వెనకున్నది మీరేనటగా

తెలుగుదేశం పార్టీ పూర్తిగా బయటపడుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఎవరేమన్నా అమరావతిని రాజధానిలో ఉంచాలని నిర్ణయించింది. పేరుకు అమరావతి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ అయినప్పటికీ వెనక [more]

Update: 2020-01-11 11:00 GMT

తెలుగుదేశం పార్టీ పూర్తిగా బయటపడుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఎవరేమన్నా అమరావతిని రాజధానిలో ఉంచాలని నిర్ణయించింది. పేరుకు అమరావతి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ అయినప్పటికీ వెనక ఉండి నడిపిస్తుంది మాత్రం మొత్తం తెలుగుదేశం పార్టీయేనన్నది అందరికీ తెలిసిందే. కేవలం 29 గ్రామాలకే ఉద్యమం పరిమితం కాకూడదని, పదమూడు జిల్లాల్లో ఉద్యమాన్ని చేసి అమరావతిని రక్షించుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది.

నేతలకు దిశానిర్దేశం…..

ఇప్పటికే చంద్రబాబు పార్టీ నేతలకు దీనిపై దిశానిర్దేశం చేశారు. తాము ప్రారంభించిన రాజధాని అమరావతిని తరలించడమేంటని చంద్రబాబునేతలను ప్రశ్నిస్తున్నారు. అన్ని జిల్లాలకు సమానదూరం కాబట్టే అమరావతిని ఎంపిక చేశామని చెబుతున్నారు. కేవలం తనపైన కక్షతోనే జగన్ అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ల్లో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

జిల్లా జేఏసీల ఏర్పాటుతో….

ప్రతి జిల్లాలో టీడీపీ వెనక ఉండి జేఏసీలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో అన్ని వర్గాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రధానంగా కమ్యునిస్టు పార్టీల నేతలను, ప్రొఫెసర్లను, మేధావుల్లో ఎవరినైనా జేఏసీ కన్వీనర్లుగా ఎంపిక చేయాలని చంద్రబాబు సూచిస్తున్నారు. ఈమేరకే దాదాపు అన్ని జిల్లాల్లో జేఏసీలు ఏర్పాటయ్యాయి. ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన చేపట్టాలని అధినేత సూచించడంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ధర్నా వంటివి జిల్లా జేఏసీలు గత రెండు రోజుల నుంచి చేస్తున్నాయి.

పదమూడు జిల్లాలకు విస్తరించాలని….

జేఏసీ బస్సు యాత్ర కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనే. బస్సులను జేఏసీకి సమకూర్చింది కూడా టీడీపీయేనని వైసీపీ ఆరోపిస్తుంది. జిల్లాలకు వెళితే అక్కడ బస్సులపైన కాని, జేఏసీ నేతలపై దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుకే అధికారులు యాత్రకు అనుమతి ఇవ్వలేదంటున్నారు. ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితం కాకుండా పదమూడు జిల్లాలకూ విస్తరించాలన్న చంద్రబాబు ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News