బ్రహ్మం.. నోస్ట్రడామస్.. చెప్పేశారుగా…?

ముందుగానే చెప్పేశాం.. ఇప్పుడు ఇదో పెద్ద ఊత పదం. కరోనా సెకండ్ వేవ్ గురించి కేంద్రం రాష్ట్రాలకు ముందుగానే చెప్పేసింది. రాష్ట్రాలు ప్రజలనూ అప్రమత్తంగా ఉండమని చెప్పేశాయి. [more]

Update: 2021-05-09 16:30 GMT

ముందుగానే చెప్పేశాం.. ఇప్పుడు ఇదో పెద్ద ఊత పదం. కరోనా సెకండ్ వేవ్ గురించి కేంద్రం రాష్ట్రాలకు ముందుగానే చెప్పేసింది. రాష్ట్రాలు ప్రజలనూ అప్రమత్తంగా ఉండమని చెప్పేశాయి. అసలు అంతర్జాతీయ పత్రికలు భారత్ నూ ఎప్పుడో హెచ్చరించేశాయి. అయినా కరోనా వచ్చి పడిపోయింది. ఎవరిది తప్పు. మీ ఖర్మకు మీరే బాధ్యులన్నట్లుగా తప్పించుకుంటున్నాయి సర్కారులు. కట్టడి చేయాల్సిన యంత్రాంగాలు, అప్రమత్తం చేయాల్సిన అంతర్జాతీయ సమాజం అంతా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లు చెప్పుకుంటున్నాయి. పెద్దవాళ్లు చిన్నవాళ్లను, వారు మరింత చిన్నవాళ్లను మందలించి తమ పెద్దరికం నిలబెట్టుకుంటున్నట్టుంది. అంతర్జాతీయ సమాజం భారత్ ను దోషిగా చూపిస్తోంది. కేంద్రం రాష్ట్రాలను దోషులుగా నిలబెదుతోంది. రాష్ట్రాలు ప్రజలపైనే తోసేస్తున్నాయి. వీలయితే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నచోట్ల కేంద్రంతో దెబ్బలాటకు దిగుతున్నాయి. అసలు వాస్తవమేమిటన్నది అంతుచిక్కకుండా ప్రభుత్వాలు రాజకీయ క్రీడ రసవత్తరంగా సాగిస్తున్నాయి.

ముందుగానే..

ప్రపంచంలో ఏ వింత చోటు చేసుకున్నా నోస్ట్రాడామస్ ఎప్పుడో చెప్పేశారంటూ గొప్పగా చెప్పడం అంతర్జాతీయ సమాజానికి అలవాటు. అలాగే ఎపుడో చెప్పెను బ్రహ్మంగారు అంటూ మనమూ సాగదీస్తుంటాం. కొంచెం సంప్రదాయవాదులైతే ఇవన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష అంటూ గట్టిగా నొక్కి చెప్పేస్తుంటారు. నిజానికి కాలజ్ణానులు అంటూ ఎవరూ ఉండరు. అప్పుడు సాగుతున్న పరిణామ క్రమం, గతం నుంచి అప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను బేరీజు వేస్తూ భవిష్యత్తును ఊహిస్తుంటారు కొందరు. అప్పటి కాలానికి అది వింతగా ఉంటుంది. తర్వాత వారు ఊహించిన సంఘటనల తాలూకు చాయలు కనిపిస్తే, రకరకాల నిర్వచనాలతో ఆ మాటలకు సాధికారత కల్పిస్టుంటుంది సమాజం. అదే కాలజ్ణానం. ఈ నిర్వచన కారుల సిద్దాంతాల ఆధారంగానే నోస్ట్రడామస్ అయినా బ్రహ్మం గారు అయినా పాపులర్; ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కరోనాను అదే కోవలో పెట్టుకోవాల్సి వస్తోంది.

కేంద్రం గడుసు తనం..

సాధారణంగా రిపబ్లిక్ డే, ఆగస్టు పదిహేను వస్తున్నపుడు ఏదో జరగబోతోందంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఇంటిలిజెన్సు్ రొటీన్ గా హెచ్చరికలు పంపేస్తూ ఉంటుంది. అందులో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. ఎక్కడ, ఏం జరగనుందో , ఎవరు అందుకు తలపెడుతున్నారో కూడా వివరాలుండవు. ఒకవేళ ఏదైనా జరిగితే మేం ముందుగానే చెప్పేశాం. అయినా అప్రమత్తం కాలేదంటారు. ఏమీ జరగకపోతే అసలు ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు కేంద్రం వైఖరి కూడా అదే. ఫిబ్రవరిలోనే కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేశామని కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కేంద్రం ఈ తీవ్రతను ముందుగానే గుర్తిస్తే అయిదు రాష్ట్రాల ఎన్నికలు వద్దని ఎన్నికల సంఘానికి ఎందుకు చెప్పలేదు. కుంభమేళాకు అనుమతులు ఎందుకు ఇచ్చినట్లు? అది గాలివాటం సమాచారం. ఉత్తుత్తి హెచ్చరికే. సీరియస్ గా పరిస్థితి ఇలా ఉండబోతోందని అప్రమత్తం చేయలేదు. అలాగే ఇప్పుడు బారత్ ను తప్పుపడుతున్న అంతర్జాతీయ సమాజమూ దొంగాటే ఆడుతోంది. గడచిన అక్టోబర్, నవంబర్ నెలల నాటికి బారత్ అల్లకల్లోలం అయిపోతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. అప్పటికి అసలు కేసులు పెద్దగా రావడం మానేశాయి. ఇప్పుడు కేసులు పెరిగాయి కాబట్టి వేలెత్తి చూపే అవకాశం దొరికింది. అంతర్జాతీయ పత్రికలు, నిపుణులు దొరికింది చాన్సంటూ విరుచుకుపడుతున్నారు. రాజకీయ విమర్శలు చేస్తూ భారత్ ను నిందిస్తున్నారు. అంతే తప్ప గతంలో వారిచ్చిన సమాచారానికి సాధికారత ఉండి కాదు.

18 ఏళ్లవారిపై ప్రమాదం..

నిపుణుల ముసుగులో పాపులారిటీ కి పాకులాడే మేధావులు తయారయ్యారు. వచ్చే అక్టోబర్ లో కరోనా మూడో వేవ్ వస్తుంది. అది 18 సంవత్సరాల లోపు వారిపై విరుచుకుపడుతుందంటూ ప్రచారం మొదలు పెట్టారు. తాము పరిశోధన చేసి కొత్త విషయాన్ని కనిపెట్టినట్లు చెబుతున్నారు. నిజంగానే కరోనా మరోసారి విజృంభిస్తే అప్పటికి ఇంకా టీకాల పరిధిలోకి రాని 18 సంవత్సరాల లోపు వారు ప్రమాదం ముంగిట్లో ఉంటారు. అది సాధారణ విషయం. దానికి పెద్ద పరిశోధన చేసి కనిపెట్టాల్సింది ఏమీ లేదు. నిపుణులే చెప్పాల్సిన అవసరమూ లేదు. కామన్ మేన్ ను అడిగినా చెబుతారు. రక్షణ టీకా వేసుకోలేదు కాబట్టి సహజంగానే కరోనాకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రొటీన్ విషయాలనే నిపుణుల పేరిట ప్రచారంలోకి తెస్తూ భయాందోళనలు రేకెత్తి స్తున్నారు.

కన్ఫ్యూజన్…గందరగోళం..

ట్రీట్ మెంట్ ప్రొటోకాల్ దేశంలో ఇంకా గందరగోళంగానే ఉంది. డాక్టర్ల పేరుతో ఎవరికి తోచింది వారు చెప్పేస్తున్నారు. నిన్నామొన్నటివరకూ ఆవిరి పట్టండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాజాగా ఆవిరిపడితే ప్రమాదమని ఒకవర్గం డాక్టర్లు ప్రజలను భయపెడుతున్నారు. మన వంటింటి దినుసులే రక్షణ. వాటిని విస్తృతంగా వినియోగించండి అంటూ చాలా మంది పేరు గొప్ప డాక్టర్లు ఇంతవరకూ చెబుతూ వచ్చారు. ఇప్పుడేమో అతిగా వాడితే కడుపుకు సంబంధించి కాన్సర్లు వంటివి వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. సీటీ స్కాన్ తీసుకుంటే రోగం బయటపడిపోతుందని ఒక విశ్వాసం కలిగించారు. ఇప్పుడు దాని జోలికివెళ్లవద్దంటున్నారు. రెమ్ డెసివర్ వినియోగం మొదలు అసలు ప్రజలేం చేయాలనేదానిపై ఒక స్పష్టత లేదు. ముందుగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్సష్టమైన ప్రొటోకాల్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. లేకపోతే చెట్టుకింది డాక్టర్లు చెప్పిందల్లా ప్రజలు చేసుకుంటూ పోతున్నారు. ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో అత్యధిక ప్రాణ నష్టానికి కారణం కరోనా కాదు, ట్రీట్ మెంట్ విధానాలలో లోపాలే అనే వాదన సైతం వినవస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News