టీజీ జోస్యం నిజమేనంటారా?

ఆంధ్రప్రదేశ్ కి ఇకపై నాలుగు రాజధానులు ఉండేలా వైసిపి సర్కార్ ప్లాన్ చేస్తుందట. అమరావతిని పక్కన పెట్టి ఉత్తరాంధ్రకు విజయనగరం, గోదావరి జిల్లాలకు కాకినాడ, కృష్ణా గుంటూరు, [more]

Update: 2019-08-26 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ కి ఇకపై నాలుగు రాజధానులు ఉండేలా వైసిపి సర్కార్ ప్లాన్ చేస్తుందట. అమరావతిని పక్కన పెట్టి ఉత్తరాంధ్రకు విజయనగరం, గోదావరి జిల్లాలకు కాకినాడ, కృష్ణా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు కి గుంటూరు, రాయలసీమ కు కడప రాజధానులు చేస్తారని బాంబు పేల్చారు సంచలన వ్యాఖ్యలు చేసే రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్. అది కూడా ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం నుంచి తనకు పూర్తి సమాచారం ఉందని చెప్పారు. జగన్ ఇప్పటికే ఈ విషయం కేంద్రం ముందు ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్.

టీజీ మొదటి నుంచి అంతేగా …

గతంలో ఏపీ విడిపోయేది లేదంటూ సినిమా టిక్ గా కుండ తెచ్చుకుని బద్దలు కొట్టారు టిజీ వెంకటేష్. ఆ తరువాత టిడిపి లో వున్నప్పుడు కర్నూలు సీటు వివాదంలో యువనేత నారాలోకేష్ పైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు ముగిసి వైసిపి అధికారంలోకి వచ్చాకా టిడిపి నుంచి రాజ్యసభకు ఎంపిక అయినా బిజెపి లోకి దూకేసి పార్టీ ఫిరాయింపు ను సైతం తనదైన శైలిలో భాష్యం చెప్పారు టిజీ వెంకటేష్. టిడిపి పార్లమెంటరీ పార్టీని విలీనం చేయాలంటే సంఖ్యా బలం కోసం సుజనా బ్యాచ్ తో చేతులు కలిపానని వ్యాఖ్యానించి ఆ పార్టీలోకి బలవంతంగా వెళ్ళలిసిన పరిస్థితి వచ్చిందనే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

నూటికి నూరు శాతం అంటున్నా …

ఏపీలో అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి జరగాలన్న లక్ష్యం తో వైఎస్ జగన్ దృష్టి పెట్టరంటున్నారు టిజీ వెంకటేష్. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సూపర్ క్యాపిటల్ అవుతుందని అందుకే నాలుగు మండళ్ళను ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎపి విభజన మరోసారి జరిగే ఛాన్స్ లేకుండా వ్యవహరిస్తారన్నది టిజీ వెంకటేష్ అభిప్రాయం. తద్వారా చంద్రబాబు ఊహాచిత్రాన్ని సమూలంగా మార్చడంతో బాటు నాలుగు ప్రాంతాల మనసు దోచుకోవాలన్న ఎత్తుగడ వైసిపి ప్రభుత్వం చేపట్టిందంటున్నారు. తాను చెప్పేది నూటికి నూరు శాతం అమలు చేయడం ఖాయమంటున్నారు టిజీ వెంకటేష్.

అదే నిజమైతే …

టిజీ వెంకటేష్ చెప్పేది నిజమైతే ఇప్పుడు రాజధాని కోసం ఉద్యమిస్తామని చెబుతున్న టిడిపి, బిజెపి, జనసేన లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ప్రాంతాల వారీగా రాజధానులు ఏర్పాటు చేస్తామంటే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు విపక్షాల ఉద్యమానికి సుతరాము సహకరించారు. ఐదుగురికి డిప్యూటీ సిఎం పదవులను ఇచ్చి కులాల వారీగా ఇప్పటికే వైఎస్ జగన్ అందరిని సంతృప్తి పరిచారు. అదే రీతిలో ప్రాంతాల వారి రాజధానులను ప్రజలు స్వాగతించే అవకాశాలు మెండుగా వున్నాయి. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్లే ఎపి విభజన జరిగిందన్నది మెజారిటీ వాదన. తిరిగి అదే ఫార్ములాను చంద్రబాబు తమ సామాజిక వర్గం అభివృద్ధికే చేపట్టారన్న అధికారపక్షం ప్రచారం ఇప్పటికే జనంలోకి చొచ్చుకు పోయింది. దాంతో వైసిపి తన మార్క్ పాలిటిక్స్ ను కృష్ణా వరదల నేపథ్యంలో మరింతగా ముందుకు తీసుకువెళ్లనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News