సుజనా సిగ్నల్స్ ఇచ్చారుగా

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఎవరు ఎప్పటికి ఎలా అవసరమైతే.. అప్పటికి వాడుకోవడమే రాజకీయం. అందుకే రాజకీయాల్లో శత్రువులు అనేవారు ఎవరూ ఉండరు. [more]

Update: 2019-08-05 11:00 GMT

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఎవరు ఎప్పటికి ఎలా అవసరమైతే.. అప్పటికి వాడుకోవడమే రాజకీయం. అందుకే రాజకీయాల్లో శత్రువులు అనేవారు ఎవరూ ఉండరు. ఎవరెవరు ఏయే పార్టీల్లో ఉన్నప్పటికీ.. వారంతా కూడా ప్రత్యర్థులే తప్ప ఎన్నటికీ శత్రువులు కారు! ఇప్పుడు ఖచ్చితంగా ఇదే ఫార్ములాను పూర్తిగా అమలు చేస్తున్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. తన పాత మిత్రుడు బీజేపీకి ఆయన చేరువ అవుతున్న పరిణామంలో భాగంగా తాజాగా ఒక తొలి అడుగు పడిందని అంటున్నారు విశ్లేషకులు. 2014లో బీజేపీ-టీడీపీ సంయుక్తంగా ఎన్నికలు వెళ్లి.. ఏపీలో అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. కేబినెట్లలో మంత్రి పదవులను కూడా పంచుకున్నారు.

ప్రత్యేక హోదాతో….

దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సాగిన వీరి కాపురంలో ప్రత్యేక హోదా విషయం చిచ్చుపెట్టింది. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలను మచ్చిక చేసుకోవాలంటే.. అధికారంలో ఉన్న చంద్రబాబు హోదాను సాధించి తీరడమే తనముందున్న కర్తవ్యంగా భావించారు. అయితే, హోదా విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తామువెనక్కి బోమని ఆనాడే.. చంద్రబాబు ప్రకటించారు. తొలుత ప్యాకేజీకి అంగీకరించినా.. ఏడాది తర్వాత మాట మార్చుకుని హోదా కోసం పట్టుబట్టారు. దీంతో బీజేపీ-టీడీపీ పరిస్థితి ఏపీలో దారుణంగా తయారైంది. దేశంలో అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ బీజేపీ ఏపీలో బోణీ కొట్టలేక పోయింది.

తప్పు చేశామని….

మరోపక్క, టీడీపీ కూడా కేవలం 23 స్థానాలకే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి బయటకు వచ్చి తప్పు చేశామా ? అనే భావన తెలుగు తమ్ముళ్లలో జోరుగా వినిపించింది. ఇక, ఎట్టిపరిస్థితి లోనూ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే తమ పాతమిత్రుడు బీజేపీతో మరోసారి చేతులు కలిపితే మంచిదని టీడీపీ భావిస్తోందని పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులు జంప్‌ చేసినా.. పార్టీ అధినేత చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. దీని వెనుక ఏదో వ్యూహం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

సుజనా మాటలతో….

అయితే, ఇంతలోనే తాజాగా టీడీపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు కలిసి ఉంటేనే కలదు సుఖం అంటూ.. కొత్త పల్లవిని తెరమీదికి తెచ్చారు. బీజేపీతో కలిసి ఉంటేనే ఏపీ అభివృద్ధి చెందుతుందంటూ.. నాయకులు పేర్కొంటున్నారు. తాజాగా దీనినే ప్రస్తావించిన సుజనా.. బీజేపీ నుంచి బయటకు రావడం టీడీపీ చేసిన పెద్ద తప్పుగా భావించారు. అదే సమయంలో చందబ్రాబుకు తాను ఇదే విషయాన్ని చెప్పానని, అయితే, తన మాటను వినలేదని అన్నారు. అంటే.. ఇప్పటికైనా బీజేపీతో టీడీపీ కలిసిపోవడమే మంచిదనే సిగ్నళ్లను సుజనా ఇస్తున్నారు. అయితే, ఇదంతా కూడా బాబు కనుసన్నల్లోనే జరుగుతోందని ప్రచారం. చంద్ర‌బాబు ఇప్ప‌టికే రెండుసార్లు బీజేపీతో క‌లిసి రెండు సార్లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. మ‌ళ్లీ ఆయ‌న అవ‌స‌రం కోసం క‌ల‌వ‌ర‌న్న గ్యారెంటీ కూడా లేదు.

Tags:    

Similar News