ఇక పవర్ కష్టమేనట…మూసేద్దామంటున్నారు

పదిహేడేళ్ల నుంచి ఇక్కడ టీడీపీ అధకారానికి దూరంగా ఉంది. చంద్రబాబు ఎంత దృష్టిపెట్టినా ఇక్కడ పార్టీ బలోపేతం అయ్యే ఛాన్స్ మాత్రం కన్పించడం లేదు. ఎన్టీఆర్ భవన్ [more]

Update: 2021-02-07 09:30 GMT

పదిహేడేళ్ల నుంచి ఇక్కడ టీడీపీ అధకారానికి దూరంగా ఉంది. చంద్రబాబు ఎంత దృష్టిపెట్టినా ఇక్కడ పార్టీ బలోపేతం అయ్యే ఛాన్స్ మాత్రం కన్పించడం లేదు. ఎన్టీఆర్ భవన్ ను చూస్తుంటేనే పార్టీ పరిస్థితి తెలుస్తోంది. ఒకప్పుడు నేతలు, కార్యకర్తలతో కళకళలాడిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేడు కళతప్పింది. ఎవరూ ఇటువైపు చూడటం లేదు. పార్టీకి కొత్త కార్యవర్గాన్ని, జిల్లా స్థాయిలో నేతలను బాధ్యులుగా నియమించినా ఏమాత్రం ఫలితం దక్కడం లేదు.

దుకాణం బంద్…..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక దుకాణం సర్దేసినట్లేనని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో పార్టీ అధికారానికి దూరమై పదిహేడేళ్లు కావస్తుంది. ఇంత సుదీర్ఘ కాలం అధికారంలో లేకపోవడంతో నేతలంతా పార్టీ నుంచి తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలను సాధించామని చెప్పుకోవడమే తప్ప వారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు చూడటం లేదు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు.

ఇక ఇక్కడ కష్టమని….

పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సయితం ఇక్కడ పార్టీ బలోపేతం కాలేదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు నామమాత్రంగా హాజరవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను చేసింది లేదు. వారు హాజరయింది లేదు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెబుతున్నారు. 2014 నుంచి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడ పార్టీకి ఆర్థికంగా చేయూత నిచ్చేవారు.

వారు కూడా పట్టించుకోకపోతుండటంతో….

కానీ ఇప్పుడు అక్కడ కూడా పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో చంద్రబాబు, లోకేష్ లు ఇక్కడ పార్టీని పట్టించుకోవడం లేదట. చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి పెట్టారు. హైదరాబాద్ లో ఉన్నా తెలంగాణ టీడీపీ నేతలను కలిసేందుకు చంద్రబాబు పెద్దగా ఇష్టపడటం లేదట. ఇక్కడ మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పోటీ చేసి దారుణ ఓటమిని చవి చూసింది. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో టీడీపీ దుకాణాన్ని మూసివేసినట్లేనన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News