పాచిక పారిందా…?

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి రాష్ట్రంలో అధికార‌మార్పిడి జ‌రిగితే.. అమ‌రావ‌తి అంశం ఖ‌చ్చితంగా చ‌ర్చకు వ‌స్తుంద‌ని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఏక‌ప‌క్షంగా [more]

Update: 2019-08-27 02:00 GMT

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి రాష్ట్రంలో అధికార‌మార్పిడి జ‌రిగితే.. అమ‌రావ‌తి అంశం ఖ‌చ్చితంగా చ‌ర్చకు వ‌స్తుంద‌ని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఏక‌ప‌క్షంగా చంద్రబాబు ఇక్కడ రాజ‌ధాని ఏర్పాటు చేశార‌ని, ఐదేళ్ల కాలంలో ఆయ‌న ఇక్కడ చేసింది త‌క్కువ‌.. చూపించింది ఎక్కు వ అనే విమ‌ర్శలు వైసీపీ నుంచి వినిపించిన నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. ఈ విష‌యం క‌దులుతుంద‌ని అంద‌రూ అనుకున్నదే! అయితే, ఈ విష‌యాన్ని క‌దిపిన తీరులోనే ప్రత్యేకత క‌నిపిస్తోంది. అమ‌రావ‌తిలో ముంపు ప్రాంతం ఎక్కువ‌గా ఉంద‌ని, 8 ల‌క్షల క్యూసెక్కుల వ‌ర‌ద నీటికే ఇది మునిగిపోయింద‌ని బొత్స స‌త్యనారాయ‌ణ సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు.

అమరావతి అడ్డాగా…..

అదే స‌మ‌యంలో ఆయ‌న శివ‌రామ కృష్ణ క‌మిటీ నివేదిక‌ను కూడా ప్రస్తావిస్తూ.. ఈ నివేదిక‌ను చంద్రబాబు ప్రభుత్వం ప‌ట్టించుకోలేదని ఆయ‌న చెప్పారు. దీంతో బొత్స వ్యాఖ్యలు రాజకీయంగా క‌ల‌క‌లం సృష్టించాయి. అయితే, ఇది పైకి క‌నిపిస్తున్నా.. కొంద‌రు మేధావులు చెబుతున్న విష‌యం మేర‌కు జ‌గ‌న్ టార్గెట్ అంతా కూడా రాజధాని అమరావతిలోని క‌మ్మ సామాజిక వ‌ర్గంపైనే ఉంది. చంద్రబాబు ఐదేళ్ల త‌న పాల‌న‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఇక్కడ ల‌బ్ధి చేకూర్చి పెట్టార‌ని, వారే ఇక్కడ అమ‌రావ‌తిని అడ్డా చేసుకుని ల‌బ్ధి పొందార‌నే వాద‌న తెరచాటున చాలానే ఉంది. నిజానికి చంద్రబాబు కూడా త‌న సామాజిక వ‌ర్గానికే పెద్ద పీట వేశారు.

శాశ్వతంగా కొందరి చేతుల్లోనే….

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు రాజ‌ధాని అమరావతి ఏర్పాటు అంతా కేవ‌లం సామాజిక‌వ‌ర్గ కోణంలోనే జ‌రిగింద‌న్న చ‌ర్చల్లో చాలా నిజాలు ఉన్నాయి. రాజ‌ధాని శాశ్వతంగా కొన్ని కులాల కంట్రోల్లోనే ఉండేలా ప్లాన్ జ‌రిగింది. ఇదే ఇప్పుడు వైసీపీ ల‌క్ష్యంగా మారింది. అంటే.. చంద్రబాబు పాల‌న‌లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌నే విష‌యాన్ని టీడీపీలోని రెడ్డి వ‌ర్గం బాహాటంగానే అంగీక‌రించే ప‌రిస్థితి ఇప్పుడు వ‌చ్చింది. రాజ‌ధానిలో కానీ, కాంట్రాక్టుల్లో కానీ త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని రెడ్డి వ‌ర్గం భావిస్తోంది.

ఆయన ఒక్కరు తప్ప……

ఈ నేప‌థ్యంలో బొత్స కామెంట్లపైనా.. రాజ‌ధాని త‌ర‌లింపు అంశంపైనా టీడీపీ నుంచి విమ‌ర్శలు వ‌స్తున్నా.. కేవ‌లం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన దేవినేని ఉమానో లేదా మ‌రో నేతో మాత్రమే స్పందించారు త‌ప్పితే.. రెడ్డి వ‌ర్గానికి చెందిన ఏ ఒక్క తెలుగు దేశం నాయ‌కుడు కూడా స్పందించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్రమోహన్ రెడ్డి ఒక్కరు తప్ప అమరావతిపై మరే రెడ్డి సామాజికవర్గం నేతా స్పందించలేదు. ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఏకంగా 50 మందికి పైగా రెడ్డి ఎమ్మెల్యేలు గెలిస్తే టీడీపీ నుంచి ఒక్కరు కూడా గెల‌వ‌లేదు. ఇక టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది క‌మ్మ వ‌ర్గం వాళ్లే ఉన్నారు. మొత్తానికి ఈ విష‌యంలో జ‌గ‌న్ వేచిన పాచిక బాగానే పారింద‌ని అంటున్నారు.

Tags:    

Similar News