మోడీ టార్గెట్‌గా టీడీపీ రాజకీయం.. నిజమెంత ?
తిరుపతి ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశగా అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే సెంటిమెంటును రెచ్చగొట్టే కార్యక్రమానికి టీడీపీ నాయకులు తెరదీసినట్టు [more]
తిరుపతి ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశగా అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే సెంటిమెంటును రెచ్చగొట్టే కార్యక్రమానికి టీడీపీ నాయకులు తెరదీసినట్టు [more]
తిరుపతి ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశగా అనేక వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే సెంటిమెంటును రెచ్చగొట్టే కార్యక్రమానికి టీడీపీ నాయకులు తెరదీసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని టార్గెట్ చేసుకుని.. ఓట్లు చీలిపోయి.. బీజేపీ బలపడకుండా చూస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ క్రమంలో టీడీపీ చేస్తున్న విమర్శల్లో 'పస' ఎంత? అనేది చర్చనీయాంశంగా మారింది. గత 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలానే మోడీపై విమర్శలు సంధించారు.. టీడీపీ సీనియర్లు. అప్పటి ప్రభుత్వ సలహాదారు.. కుటుంబ రావు ఎన్నికలకు ముందు మీడియా సమావేశం పెట్టి మరీ ఓ బాంబు పేల్చారు.
నాడు కూడా మోడీపై….
కేంద్రంలోని నరేంద్ర మోడీ పెద్ద కుంభకోణం చేశారని ఆరోపించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పత్రికల్లో ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే.. ఇంతా చేస్తే.. అది రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణానికి సంబంధించిన అంశం. దీనిపై అప్పట్లోనే సుప్రీం కోర్టులో పిటిషన్లు పడ్డాయి. అనిల్ అంబానీ సంస్థకు మేలు చేసేలా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఈ యుద్ధ విమానాల కాంట్రాక్టును అప్పగించారని తెలిపారు. అయితే.. సుప్రీం కోర్టు వీటిని గుండుగుత్తగా కొట్టేయడం.. మోడీ పాత్ర లేదని పేర్కొనడం కొసమెరుపు. అంటే.. అప్పట్లో మోడీపై చేసిన దాడిని రాజకీయ కోణంలోనే చూడాల్సి వచ్చింది. మోడీని బద్నాం చేయడం ద్వారా.. ఒక్కసారిగా ఎన్నికల వేళ ఒక హైప్ సృష్టించాలని టీడీపీ ప్రయత్నించింది.
సీబీఐ విచారణ జరపాలని…
ఇక, ఇప్పుడు కూడా ఇదే తరహాలో టీడీపీ నాయకులు మోడీని టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఎంచుకున్న సబ్జెక్టు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం. ఈ పథకం కింద పేదలకు రూ.2.6 లక్షల రూపాయలతో దీనిలో (రాష్ట్ర సర్కారు వాటా కూడా ఉంటుంది) భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అంటే.. గృహ నిర్మాణం కింద పేదలకు ఇస్తున్న రెండున్నర లక్షల రూపాయల్లో కుంభకోణం పేరుతో మోడీ ప్రజాధనాన్ని దోచేశారన్నది టీడీపీ విమర్శ. అయితే.. ఇక్కడ చిత్రంగా అదే ప్రధాని చేతుల్లో ఉండే సీబీఐతో విచారణ కోరుకోవడం గమనార్హం. సీబీఐ అంటేనే ప్రధాని చెప్పినట్టునడుస్తుందనే వ్యాఖ్య ఉంది.
తిరుపతి ఎన్నికలకు ముందు….
మరి ఇప్పుడు ప్రధాని కుంభకోణం చేశారని ఆరోపిస్తున్న టీడీపీ సీబీఐ విచారణకు కోరుకోవడం విచిత్రంగా ఉంది. పైగా ఈ విషయాన్ని తాము తవ్వి తీశామని.. దీనిని మీడియా హైలెట్ చేయడంలో విఫలమైందని.. మీడియా కూడా మోడీకి అమ్ముడు పోయిందని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మొత్తం అంశాలను గమనిస్తే.. ఇది కేవలం ఎన్నికలకు ముందు టీడీపీ చేస్తున్న వ్యూహం తప్ప మరొకటి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి వ్యూహాలు ఏమేరకు ఎన్నికల్లో ఫలితాన్ని ఇస్తాయనేది ప్రశ్నార్థకం. ఏదైనా ఉంటే.. విధాన పరంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం తప్పుకాదు కానీ.. ఇలా ఏమీలేని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి విమర్శలు గుప్పించడం ఎందుకు ? అనేది అంతుచిక్కని ప్రశ్న.