దేశంలో కొత్త పన్నులొస్తాయా..?

దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు ఆదాయం చాలక ప్రజలపైనే బారం వేస్తున్నాయి. సంక్షోభం సృష్టించిన ఆర్థిక ఉత్పాతం నుంచి బయటపడాలంటే [more]

Update: 2021-04-26 15:30 GMT

దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు ఆదాయం చాలక ప్రజలపైనే బారం వేస్తున్నాయి. సంక్షోభం సృష్టించిన ఆర్థిక ఉత్పాతం నుంచి బయటపడాలంటే మరో రెండేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తల అంచనా. ప్రభుత్వాలు ఇప్పటివరకూ ఎక్కువగా పరోక్ష పన్నుల ద్వారానే అధిక ఆదాయం తెచ్చుకుంటున్నాయి. ఈ భారం పేదా, ధనిక అనే తేడా లేకుండా అందరిపైనా పడుతోంది. పెట్రోలు, సబ్బులు, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల వంటి వాటిపై కోటీశ్వరుడైనా, నిరుపేద అయినా చెల్లించే పన్ను ఒకటే. ఆదాయపు పన్ను కూడా పూర్తిగా వసూలు కావడం లేదు. రకరకాల మార్గాల్లో పన్ను ఎగవేతకు, రాయితీలకు మార్గాలు వెతుక్కుంటున్నారు పెద్దలు. ప్రత్యక్షంగా లభించే ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల వాటా మొత్తం ఆదాయంలో నాలుగోవంతు కూడా ఉండటం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని గట్టెక్కించడానికి ప్రత్యామ్నాయ పన్నులపై కేంద్రం దృష్టి సారిస్టున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. సంపద పోగుపడుతున్న చోట నుంచి ఏటా అయిదు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు అదనపు సొమ్ము సమీకరించవచ్చనేది ఒక అంచనా. దీనిని అమల్లోకి తెచ్చేందుకు విదేశాల్లో అమలు చేస్తున్న పన్ను విధానాలను అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు నష్టదాయకంగా మారిన ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకుని వాటి ద్వారా లక్షా డెబ్బై అయిదువేల కోట్ల రూపాయల వరకూ ఈ ఏడాది రాబట్టాలని నిర్ణయం. అయితే ఇది కేంద్రానికి పెద్ద ఆదాయమేమీ కాదు. కానీ వాటిని వదిలించుకోవడమే లక్ష్యం.

గాలి వాటం లాభాలు..

కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. కరోనా వంటి విపత్కాలంలో పారిశ్రామిక , వ్యాపార సంస్థలు అనేకం మూత పడ్డాయి. కొన్ని దెబ్బతిన్నాయి. ఇవి ఎక్కువగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. కానీ సేవారంగంలోని సంస్థలు వేల కోట్ల రూపాయలు లాభాలు పొందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టెలి కమ్యూనికేషన్లు, సాఫ్టవేర్, కన్జ్యూమర్ ప్రొడక్టులకు సంబంధించిన కంపెనీలు, ప్రయివేటు బ్యాంకింగ్ రంగం భారీగా లాభాల బాట పట్టాయి. అదే సమయంలో ఫార్మా కంపెనీల లాభాలు దాదాపు రెట్టింపయ్యాయి. తాజాగా కరోనా వాక్సిన్లు తయారు చేస్తున్న కంపెనీలు ఏ విధంగా ఆర్జిస్తున్నది చూస్తున్నాం. వేల కోట్ల రూపాయల అమ్మకాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. గాలివాటంగా వచ్చే లాభాలు(విండ్ ఫాల్ ప్రాఫిట్) పై అదనపు పన్ను విధించాలనేది ఒక ఆలోచన. పాశ్చాత్య దేశాల్లో ఈరకమైన పన్ను విధానం అమల్లో ఉంది. బారత్ లో మాత్రం రాజకీయ కారణాలతో ఇటువంటి చర్యలను ఇంతవరకూ ప్రభుత్వాలు తీసుకోలేకపోయాయి. తాజాగా నెలకొంటున్న ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో ఈ దిశలో చర్యలు చేపడితే అయిదారు లక్షల కోట్ల రూపాయల వరకూ సమకూర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లు సైతం ఈ పద్దులో ఉంటారు. ప్రభుత్వాలు అందుకు సాహసిస్తాయా? అంటే వేచి చూడాల్సిందే.

వారసత్వ ఆస్తులు..

భారతదేశంలో తరతరాలకు కూడబెట్టడమనే జాడ్యం వారసత్వంగా వస్తోంది. సంపద తమ కుటుంబ ఆర్థిక భద్రతకు పరిమితమైతే చాలనుకునేవారు తక్కువ. వారసులు, తరతరాలు విలాస జీవనానికి ఉపయోగపడేంత సంపద కొందరి వద్ద పేరుకుపోతుంది. పిల్లికి భిక్షం పెట్టకుండా వివిధ రకాల మార్గాల్లో కుటుంబ ఆస్తులను పెంచుకుంటూ పోతుంటారు. సమాజానికి ఉపయోగపడాల్సిన స్థిర , చరాస్తులు ఒక్కచోట పోగుపడుతుంటాయి. దీనికి విరుగుడుగా పాశ్చాత్య దేశాల్లో కొన్ని చోట్ల వారసత్వ ఆస్తి పన్ను విధింపును అమలు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి తనకు దఖలు కావాలంటే కొంతమొత్తాన్ని చెల్లించాలి. కొంత వాటా ప్రభుత్వ పరం చేయాలి. దానివల్ల ప్రజల్లో స్వార్థం తగ్గుతుంది. అదే సమయంలో ప్రభుత్వానికి సొమ్ము సమకూరుతుంది. దీనిని కూడా ప్రత్యామ్నాయ పన్ను విభాగంలో చేర్చాలనే సూచనలూ కేంద్రం వద్ద సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పన్ను విధానంపై రాజకీయ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. చాలా మంది ప్రముఖ నాయకులు రాజకీయ వారసత్వంతోపాటు తమ తాతలు, తండ్రుల ఆస్తులపైనా ఆధారపడి అందలం ఎక్కుతున్నారు.

కార్పొరేట్ వ్యవసాయం …

భారతదేశంలో పన్ను నుంచి అత్యధిక మినహాయింపులు పొందుతున్న రంగం వ్యవసాయం. పంటల ఆదాయంపై పన్ను వేయకుండా మినహాయింపు ఉంది. దీనిని కొందరు రాజకీయ నాయకులు, అక్రమార్జనకు పాల్పడే ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వ్రుత్తి నిపుణులు, పారిశ్రామిక వేత్తలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో దాదాపు అయిదు లక్షల మంది ఏటా కోటి రూపాయలకు పైబడి తమకు వ్యవసాయ ఆదాయం చూపిస్తున్నారనేది అంచనా. వీరిలో చాలామందికి ఇతర వ్యాపకాలు సైతం ఉండటం విశేషం. ప్రభుత్వాలు సన్నచిన్న , మధ్యతరగతి రైతులను ద్రుష్టిలో పెట్టుకుని కల్పించిన వెసులుబాట్లను కొందరు పెద్దలు తమ అక్రమ ఆర్జనకు లెజిటిమసీ కల్పించేందుకు వినియోగించుకుంటున్నారు. అందులో తాజాగా కార్పొరేట్ వ్యవసాయం కూడా మొదలవుతోంది. వ్యవసాయ సూపర్ మార్కెట్లు, బిగ్ కార్పొరేట్ల రిటైల్ అవుట్ లెట్లు పెద్ద ఎత్తున దేశంలో ఏర్పాటవుతున్నాయి. వీరు తమ సంస్థలలో విక్రయించేందుకు లీజు పద్దతిన కార్పొరేట్ వ్యవసాయాన్ని మొదలు పెట్టవచ్చు. అప్పుడు మినహాయింపుల నుంచి తప్పించి పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వ్యవసాయ చట్టాలతో ఎదురు దెబ్బలు తిన్న ప్రభుత్వం వ్యవసాయ పన్నుపై ద్రుష్టి పెట్టే సాహసం చేయకపోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మాత్రం అన్వేషిస్తోంది. అందులో ఎంతమేరకు ముందుకెళుతుందో చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News