ఈసారి ఇంతమంది అభ్యర్థులు కావాలా?…కష్టమే…?

ఏపీలో తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడంటే మూడు ఎంపీ సీట్లతో స‌రిపెట్టుకుంది. విజ‌యవాడ, గుంటూరు, శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీలు వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. [more]

Update: 2021-02-25 00:30 GMT

ఏపీలో తెలుగుదేశం గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడంటే మూడు ఎంపీ సీట్లతో స‌రిపెట్టుకుంది. విజ‌యవాడ, గుంటూరు, శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీలు వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. మిగిలిన 22 సీట్లలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక తెలుగుదేశంఎంపీ అభ్యర్థుల్లో నిర్వేదం, నిస్తేజం అలుముకోవ‌డంతో వారంతా చెల్లాచెదురు అయిపోయారు.. ఒక‌రిద్దరు చ‌నిపోతే.. మ‌రి కొంద‌రు పార్టీ మ‌రిపోయారు… ఓవ‌రాల్‌గా చూస్తే ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు దొర‌క‌డం త‌ల‌కు మించిన భార‌మే అవుతుంది.

పోటీ చేసిన వారిలో…

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం తరుపున పోటీ చేసిన వారిలో డీకే స‌త్యప్ర‌భ (రాజంపేట‌), శివ‌ప్రసాద్ ( చిత్తూరు) మృతిచెందారు. అనకాప‌ల్లిలో పోటీ చేసిన అడారి ఆనంద్‌కుమార్‌, నెల్లూరులో పోటీ చేసిన బీద మ‌స్తార్‌రావు, ఒంగోలులో పోటీ చేసిన మాజీ మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావు వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు. క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ రెడ్డి కాషాయం కండువా క‌ప్పుకున్నారు. న‌ర‌సారావుపేటలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, అర‌కులో వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్ రాజ‌కీయాల‌కు స్వస్తి చెప్పిన‌ట్టే.. వీరిద్దరు వ‌యోః భారంతోనే ఉన్నారు. రాజ‌మండ్రిలో పోటీ చేసిన మాగంటి రూపాదేవి ఇక రాజ‌కీయాల‌కు టాటా చెప్పేసిన‌ట్టే అని ఆమె మామ ముర‌ళీమోహ‌న్ స్వయంగా వెల్లడించారు.

అనేకమంది రాజకీయాలకు….

ఇక ఏలూరులో సీనియ‌ర్ నేత మాగంటి బాబు కూడా రాజ‌కీయాల నుంచి నిష్క్రమించిన‌ట్టే..! అమ‌లాపురంలో ఓడిన దివంగ‌త మాజీ స్పీక‌ర్ బాల‌యోగి వార‌సుడు హ‌రీష్ మాథూర్ పార్టీ ఆఫీస్‌లో బిజి బిజీ అయ్యారు. న‌ర‌సాపురంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ త‌న‌ను చంద్రబాబు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ పోటీ చేసి రాజ‌కీయ భ‌విష్యత్తు బ‌ద్నాం చేశార‌ని తెలుగుదేశం కార్య‌క‌లాపాలు వ‌దిలేశారు. మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ సైతం రాజ‌కీయాల నుంచి నిష్క్రమించి త‌న వార‌సుడిని రంగంలోకి దింపుతాన‌ని ఇప్పటికే బాబుకు చెప్పేశారు.

సమయంకోసం….

బాప‌ట్లలో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిన శ్రీరాం మాల్యాద్రి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అన్న ధోర‌ణితో ఉన్నా ఆయ‌న రాజ‌కీయ గురువు సుజ‌నా చౌద‌రి చెప్పిన‌ట్టే చేస్తార‌ని టాక్ ? తిరుప‌తిలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక లక్ష్మి మాత్రం మ‌ళ్లీ ఉప ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నారు. నంద్యాల‌లో ఓడిన మాండ్ర శివానంద‌రెడ్డి వైసీపీలోకి దూకాలా ? వ‌ద్దా ? అని అవ‌కాశం కోసం వెయిట్ చేస్తోన్న ప‌రిస్థితి. క‌ర్నూలులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్ర‌కాష్ రెడ్డి సైతం ఇప్పటి వ‌ర‌కు సైలెంట్ గా ఉన్నా లోక‌ల్ వార్‌లో స‌త్తా చాటి ప‌ట్టు నిలుపుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు.

వీరిద్దరే యాక్టివ్…..

ఇక అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఇద్దరు నేత‌లు మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. అనంత‌పురం పార్లమెంట‌రీ ఇన్‌చార్జ్ జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి, ఇటు హిందూపురంలో ఓడిన నిమ్మల కిష్ట‌ప్ప ఉన్నంత‌లో బెట‌ర్‌. వీరిలో ప‌వ‌న్ కుమార్ రెడ్డి దూకుడు రాజ‌కీయాల‌తో వార్తల్లో ఉంటున్నారు. ఈ పై లెక్కలు చూస్తే లోక్‌స‌భ అభ్యర్థుల్లో తెలుగుదేశంలో ఎంత మంది యాక్టివ్‌గా ఉన్నారో తెలుస్తోంది. బాబుకు ఈ సారి ఖ‌చ్చితంగా ఎంపీ క్యాండెట్లను సెట్ చేసే స‌రికి త‌ల ప్రాణం తోక‌మీద‌కు రావ‌డం ఖాయం.

Tags:    

Similar News