బాలయ్యను భలే వాడేస్తున్నారే

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం సులువుగా దొరకదు. కారణం పసుపు పార్టీ పలచన అయిపోతున్న తీరు రెండు [more]

Update: 2019-10-10 11:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం సులువుగా దొరకదు. కారణం పసుపు పార్టీ పలచన అయిపోతున్న తీరు రెండు చోట్లా కనిపిస్తుంది. ఇక ఏపీలో కొంత నయం. తెలంగాణాలో ఉన్నామంటే ఉన్నాం అన్న పరిస్థితి అని కూడా చెప్పేస్తారు. సొంత సామాజికవర్గం బలంగా ఉన్న ఏపీలో తెలుగుదేశం కోటలకు బీటలు వారాయి. ఇక తెలంగాణాలో ఆశ ఎక్కడ నుంచి వస్తుంది. నిజానికి తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడే కదా తెలంగాణా ఉద్యమం పుట్టింది. ఇవన్నీ ఆలోచన చేసుకున్నపుడు కానీ, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం దారుణంగా ఓటమి పాలు అయినపుడు చూసుకున్నా కూడా తెలంగాణాలో సైకిల్ కి పంక్చర్లు ఎపుడో పడ్డాయని అంతా చెబుతారు.

చీల్చే పార్టీగా….

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ గెలిచే పార్టీ స్థాయి నుంచి ఓట్లు చీల్చే పార్టీగా దిగజారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ చీల్చే ఓట్లు కూడా తమ సొంత సామాజిక వర్గం ఉన్న చోట కొంతైనా జరుగుతుందన్న ఆశ తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలకు ఉంది. అయితే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ చూసుకుంటే తెలుగుదేశం పార్టీని సొంత కులం వారే పక్కన పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. అయినా సరే మరో మారు లక్కుని పరీక్షించుకోవాలని తెలుగుదేశం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అక్కడ కమ్మ సామాజికవర్గం ఓట్లు ఇరవై వేల వరకూ ఉన్నాయట. పైగా నల్గొండ జిల్లా తెలంగాణా ఆంధ్ర సరిహద్దు కావడంతో టీడీపీ ప్రభావం ఉంటుందేమోనని ఆ పార్టీ అతిగా అంచనా వేసుకుంటోందని అంటున్నారు.

బాలయ్యే దిక్కా….?

తెలంగాణాలో తెలుగుదేశం పుట్టింది. తెలుగుదేశం జెండా ఇక్కడ కూడా ఎగురవేస్తాం, ఉమ్మడి ఏపీ సీఎం గా తాను హైదరాబాద్ కి చేసిన అభివృధ్ధి చరిత్రలో నిలిచి ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అక్కడ జరిగే ఉప‌ ఎన్నికల ప్రచారానికి తాను కాకుండా బావమరిది బాలయ్యని పంపడంతోనే సీన్ ఏంటో అర్ధమైపోయిందని అంటున్నారు. తెలంగాణాలో ఎటూ తెలుగుదేశం గెలవదు, డిపాజిట్లు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు. గట్టి పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే ఉంది. ఆటలో అరటి పండు పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి ఎవరూ లేనట్లుగా ఎన్టీయార్ కుమారుడు బాలయ్యని బరిలోకి దింపారని అంటున్నారు.

డ్యామేజీ చేయడానికేనా?

బాలయ్య స్టార్ హీరోగా, అన్న గారే చెప్పుకున్నట్లుగా ఆయనకు రాజకీయ వారసుడిగా ఉండాల్సిన వారు. కానీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కనీసం మంత్రిగా కూడా బాబు చేయలేదు. ఇక తెలంగాణా సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య చేత ప్రచారం చేయించి ఆయన ఇమేజ్ కి గబ్బు కొట్టించారని కూడా ఫ్యాన్స్ మండిపడతారు, ఇది చాలదన్నట్లుగా ఓడిపోయే హుజూర్ నగర్ సీట్లో ఆరు రోజుల పాటు ప్రచారానికి బాలయ్యని పంపడం ఏంటి అంటున్నారు. మొత్తానికి బాబు రాజకీయానికి బాలయ్య బలి అవుతున్నారని, ఏ దిక్కూ లేని తెలంగాణ తెలుగుదేశం పార్టీకికి బాలయ్యని దిక్కుగా చూపించి నందమూరి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News