మంచి పనులు చెప్పుకోవడం తప్పేమీ కాదు. తాము చేసింది మాత్రమే గొప్పది. ఇంతవరకూ దేశాన్ని పాలించిన నాయకులెవరూ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్నట్లుగా నాయకులు మాట్టాడటం కచ్చితంగా పొరపాటే. అందులోనూ ప్రతి ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవ ఘట్టం కాదిది. 75 ఏళ్ల ప్రస్థానం. ఇంతవరకూ దేశాన్ని పాలించిన మొదటి మూడు తరాల నాయకులు భారత్ పై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రపంచంలో ఇప్పుడు భారతదేశ స్తానాన్ని ప్రజలకు వెల్లడించాలి. దేశ సేవ కోసం ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేయాలి. పరిపాలకులుగా అంతా తామే చేస్తున్నామన్న భ్రమ, భావనను విడనాడి ప్రజల కర్తవ్యం ఏమిటో కూడా ఉద్బోధించాలి. కానీ అంతటి ముందు చూపు ప్రదాని ప్రసంగంలో కనిపించలేదు. ఎన్డీఏ విజయాలు మాత్రమే భారత్ విజయాలు కాదు. అంతకుముందు కాంగ్రెసు, సంకీర్ణప్రభుత్వాలు సైతం దేశం ముందడుగులో ఎంతో కీలక పాత్ర పోషించాయి. వాటిని పూర్తిగా విస్మరించారు ప్రధాని.

ఆత్మస్తుతి..

దేశంలోనే సంక్షేమ పథకాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆ రికార్డు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే గతంలో పాలించిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నట్టుగా సాగింది ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం. వైసీపీ సర్కారు ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తుందో ఏకరవు పెట్టడానికే మొత్తం సమయం వెచ్చించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా తన విజన్ ఏమిటో చెప్పడానికి ప్రయత్నించలేదు. ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లదలిచారో వివరించే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడానికి ప్రజాసహకారం అవసరం. కులాలు, రాజకీయాల రొంపిలో కూరుకుపోయిన రాష్ట్రం. అత్యంత ఆదరణ కలిగిన నాయకునిగా ప్రజల్లో మార్పుకోసం, రాష్ట్రం ప్రగతిలో బాగస్వామ్యం కోసం ప్రజలకు పిలుపు ఇవ్వాల్సిన సందర్భం. దానిని పూర్తిగా పక్కన పెట్టి తమ పాలనలో ప్రజలకు సర్వసౌభాగ్యాలు ఇప్పటికే సమకూరిపోయాయన్న భావన కల్పించారు.

పరనింద..

స్కీములకు రూపకల్పన చేయడంలోనే కాదు, ప్రత్యర్థులను తిట్టిపోయడంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది ప్రత్యేక శైలి. రాష్ట్రవిభజనతో సొంత రాష్ట్రం వచ్చింది. ఏడేళ్లుగా ఒకే ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. ఉమ్మడి ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిని సంతరించుకుంది. దక్షిణ భారతంలో పెద్ద రాష్ట్రానికి రాజధానిగా అనేక రకాల హంగులు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వ సంస్తలు ఏర్పాటయ్యాయి. చిన్న రాష్ట్రంగా తొలినాటి నుంచి తెలంగాణ ఉంటే ఇటువంటి సదుపాయాలు అంత సులభంగా వచ్చేవి కావు. అంతమేరకు ఉమ్మడి రాష్ట్ర పాలకులనూ విస్మరించలేం. కానీ పూర్తిగా రాజకీయ కోణంలోనే విమర్శలను ఎక్కు పెట్టి టీఆర్ఎస్ అదికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అభివృద్ధి మొదలైందన్నట్లుగా సాగింది కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం. ప్రజలకు పౌైర హక్కులు, సంక్షేమం తామే ఇచ్చామన్నట్లుగా ఆత్మస్తుతి, పరనిందగా సాగింది. రాజకీయాల్లో ఉన్న నాయకులు తమ గొప్పలు చెప్పడంలో ఎప్పటికప్పుడు రకరకాల మాధ్యమాలను వినియోగిస్తుంటారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అయినా ప్రచార వేదికలుగా మార్చకుండా సంయమనం పాటిస్తే ప్రజలకు ఆదర్శం చూపినట్లవుతుంది. దేశభక్తి విషయంలో యువతకు దిశానిర్దేశం చేసినట్లవుతుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News