జనసేన దూకుడు కి టిడిపి చెక్ …?

పక్కా కార్యాచరణతో జనంలోకి జనసేన ను తీసుకువెళ్లాలని ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఆయన నేతృత్వంలో పార్టీ లోని ముఖ్యులు సమావేశమై ఇసుక విధానంపై [more]

Update: 2019-10-27 13:30 GMT

పక్కా కార్యాచరణతో జనంలోకి జనసేన ను తీసుకువెళ్లాలని ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఆయన నేతృత్వంలో పార్టీ లోని ముఖ్యులు సమావేశమై ఇసుక విధానంపై యుద్ధానికి సమరభేరి మోగించారు. నవంబర్ 3 న విశాఖలో ఇసుక విధానం పై భారీ ర్యాలీకి జనసేన సన్నాహాలు చేస్తుంది. వైసిపి సర్కార్ అనుసరిస్తున్న ఇసుక పాలసీ సామాన్యులను భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వారిని దెబ్బతీస్తుందని తక్షణమే అందుబాటులోకి ఇసుకను తీసుకురావాలన్న స్లోగన్ తో జనసేన పక్షం రోజుల ముందే తమ అజండా ప్రకటించింది. జనసేన తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయితే ఆ పార్టీ ప్రజలకు ఎంతోకొంత చేరువ అవుతుంది.

అలెర్ట్ అయిన టిడిపి …

నిత్యం ముఖ్యమంత్రి జగన్ ను వైసిపి పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోసే టిడిపి జనసేన ఇసుక కార్యాచరణతో కళ్ళు తెరిచింది. ప్రధాన ప్రతిపక్షంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున అల్లరి చేయాలిసింది తామైతే జనసేన కు మైలేజ్ వచ్చే పరిస్థితిని అంచనా వేసి నిత్యం ఇసుక పై కార్యక్రమాలు మొదలు పెట్టింది. అమరావతి నుంచి గల్లీ వరకు టిడిపి నేతలంతా ఇసుక విధానాన్ని విమర్శించాలని ఆదేశించింది. వీలైతే ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని కోరింది. దాంతో ఇసుక ఉద్యమం జనసేన నుంచి టిడిపి హైజాక్ చేయడం మొదలైపోయింది.

రంగంలోకి కామ్రేడ్ లు …

ఇసుక పై ఎపి లో మొదటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది కమ్యూనిస్ట్ లే. గత ప్రభుత్వంలో టిడిపి ఇసుక దందా లు అందరికి తెలిసినవే కావడంతో ఆ పార్టీని కలుపుకోకుండా కామ్రేడ్ లు సొంతంగానే ఉద్యమాలు మొదలు పెట్టారు. భవననిర్మాణ రంగాన్ని ఆదుకోవాలంటూ ధర్నాలు, భిక్షాటనలు చేస్తున్నారు. విపక్షాలు చేస్తున్న ఈ ఉద్యమ ఎజెండా ఒకటే అయినా దారులు వేరుగా నడుస్తున్నాయి.

సర్కార్ తప్పటడుగు …

కొత్త ప్రభుత్వం కొలువైన తరువాత కొత్త విధానం రూపొందేవరకు ఇసుకను పాత విధానంలో కొనసాగించి ఉంటే ఈ విమర్శలు ఆరోపణలు వైసిపి సర్కార్ కి తప్పి ఉండేవి. మే లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జూన్, జులై మాసాల్లో ఎపి లో వరదలు వర్షాలు లేనందున ఇసుక అవసరమైనంత అందుబాటులో వుంది. ఆ సమయంలో పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని వరదల సమయంలో సెప్టెంబర్ లో ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వర్షాలు, వరదలతో ఆ సమయంలో ఇసుక లభ్యత లేకపోవడంతో సహజంగానే సర్కార్ డిఫెన్స్ లో పడింది. ప్రతిపక్షానికి చక్కటి ఆయుధం అందించినట్లు అయ్యింది. కొత్త విధానం పై ఇప్పటికి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో విపక్షాలు మూకుమ్ముడిగా చేస్తున్న ఇసుక దాడి జగన్ సర్కార్ కి తలపోటు తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాబోయే రోజుల్లో అయినా ప్రభుత్వం పారదర్శక విధానంలో ఇసుకను ప్రజలకు అందిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News