అక్కడా టీడీపీకి నిరాశేనా…. నేత‌లు ఏమ‌య్యారు ?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి అత్యంత కీల‌క‌మైన జిల్లా తూర్పుగోదావ‌రి. ఈ జిల్లాలో అనేక మంది కీల‌క నేత‌లు ఉన్నారు. 2014లో క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాలో [more]

Update: 2021-02-23 09:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి అత్యంత కీల‌క‌మైన జిల్లా తూర్పుగోదావ‌రి. ఈ జిల్లాలో అనేక మంది కీల‌క నేత‌లు ఉన్నారు. 2014లో క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లోనూ కేవ‌లం నాలుగు స్థానాలు మాత్రమే ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు పంచాయ‌తీ ప‌రుగులో మాత్రం టీడీపీ సైకిల్ ఘోరంగా వెనుక‌బ‌డింది. పంచాయ‌తీ పోరులో మొత్తం 336 పంచాయతీల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. మెజారిటీ సంఖ్యలో పంచాయ‌తీలను సొంతం చేసుకుంటామ‌ని.. టీడీపీ నాయ‌కులు ఆది నుంచి చంద్రబాబుకు చెబుతున్నారు. చంద్రబాబు సైతం తూర్పులో స‌త్తా చాటాల‌ని పార్టీ నేత‌ల‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో రోజూ ఊద‌ర‌గొడుతూ వ‌చ్చారు. తొలి విడ‌త‌లో వ‌చ్చిన రిజ‌ల్ట్ చూస్తే టీడీపీ వాళ్ల మ‌తులు పోయాయి. తొలి విడ‌త‌లోనే 263 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. టీడీపీకి కేవ‌లం 50 స‌ర్పంచ్ స్థానాలు ద‌క్కాయి.

తొలిదశలో మరీ ఘోరం…..

క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే వైసీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు పంచాయ‌తీల్లో. టీడీపీకి నామినేషన్లు వేసేందుకు కూడా స‌రైన నేత‌లు లేని దుస్థితి ఎదురైంది. పార్టీ ఆవిర్భవించిన ఇన్నేళ్లలో ఈ జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీ ఎప్పుడూ ఇంత దుస్థితి ఎదుర్కోలేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగినా కూడా పార్టీ వీరాభిమానులు నామినేష‌న్లు వేయ‌లేద‌ని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇక టీడీపీ భారీగా పంచాయ‌తీలు కోల్పోగా.ఆ పార్టీ గెలిచిన స్థానాల్లో కూడా మెజార్టీలు చాలా స్వల్పంగా ఉన్నాయి. టీడీపీకి కేవ‌లం 50 పంచాయ‌తీలు మాత్రమే వ‌చ్చాయ‌ని మీడియా లెక్కలు చెపుతుంటే ఆ పార్టీ గ‌ణాంకాలు మాత్రం 120 అని చెపుతున్నాయి.

మాజీ మంత్రుల ఇలాకాలో…?

తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రిగిన చోట్ల కాకినాడ రూర‌ల్‌, పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్దతుదారుల నుంచి గ‌ట్టి దెబ్బ త‌గిలింది. మాజీ హోం మంత్రి నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప ఎమ్మెల్యేగా ఉన్న పెద్దాపురం, మ‌రో మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తుని నియోజ‌క‌వ‌ర్గాల్లో నామ‌మాత్ర స్థాయిలో కూడా టీడీపీ పోటీ ఇవ్వలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను శాసించిన ఈ ఇద్దరు మంత్రులు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ? క‌నీసం పార్టీ నేత‌ల‌కు ద‌శ దిశ నిర్దేశం కూడా చేయ‌లేదు. పిఠాపురంలో టీడీపీ పూర్తిగా బేజారే అయ్యింది.

పట్టున్న జిల్లాలోనే..?

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెన‌కేసుకున్న కీల‌క నేత‌లు సైతం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగితే స్థానిక నేత‌ల‌కు పైసా విద‌ల్చని దుస్థితి. ఏదేమైనా టీడీపీకి ప‌ట్టున్న జిల్లాలోనే అతి పెద్ద జిల్లాలోనే ఇలాంటి ప‌రిస్థితి ఏర్పడ‌డంపై చంద్రబాబు సైతం విస్మయం వ్యక్తం చేశార‌ట‌. ఓ మాజీ మంత్రి అయితే న‌డుం వెన‌క చేతులు పెట్టుకుని పేరు పోయినా పెద్దరికం న‌టిస్తూ… ప‌స‌లేని మాట‌ల‌తో కాలం గ‌డుపుతూ పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని జిల్లా నేత‌లు వాపోతున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. ఈ ఫ‌లితం వెలువ‌డిన త‌ర్వాత‌ ఆయన మీడియాకు సైతం చిక్కకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News