వ్యూహాత్మకంగానేనా…?

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనక కాంగ్రెస్, జేడీఎస్ ల వ్యూహం దాగి ఉందంటున్నారు. సంకీర్ణ సర్కార్ ను కూల్చివేయడంలో కీలక భాగస్వామ్యులైన 17 [more]

Update: 2019-07-28 18:29 GMT

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనక కాంగ్రెస్, జేడీఎస్ ల వ్యూహం దాగి ఉందంటున్నారు. సంకీర్ణ సర్కార్ ను కూల్చివేయడంలో కీలక భాగస్వామ్యులైన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. వారు 2023 ఎన్నికల వరకూ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అంటే 2023లో కర్ణాటక శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు .అంతే తప్ప ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి వీలులేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

అందలం ఎక్కకుండా…..

దీనిపై న్యాయస్థానాన్ని ఖచ్చితంగా వేటు పడిన ఎమ్మెల్యేలు ఆశ్రయిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ స్పీకర్ వేటు వేసింది నమ్మకం ద్రోహానికి పాల్పడిన వారు రాజకీయంగా అందలమెక్కకుండా చేయడానికే నని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేందుకే 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ముంబయి వెళ్లారు. ఈ రాజీనామాల వెనక బీజేపీ ఉందన్న సంగతిని పసిగట్టినా అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లు ఏమీ చేయలేకపోయాయి.

మంత్రి పదవులు రాకుండా….

దీంతో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయింది. ప్రభుత్వం కుప్ప కూలింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా నిన్ననే ప్రమాణస్వీకారం చేశారు. అయితే యడ్యూరప్ప మంత్రివర్గంలో కొందరు రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవుల కోసమే వారు బీజేపీకి అండగా నిలిచారన్న టాక్ కూడా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ రమేష్ కుమార్ చేత వారందరిపై వేటు వేసి మంత్రి పదవులు చేపట్టకుండా వ్యూహాన్ని రచించింది.

వేటు పడిన ఎమ్మెల్యేలు….

కర్ణాటక శాసనసభలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో ప్రతాప్ గౌడ్ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, బీఈ బసవరాజు, ఆనంద్ సింగ్, రోషన్ బేగ్, కె.సుధాకర్, మునిరత్న, ఎంటీబీ నాగరాజు, విశ్వనాధ్, కె. గోపాలయ్య, నారాయణగౌడ, శ్రీమంత పాటిల్ పై అనర్హత వేటు పడింది. న్యాయస్థానం స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టకుంటే ఆరు నెలల్లోగా 17 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మరో మినీ సమరం కర్ణాటకలో జరగబోతోంది.

Tags:    

Similar News