వైసీపీది గెలుపు కానే కాదట…!!

ప్రజాస్వామ్యంలో అసలైన గెలుపు ఎవరిది అంటే నిస్సందేహంగా ప్రజలదే అని చెప్పాలి. ఎప్పటికపుడు తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లుగా చెప్పి గట్టి తీర్పు ఇవ్వడమే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఓటు [more]

Update: 2019-07-16 03:30 GMT

ప్రజాస్వామ్యంలో అసలైన గెలుపు ఎవరిది అంటే నిస్సందేహంగా ప్రజలదే అని చెప్పాలి. ఎప్పటికపుడు తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లుగా చెప్పి గట్టి తీర్పు ఇవ్వడమే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఓటు దెబ్బకు కంచుకోటలన్నీ మంచుకోటవుతాయి. మేము శాశ్వతం, మాకు ఎదురు లేదు అని ఎవరైనా అనుకుంటే వారిని కిందకు దించి అధికారాన్ని, అహంకారాన్ని వదిలించే సత్తా ఓటరుకే ఉంది. ఏపీలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. అలా ఇలా కాదు, పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పరాజయాన్ని మూటకట్టుకుంది. అయితే కిందపడ్డా పై చేయి మాదే అనడం తమ్ముళ్లకే చెల్లింది.

ఈవీఎంల మీద నింద…

మేము అసలు ఓడిపోలేదు, ప్రజలు మమ్మల్ని ఓడించలేదు, ఈవీఎంలే ఓడించాయి, ఇదీ ఇపుడు తమ్ముళ్లు తాపీగా చెబుతున్న మాట. ఓటమిని కూడా హుందాగా తీసుకోవడం అలవాటు లేని రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్తోంది. ఓ విధంగా ఇది ఆ పార్టీకి చేటు తెచ్చేదే. నిజానికి ఈ తొండి వాదనను అధినాయకుడు చంద్రబాబే తమ్ముళ్లకు అందించాడు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే మధ్యలో బాబు చేసిన పోరాటం అంతా ఈవీఎంల మీదనే కదా. ఇక ఓడిన తరువాత కూడా బాబు అదే పాట పాడుతున్నారు. మా ఓటు అంతా మీకే వేశాం బాబు అదెక్కడికి పోయిందో తెలియడం లేదని ప్రజలు అంటున్నారుట. అనంతపురం పరామర్శ యాత్రలో చంద్రబాబు మీడియాతో స్వయంగా చెప్పిన మాటలివి. అంటే ఈవీఎంల వల్లనే ఓడిపోయామని బాబు ఇప్పటికీ అంటున్నారు. మరి అలాంటపుడు న్యాయ పోరాటం చేయవచ్చు కదా అంటే ఆధారాల్లేవని తమ్ముళ్లు అంటున్నారు. అంటే ఆధారం లేని విషయాన్ని పట్టుకుని తాము చెవిలో పువ్వులు పెట్టుకోవడమే కాకుండా ప్రజల చెవిలో కూడా తమ్ముళ్లు పెడుతున్నారన్నమాట.

బ్యాలెట్ అయితే దున్నేస్తారట…

బ్యాలెట్ మీద ఎన్నికలు పెట్టండి దున్నేస్తామంటున్నారు తమ్ముళ్ళు. కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలు దీని మీద ఓ అడుగు ముందుకేసి జగన్ కి బ్యాలెట్ మీద ఎన్నికలు నిర్వహించే దమ్ము ఉందా అని అడుగుతున్నారు బ్యాలెట్ మీద లోకల్ బాడీ ఎన్నికలు పెడితే నూటికి నూరు శాతం సీట్లు, ఓట్లు తమకే పడతాయని కూడా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇక వైసీపీ అయితే ఇపుడు అసెంబ్లీకి వచ్చిన సీట్లతో సమానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలట. అపుడే తాము వైసీపీ గెలిచినట్లుగా నమ్ముతామని తమ్ముళ్ళు అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంల మీదనే గెలిచారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది ఈవీఎంల మీదనే కదా. దానిసంగతేమంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి ఈ బడాయి ఎంతవరకూ తమ్ముళ్లు కొనసాగిస్తారో.

Tags:    

Similar News