టార్గెట్ టీడీపీ అదేనట… సక్సెస్ కు కొద్దిదూరంలో

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒక్కటే కన్పిస్తుంది. పదిహేను నెలల్లో ఏదో ఒక ప్రభుత్వ అవినీతిని నిరూపించాలని. అంతేకాదు కనీసం ఒక మంత్రినైనా జగన్ [more]

Update: 2020-10-13 09:30 GMT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒక్కటే కన్పిస్తుంది. పదిహేను నెలల్లో ఏదో ఒక ప్రభుత్వ అవినీతిని నిరూపించాలని. అంతేకాదు కనీసం ఒక మంత్రినైనా జగన్ మంత్రి వర్గం నుంచి తప్పించగలిగితే సగం విజయం సాధించినట్లేనని తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తుంది. ఒక్క మంత్రిపైనైనా అవినీతి ఆరోపణలను నిరూపించగలిగితే సగం సక్సెస్ అయినట్లేనని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు.

మంత్రి పై వరసగా…..

తమ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై అవినీతి ఆరోపణలు చేసి కేసులు నమోదు చేశారు. కానీ కేసులు నమోదు వరకూ కాకున్నా, మంత్రివర్గం నుంచి ఒక మంత్రిని తప్పించగలిగితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కొంత వరకూ సడలించగలుగుతామని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతిని రోజుకొకకటి చొప్పును తెలుగుదేశం పార్టీ నేతలు బయపెడుతున్నారు.

అయ్యన్నకే టాస్క్…..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఈ టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. గుమ్మనూరి జయరాంపై గతంలో బెంజికారు వివాదాన్ని అయ్యన్న పాత్రుడు లేవనెత్తారు. ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడి వద్ద నుంచి జయరాం కుమారుడు బెంజికారును బహుమతిగా పొందారని, దాని ఫలితమే అతడు 14వ నిందితుడిగా మార్చారని అయ్యన్న ఆరోపించారు. అయితే తనకు బెంజికారు లేనే లేదని మంత్రి జయరాం కొట్టిపారేశారు.

భూవివాదంలో……

తాజాగా కర్నూలు జిల్లాలో భూవివాదాన్ని అయ్యన్న పాత్రుడు తెరపైకి తెచ్చారు. కర్నూలు జిల్లాలో 203 ఎకరాలను ఇట్టినా సంస్థ నుంచి జయరాం తన బంధువుల పేరిట, బినామీల పేరిట స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. మంత్రి అయిన తర్వాతనే ఈ భూదందాకు పాల్పడ్డారని అయ్యన్న ఆధారాలతో బయటపెట్టారు. అయితే జయరాం తాను కొనుగోలు చేసింది వంద ఎకరాలు మాత్రమేనని, బీసీని కాబట్టే తన వెంట పడుతున్నారని అంటున్నారు. అయితే భూములు కొన్నమాట వాస్తవం కావడంతో జయరాంపై పార్టీ వర్గాలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నాయి. మరి మంత్రిని కేబినెట్ నుంచి తప్పిస్తే తెలుగుదేశం పార్టీ సగం సక్సెస్ అయినట్లే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News