దుబ్బాకలో బీజేపీ పరిస్థితి ఇదేనా?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే ఇక్కడ అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉందన్న భావన విశ్లేషకులు వ్యక్తం [more]

Update: 2020-10-17 11:00 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే ఇక్కడ అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉందన్న భావన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ బాగా పనిచేస్తుందని అధికార టీఆర్ఎస్ భావిస్తుంది. కానీ టీఆర్ఎస్ లో రెండు వర్గాలుగా చీలిపోవడంతో తనకు లాభిస్తుందని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యన మాత్రమేనంటున్నారు.

రెండుసార్లు ఓడి…..

బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఇప్పటికి దుబ్బాక నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన పై సానుభూతి ప్రజల్లో ఉంది. మరోవైపు ఆయన మిగిలిన అభ్యర్థులకంటే ప్రచారంలో ముందున్నారు. మొన్నటి వరకూ సోలిపేట రామలింగారెడ్డి, చెరకు ముత్యంరెడ్డి వర్గాలు రెండూ టీఆర్ఎస్ లోనే ఉండేవి. అందుకే ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

మొన్నటి వరకూ ఇద్దరూ…..

చెరకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగారు. ఇద్దరు మొన్నటి వరకూ ఒకే పార్టీలో ఉండటంతో వీరిద్దరూ ప్రభుత్వ అనుకూల ఓట్లను చీల్చుకునే అవకాశాలున్నాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఈఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ప్రస్తుతం రెండో ప్లేస్ లోకి వచ్చామని బీజేపీ భావిస్తుంది.

అభివృద్ధిపై పెద్దయెత్తున చర్చ……

ఇందుకు కారణాలు కూడా బీజేపీ చెబుతోంది. గత కొన్నిసార్లుగా టీఆర్ఎస్ అభ్యర్థిని దుబ్బాక నియోజకవర్గంలో గెలిపిస్తున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ఆరేళ్లలో అభివృద్ధి చెందినా దుబ్బాకలో మాత్రం డెవెలెప్ మెంట్ లేకపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఇది తమకు అడ్వాంటేజీగా మారుతుందని బీజేపీ భావిస్తుంది. మొత్తం మీద దుబ్బాకలో బీజేపీ అద్భుతాలు సృష్టించకపోయినా కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని మాత్రం ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News