Tdp : ఇక్క అక్కడికే పరిమితమా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అష్టకష్టాలు పడుతుంది. ఇక్కడ నేతలు లేరు. క్యాడర్ చెల్లాచెదురయింది. అయినా జాతీయ పార్టీ అని చెప్పుకోవడం కోసమే ఇక్కడ చంద్రబాబు పార్టీని నడుపుతున్నారు. [more]

Update: 2021-10-09 14:30 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అష్టకష్టాలు పడుతుంది. ఇక్కడ నేతలు లేరు. క్యాడర్ చెల్లాచెదురయింది. అయినా జాతీయ పార్టీ అని చెప్పుకోవడం కోసమే ఇక్కడ చంద్రబాబు పార్టీని నడుపుతున్నారు. కొత్తగా అధ్యక్షుడిని నియమించినా ఫలితం లేదు. పెద్దగా ప్రయోజనం లేదన్న పెదవి విరుపులు వినపడుతున్నాయి. గతంలో పట్టున్న ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇప్పడు బలహీనంగా కనపడుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుతోనే వెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

విభజన తర్వాత కూడా…

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ వంటి ప్రాంతాల్లో బలంగా ఉంది. ఇక్కడ నేతలతో పాటు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. రాను రాను నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి నుంచి ముఖ్యమైన నేతలందరూ పార్టీని వీడటంతో క్యాడర్ కూడా వారితోనే తరలి వెళ్లిపోయింది.

మరింత దిగజారి…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల తర్వాత నుంచి మరింత దిగజారిపోయింది. అసలు పార్టీ కార్యాలయానికి వచ్చే వాళ్లే కరువయ్యారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతలను పక్కన పెడితే జిల్లా స్థాయి నేతలు అని చెప్పుకునే వారు ఎవరూ లేరు. 2014, 2018 ఎన్నికల్లో తెలుగుదేశం కనీసం స్థానాలను సాధించింది. 2018 లో మాత్రం కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితమయింది. అక్కడ రెండు స్థానాలను దక్కించుకుని ఊపిరి పీల్చుకుంది.

ఉన్న ఒక్క ఖమ్మంలోనూ….

ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ పరిస్థితులు మారాయి. ఇటీవల అమరావతిలో ఖమ్మం జిల్లా నేతలు చంద్రబాబును కలిశారు. పార్టీ పరిస్థితిని వివరించారు. టీడీపీ తరుపున గెలిపించుకున్నా పార్టీని వీడిపోతుండటం పట్ల చంద్రబాబు ఆవేదన చెందినట్లు తెలిసింది. త్వరలో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని వారికి చెప్పినట్లు సమాచారం. అయితే ఖమ్మం జిల్లాలో కూడా క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు కూడా టీడీపీ కోల్పోయిందంటున్నారు. ఇక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళితే ఒకటో, రెండో స్థానాలు దక్కించుకోవచ్చన్నది పార్టీ నాయకత్వం ఆలోచన.

Tags:    

Similar News