తేలిపోయారే… ఎందుకిలా?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా విపక్షం తెలుగుదేశం పార్టీ పనితీరు ఎలా ఉందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ రోజుకో అంశం మీద అసెంబ్లీ [more]

Update: 2019-12-18 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా విపక్షం తెలుగుదేశం పార్టీ పనితీరు ఎలా ఉందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ రోజుకో అంశం మీద అసెంబ్లీ ఎదుట ఆందోళన చేసింది. ఉల్లిపాయలు, ఇసుక, మీడియా, ఉపాధి హామీ పథకం ఇలా ఒక్కో అంశంపై ఆందోళన చేసింది. అంతవరకూ బాగానే సభలో పెర్ఫార్మెన్స్ అంత బాగా లేదనే చెప్పాలి. దాదాపు ఏడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక అంశాల్లో ప్రభుత్వం సమర్థించాల్సి వచ్చింది.

బడ్టెట్ సమావేశాల్లో….

గత బడ్జెట్ సమావేశాల్లో దూకుడుగా వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాల్లో మాత్రం కొంత వెనకబడిందనే చెప్పాలి. జగన్ ఆరు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ ఎండగట్టలేకపోయిందని, ఇందుకు సరైన కారణాలు కూడా టీడీపీకి దొరకకపోవడమే కారణమని కూడా చెబుతున్నారు. ముందుగా దిశ చట్టం ప్రభుత్వం తేవడంతో దానిని టీడీపీ ఆమోదం తెలపాల్సి వచ్చింది. ఇక మద్యం ధరల పెంపు, షాపుల కుదింపు విషయంలో కూడా టీడీపీ ఎలాంటి ఆరోపణలకు దిగలేకపోయింది.

కొందరు తప్ప…..

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు వంటి వారు మాత్రమే అధికార పక్షంపై విరుచుకు పడుతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోవడం లేదు. వివిధ వ్యాపారాలు ఉండటంతో ఏమి మాట్లాడితే ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న భయంతో టీడీపీ ఎమ్మెల్యే మౌనంగానే ఉండిపోయారు. గొట్టి పాటి రవికుమార్, గంటా శ్రీనివాసరావు లాంటి వారు శాసనసభకు దూరంగా ఉన్నారు.

వైసీపీ వ్యూహం ముందు….

శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా ప్రారంభమయినప్పటికీ వైసీపీ వ్యూహం ముందు టీడీపీ తేలిపోయిందనే చెప్పాలి. దీనికి తోడు గత ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను వైసీపీ సభ్యులు పదే పదే లేవెనెత్తుతుండటంతో టీడీపీ నేతలు ఏమీ మాట్లాడలేకపోయారు. ఉపాధి హామీ పథకం పనులపై కూడా ఇదే రకమైన విమర్శలను టీడీపీ వైసీపీ నుంచి ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇక వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో అనేకసార్లు సభలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదురైనా టీడీపీ మాత్రం బడ్జెట్ సమావేశాల రీతిలో ఈ సమావేశాల్లో వ్యవహరించలేకపోయిందనే చెప్పాలి.

Tags:    

Similar News