ఒకే దెబ్బకు రెండు పిట్టలు అదేనా వారి వ్యూహం …?

ప్రాంతీయ వాదం, కులం, మతం అనేవి రాజకీయ పార్టీలకు పెట్టని పెట్టుబడులు లాంటివి. వీటి ఆధారంగా ప్రజల్లోకి దూసుకెళ్లడం అన్ని ప్రధాన అంశాలను అభివృద్ధి డిమాండ్లు, సమస్యలను [more]

Update: 2021-07-03 11:00 GMT

ప్రాంతీయ వాదం, కులం, మతం అనేవి రాజకీయ పార్టీలకు పెట్టని పెట్టుబడులు లాంటివి. వీటి ఆధారంగా ప్రజల్లోకి దూసుకెళ్లడం అన్ని ప్రధాన అంశాలను అభివృద్ధి డిమాండ్లు, సమస్యలను సైతం డైవర్ట్ చేయగలగడం అనాదిగా పాలిటిక్స్ లో కనిపించే ట్రెండ్. దీనికి పెద్ద ఉదాహరణ ప్రత్యేక తెలంగాణ వాదంతో ఉద్యమాన్ని నడిపి క్లిక్ అయిన గులాబీ పార్టీ టీఆర్ఎస్ నే అని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జలవివాదం ప్రధాన హాట్ టాపిక్ గా మారింది. దీనికి రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారు ఆజ్యం పోస్తూ వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. ఈ అంశమే పతాక స్థాయిలో మీడియా లో దూసుకుపోతుంది.

బిజెపి – కాంగ్రెస్ లకు చెక్ పెట్టేందుకేనా …?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నడుమ జల జగడాలు ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి , కాంగ్రెస్ లే అధికంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుందన్నది పలువురి భావం. ప్రాంతీయ పార్టీలే తమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించేవిగా పోరాడేవి గా ఉన్నాయని ప్రజలు గ్రహించేందుకు అవసరమైనప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టే అంశాలను ప్రాంతీయ పార్టీలు ఆయుధాలుగా మలుచుకోవడం దేశంలో అనేక రాష్ట్రాల్లో కనిపిస్తూనే ఉంటుంది. కర్ణాటక – తమిళనాడు ల నడుమ కావేరి జల వివాదాలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బిజెపి అధికారంలో ఉన్నా తలనొప్పి వ్యవహారాలుగా సాగేవి. జల వివాదాలు దేశాల నడుమే తీవ్ర స్థాయిలో నడుస్తుంటాయి. ఇక రాష్ట్రాల్లో మరింత గా ఈ అంశం పనిచేస్తుంది. ఇందులో ఏ రాష్ట్రం వైపు ఒగ్గినా పక్క రాష్ట్రం లో ఓటు బ్యాంక్ గల్లంతు అవుతుందనే భయంతో తప్పు ఎవరిదైనా విషయం చల్లారే వరకు గమ్మున ఉండే వ్యూహాలే అనుసరిస్తాయి. చివరికి ఏ సుప్రీం కోర్ట్ మెట్లు ఎక్కితేనే కానీ సమస్య పరిష్కారం కానీ పరిస్థితి అనాదిగా వస్తున్నదే.

బిజెపి గ్రహించింది … కాంగ్రెస్ అలెర్ట్ …

ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర జలవివాదం పై బిజెపి, కాంగ్రెస్ లు అలెర్ట్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధ్యక్షులు తమ ప్రాంత ప్రజల వాణిని వినిపించేందుకు సిద్ధం కావడం బిజెపి ప్రస్తుతానికి అనుసరించబోయే వ్యూహం. మరోపక్క కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు కావాలని నాటకం ఆడుతున్నారంటూ ఎదురుదాడి చేస్తూనే తెలంగాణ కు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ యుద్ధం మొదలు పెట్టింది. అయితే ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పిసిసి స్పందించకపోవడం గమనిస్తే తెలంగాణ లో పార్టీకి ఉన్న అవకాశాలు ఆంధ్రాలో కనుచూపు మేరలో కూడా లేకపోవడమే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఎటునుంచి చూసినా ఈ అంశంపై ప్రధాన టార్గెట్ బిజెపి కి తలనొప్పి తెప్పించడానికి తద్వారా హుజురాబాద్ ఉపఎన్నిక లో ప్రచారాస్త్రానికి గులాబీ బాస్ వ్యూహం అన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ. చూడాలి ఆ ఎన్నికలు అయ్యాక జలవివాదం తుస్సుమంటుందో బుస్సుమంటుందో తేలిపోనుంది. అప్పుడే నిజం నిప్పులా బయటకు వచ్చేది.

Tags:    

Similar News