దుబ్బాకలో అందరిదీ ఇదే దారేనా?

దుబ్బాక నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వార్ వన్ సైడ్ అని చెబుతున్నప్పటికీ ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ ఎవరి వైపు మొగ్గు [more]

Update: 2020-10-15 09:30 GMT

దుబ్బాక నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వార్ వన్ సైడ్ అని చెబుతున్నప్పటికీ ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది. దుబ్బాక టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు ప్రధాన పార్టీలూ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. దుబ్బాకలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

రామలింగారెడ్డి సతీమణి….

అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మృతి చెందిన రామలింగారెడ్డి సతీమణి పోటీ చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరకు శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. బీజేపీ తమ పాత అభ్యర్థి రఘునందనరావు పేరునే ఖరారు చేసింది. రామలింగారెడ్డి మరణంతో ఆయన భార్యకు టిక్కెట్ ఇవ్వడంతో సెంటిమెంట్ పనిచేస్తుందని టీఆర్ఎస్ భావిస్తుంది. అంతేకాకుండా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దుబ్బాకలో తమను గట్టెక్కిస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది.

తండ్రి చేసిన అభివృద్ధి…

ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి కూడా తన తండ్రి చేసిన అభివృద్ధి పనులపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. తన తండ్రి చెరకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప దుబ్బాకలో అసలు అభివృద్ధి జరిగిందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగలేదని శ్రీనివాసరెడ్డి నిలదీస్తున్నారు. తన తండ్రి చేసిన అభివృద్ధి తనను గెలుపు బాట పట్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థి కూడా….

మరోవైపు బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఆయన గత రెండు దఫాలుగా బీజేపీ అభ్యర్థిగా దుబ్బాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వమని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటుతున్నా నిరుద్యోగులను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రఘునందనరావు తన ప్రచారంలో విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ ను రాజేస్తూ ప్రజల్లోకి వెళుతున్నాయి.

Tags:    

Similar News