అక్కడ ఎన్నిక జరిగితే బాబు స్ట్రాటజీ ఏంటో?

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగా లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరున్న నేతలే చేతులెత్తేశారు. [more]

Update: 2020-07-08 12:30 GMT

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగా లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరున్న నేతలే చేతులెత్తేశారు. అధికార పార్టీకి భయపడి కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయారు. అయితే టీడీపీకి మరో ప్రమాదం పొంచి ఉంది. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ ఎంపీలు అనర్హత పిటీషన్ స్పీకర్ కు ఇచ్చారు. స్పీకర్ అనర్హత వేటు వేస్తే నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికల తప్పదు.

సిద్ధంగా ఉందా?

ఉప ఎన్నిక జరిగితే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ, జనసేన బలంగా ఉంది. రఘురామ కృష‌్ణంరాజు పై అనర్హత వేటు ఉప ఎన్నికలు జరిగితే ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతారు. ఇక్కడ బీజేపీ, జనసేన కలిస్తే బలమైన పక్షంగా ఉంటుంది.

వైసీపీ అన్నీ ఆలోచించుకునే….

అధికార వైసీపీ ఎటూ బలంగానే ఉంది. ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే కావడంతో ఉప ఎన్నికను ధైర్యంగా ఎదుర్కొంటామని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకోసమే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయకుండా అనర్హత వేటు వైపే మొగ్గు చూపింది. అంటే వైసీపీ ఎన్నికలకు సిద్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, జనసేనలకు పోయేదేమీ లేదు. ఉప ఎన్నికల్లో కలసి వచ్చి విజయం సాధిస్తే పార్టీకి ఏపీలో మరింత ఊపు వస్తుంది.

ఇక్కడ వ్యూహం ఏంటో?

ఇక అటూ ఇటూ కాకుండా పోయేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం రెడీగా ఉన్నా పోటీ చేసేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయరు. బలంగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కొనే సాహసం ఎవరూ చేయరు. ఓడిపోతామని తెలిసి రాజ్యసభ ఎన్నికలలో వర్లరామయ్యను చంద్రబాబు బరిలోకి దింపారు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థి ఉంటారన్నది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్యనే వార్ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. నర్సాపురం ఉప ఎన్నిక అంటూ వస్తే తెలుగుదేశం పార్టీకి కొంత ఇరకాటంలో పడినట్లేనని చెప్పక తప్పదు. మరి చంద్రబాబు స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News